ఇసుక విషయంలో అవినీతిని పూర్తిగా అరికట్టినట్టుగా తాము సగర్వంగా చెప్పగలమని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇసుక తవ్వకాలు పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అంశంపై చర్చించి, జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఇసుక విషయంలో అక్రమాలను తాము పూర్తిగా సరి చేస్తున్నట్టుగా జగన్ చెప్పారు. అప్పుడు ఇసుకను తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎడాపెడా దోచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
ఇసుక కొరత ఉండిన మాట వాస్తవమే అని, భారీ వర్షాలతో వాగులు, వంకల్లో నీరు నిండగా.. ఇసుకను తవ్వే మార్గం లేకుండాపోయిన వైనాన్ని జగన్ ప్రస్తావించారు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని తమమీద రాళ్లేస్తున్నారని పుష్కలమైన వర్షాలు పడటం వల్ల, ఇసుక ఇప్పుడు తిరిగి వచ్చి చేరుతోందని ఇది మేలుచేసే అంశమని జగన్ ప్రస్తావించారు. ఇసుక విషయంలో ఎక్కడ అక్రమాలు జరిగినా అరికట్టడానికి కలెక్టర్లకు ఎస్పీలకు పూర్తి లైసెన్స్ ఇచ్చినట్టుగా జగన్ గుర్తుచేశారు.
గతంలో ఎప్పుడూలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి, వరదలు వస్తున్నాయని, వర్షాలు ఇలా రావడం రైతులకు మంచిదేనని, తెలుగుదేశం నేతలు దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదేనని జగన్ వ్యాఖ్యానించారు. కానీ రాబందులు మాదిరిగా మనపై వాళ్లు రాళ్లు వేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై వ్యాఖ్యానించారు. వరదలు కారణంగా 90 రోజుల్లో ఇసుకను ఆశించినంత రీతిలో తీయలేకపోతున్నట్టుగా చెప్పారు.
వచ్చే వారానికి వరదలు తగ్గుముఖం పట్టవచ్చని.. వారంరోజుల పాటు ఇసుక మీద పని చేసి ఎవరికీ మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని జగన్ సూచించారు. దుష్ప్రచారాలను ఖండించే బాధ్యత తీసుకోవాలన్నారు. పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడాన్ని పూర్తిగా అరికట్టాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఈ విషయంపై డీజీపీ స్వయంగా సమీక్షించాలన్నారు. ఇంతకుముందు అవినీతి, మాఫియాల సాయంతో ఇసుకను ఎడాపెడా తరలించారని, అప్పుడు భవన నిర్మాణ కార్మికులకు పని దొరికేది, ఇప్పుడు దొరకడం లేదనేది అసంబద్ధమని అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి, అన్నిచోట్లా యంత్రాలు కాకుండా మాన్యువల్‌గా మనం ఆపనిచేస్తున్నట్టుగా వివరించారు. దీనివల్ల ఇప్పుడు మరింతగా పనులు వారికి లభిస్తాయన్నారు. వచ్చే వారంరోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుందని సీఎం వ్యాఖ్యానించారు.