దమ్ముంటే రా.. లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్

టీడీపీ నేతలంతా తమకు తామే గిల్లుకొని, తామే గుక్కపెట్టి ఏడుస్తున్నారని విమర్శించారు మంత్రి అనీల్ కుమార్. ముఖ్యమంత్రి జగన్ ను అనరాని మాటలు అనడమే కాకుండా, తిరిగి వాళ్లే బంద్ కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా…

టీడీపీ నేతలంతా తమకు తామే గిల్లుకొని, తామే గుక్కపెట్టి ఏడుస్తున్నారని విమర్శించారు మంత్రి అనీల్ కుమార్. ముఖ్యమంత్రి జగన్ ను అనరాని మాటలు అనడమే కాకుండా, తిరిగి వాళ్లే బంద్ కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ నేతల్ని విమర్శిస్తున్న లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మంత్రి. నిజంగా అంత దమ్ముంటే వచ్చి తనను టచ్ చేయాలన్నారు.

“లోకేష్.. నీకు నిజంగా అంత దమ్ముంటే వచ్చి నన్ను టచ్ చేయి. నా కాన్వాయ్ ఉండదు, పోలీసులు కూడా ఉండరు. నేను ఒక్కడ్నే ఉంటా. నెల్లూరులోనే 20 రోజులు ఉంటా. ఇంటిపై దాడిచేస్తాం అన్నావుగా. మగాడివైతే వచ్చి దాడి చేయి. డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపించు. నిజంగా మీ నాన్న రాయలసీమలో పుట్టి ఉంటే, నెల్లూరు వచ్చి నా కార్యకర్తను టచ్ చేయి.”

లోకేష్ మాటలు బ్రహ్మానందానికి ఎక్కువ, సునీల్ కు తక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశాడు అనీల్. రాజకీయాల్లో కామెడీ పీస్ గా ఉన్న లోకేష్.. దాన్నే మెయింటైన్ చేస్తే మంచిదని, ఎక్కువ మాట్లాడితే ప్రజలు మరోసారి మూల కూర్చోబెడతారని అన్నారు.

“టీడీపీ చెంచాలందరికీ చెబుతున్నాను. వాడ్ని (లోకేష్) నమ్మి పోయారంటే గోదాట్లో కుక్క తోక పట్టుకొని ఈదినట్టే. ఆ దద్దమ్మ బయటకు రాడు. పెద్ద వేస్ట్ అనే విషయం చంద్రబాబుకే తెలుసు. అలాంటోడ్ని నమ్ముకొని టీడీపీ చెంచాలు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.”

జరిగిన ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై కూడా అనీల్ స్పందించారు. ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు స్పందించకుండా, టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందంటూ పవన్ స్పందించడం కామెడీగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అవ్వదా, టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందా అని ప్రశ్నించారు.