ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడిన వైనం దేశ వ్యాప్తంగా సంచనలంగా మారిన సంగతి తెలిసిందే. దేశం నలుమూలలకూ వీళ్లు వెళ్లారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా వీరు కరోనా వైరస్ ను తీసుకెళ్లారనే భయాలు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ను ప్రకటించేసి..పరిస్థితి కంట్రోల్ లోకి వస్తుందని ఆశించిన ప్రభుత్వాలకు వీళ్లు షాకే ఇచ్చారు. వీరు ఢిల్లీ నుంచి గల్లీల వరకూ ప్రయాణించిన నేపథ్యంలో ఎంతమందికి ఈ వైరస్ అంటుకుని ఉంటుందనేది భయాందోళనలతో కూడుకున్న అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ నుంచి ఢిల్లీ ప్రార్థలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య దాదాపు 1085 మంది అని గుర్తించిందట ప్రభుత్వం. వీరిని పట్టుకుని పరీక్షలు కూడా మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. వారిలో ఇప్పటి వరకూ 70 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టుగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇప్పటి వరకూ 585 మందికి పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన వారికి పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయని వివరించారు. అయితే ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 21 మంది ఎక్కడున్నారనే విషయాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా సీఎం చెప్పారు.
అనుమానితుల విషయంలో చుట్టుపక్కల వాళ్లు కూడా ప్రభుత్వాధికారులకు సమాచారం ఇవ్వొచ్చని సీఎం తెలిపారు. ఇప్పటి వరకూ ఏపీలో గుర్తించిన కరోనా కేసుల్లో మెజారిటీ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే అని జగన్ తెలిపారు. అయితే వీరు ఇంకా ఎవరికైనా వైరస్ ను అంటించి ఉంటారా? అనే అంశం కూడా కీలకమైనదని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని, కరోనా లక్షణాలు ఏవి కనిపించినా, ఎవరైనా 104కు ఫోన్ చేసి వైద్యం పొందవచ్చని జగన్ ప్రకటించారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం ద్వారా అందరి పట్లా జాగ్రత్తగా వ్యవహరించాలని జగన్ సూచించారు.