కరోనా కష్టకాలంలో ఎవరు ఏంటి? అనే విషయం కళ్లకు కడుతోంది. రోగానికి భయపడి పక్క రాష్ట్రానికి పారిపోయిన ప్రతిపక్ష నాయకుడ్ని చూశాం. కేసులు పెరగడంతో ప్రజాగ్రహం చూడాల్సి వస్తుందేమోనని.. కొన్నాళ్లు మీడియాకి మొహాన్ని చాటేసిన ముఖ్యమంత్రిని చూశాం. ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే.. కుర్చీలాట ఆడుతున్న అధికార పక్షాలనూ చూస్తున్నాం. చప్పట్లు కొట్టండి, కాగడాలు వెలిగించండి, పూలు చల్లండి అంటూ తీపికబుర్లు చెప్పి, లాకులెత్తేసి వీకైపోయిన ప్రధానిని చూశాం. ఇలాంటి కష్ట-నష్ట కాలంలో కూడా ప్రజల బాగోగులు పట్టించుకుంటున్న ఏకైక సీఎంగా రికార్డులకెక్కారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
పారాసెట్మాల్ వేసుకోమంటే కామెడీ చేశారు, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే ఎకసెక్కాలాడారు. అలా నోరు చేసుకున్నోళ్లంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కేసులు పెరుగుతున్నా ధైర్యంగా పాలనకే ప్రాధాన్యమిస్తున్న సీఎం అంకిత భావాన్ని శంకించగలమా..? నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న దశలోనూ ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం తపనపడుతున్న ప్రజా నాయకుడు జగన్ ని తప్పుపట్టగలమా..?
అప్పు చేసైనా సరే ప్రజల ఆకలి తీరుస్తున్నారు జగన్. కేవలం రేషన్ సరకులు పంపించి కేంద్రం చేతులు దులుపుకుంటున్న సమయంలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నా.. మన దేశంలో మాత్రం రేట్లు పెంచి పేదల నడ్డి విరిచింది కేంద్రం. ప్రజలకు కేటాయించిన ఆర్థిక ప్యాకేజీ ఎటుపోయిందో, ఎవరి జేబులోకి వెళ్లిందో తెలియదు కానీ.. డీజిల్, పెట్రోల్ పై రేట్లు పెంచి కులాసాగా ఉన్నారు ఢిల్లీ పెద్దలు.
నిధులన్నీ కేంద్రం జేబులోకే వెళ్తున్న దశలో.. పెట్రోల్-డీజిల్ పై అతి తక్కువ మొత్తంలో ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీనిపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం విడ్డూరం. జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్న మేథావులంతా ముందు కేంద్రాన్ని నిలదీయాలనే మాట మర్చిపోయారు.
వ్యాట్ పెంచి మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెంచలేదు జగన్. భ్రమరావతి గ్రాఫిక్స్ కి కూడా వాడుకోలేదు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే దాన్ని బదిలీ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏపీలో జరిగినట్టు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదు, కరోనా రోగులకు వైద్య సౌకర్యాలు అందించడంలో కూడా మన రాష్ట్రమే ముందుంది. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రికి అందరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉంది.
కేసులు తక్కువగా ఉన్నప్పుడు మాటలు చెప్పి, కేసులు పెరిగాక మౌనవ్రతం పాటిస్తున్న ప్రధాని మోడీ కంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే వందరెట్లు బెటర్. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది లాగే సీఎం జగన్ కూడా అసలైన కరోనా వారియర్.