రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న దారుణ రాజకీయ పరిస్థితులకు అసలు కారణాలేంటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెచ్చగొట్టే చర్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి తనపై ప్రజలు కనబరుస్తున్న ప్రేమాభిమానాల్ని ప్రధాన ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోవడమే కారణమని స్పష్టం చేశారు.
‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ టీడీపీ వ్యవహారాలపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో తాను ఉన్నప్పుడు ఇలా మాట్లాడలేదన్నారు.
ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా తనపై ప్రజాభిమానాన్ని జీర్ణించుకోలేక ఎలా తయారయ్యారో అందరూ చూస్తున్నారన్నారు. వీళ్లే బూతులు తిడతారన్నారు. ఎవరూ వినలేని, మాట్లాడలేని రీతిలో బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ బూతులు వినలేక, టీవీల్లో చూడలేక మనల్ని అభిమానించే వాళ్లలో బీపీ పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా రియాక్షన్ కనిపిస్తోందన్నారు. కావాలని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆరాటం మన ఖర్మ కొద్ది రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు.
అబద్ధాలు ఆడతారని, అసత్యాలు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ప్రతిమాటలోనూ, రాతలోనూ వంచన, వక్రబుద్ధి కనిపిస్తుందన్నారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా ఏ మాత్రం వెనకాడరన్నారు.
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడతారన్నారు. వ్యవస్థల్ని పూర్తిగా మేనేజ్ చేసే పరిస్థితులు మన కళ్ల ముందే ఉన్నాయన్నారు.