అంతవరకూ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల అమలు అంటే..అదేమిటని ఆలోచించాల్సిన పరిస్థితి. మూడు నెలలకు ఒకసారి జన్మభూమి అంటూ పెట్టడం.. ప్రజా సమస్యల గురించి అర్జిలు తీసుకోవడం, వాటిని మండలాఫీసులో పడేయడం!
రైతుల సమస్యలకు పరిష్కారం మోనోక్రోటోఫాస్ మందును తలా రెండు లీటర్లు ఉచితంగా పంచడం అనే లెవల్లో సాగిన పాలన అది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఆ మోనోక్రోటోఫాస్ అనేక మంది రైతుల ఆత్మహత్యలకు మార్గాన్ని చూపింది!
ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ అంటే.. కరెంటు తీగల మీద బట్టలారేసుకోవడానికా.. అంటూ వెటకారాలు ఆడారు నాటి పాలకులు. ఆ తర్వాత ఎంత మార్పు వచ్చిందంటే.. వైఎస్ తెచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ తాము కూడా కొనసాగిస్తామంటూ ఆయన ప్రధాన ప్రత్యర్థి వీధివీధీ తిరిగి చెప్పుకోవాల్సి వచ్చింది!
వైఎస్ తెచ్చిన పథకాలను కొనసాగించడానికి నువ్వెందుకు? అని సదరు వైఎస్ ప్రత్యర్థిని అధికారానికి మరోసారి దూరంగానే ఉంచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు!
వైఎస్ రాజశేఖర రెడ్డి పై ఎన్ని విమర్శలు పడని వారు ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు గాక, అందులో పడని తనమే తప్ప.. ఆ విమర్శల్లో సహేతుకత ఉండదు. వారు అభిమానించే నాయకుడి గురించి అదే రీతిన మాట్లాడితే వాళ్లు మొహాలు మరెక్కడో పెట్టుకోవాల్సి ఉంటుంది.
వైఎస్ తెచ్చిన సంక్షేమ రాజ్యంతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిపోయింది. పల్లెలకు కొత్త కళ వచ్చింది. పాడు బడిన ఊళ్లకు ఇందిరమ్మ గృహాలు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. రైతులకు ఇచ్చిన భరోసా, ప్రకృతి కరుణతో పల్లె సీమలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ ఇచ్చిన ప్రాధాన్యతతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయి, మారుతూ ఉన్నాయి.
వైఎస్ పాదు చేసి వెళ్లారు.. ఆ పాదులోనే మిగతా పాలకుల పాలనా సాగుతోంది. వైఎస్ ఉన్న రోజుల్లో ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ తన అసెంబ్లీ ప్రసంగాల్లోనే వైఎస్ తెచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులను తిట్టిన నోటితోనే వైఎస్ పథకాలను పలుసార్లు మెచ్చుకున్నారు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కు వైఎస్ గొప్పదనాన్ని ఒప్పుకోవడానికి మనసు రాకపోవచ్చు. అయితే వైఎస్ పథకాలను మాత్రం తప్పనిసరిగా కొనసాగించాల్సి వచ్చింది. అలా తనను ద్వేషించిన వారిపై కూడా తన ప్రభావాన్ని పడేలా చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.
వైఎస్ సంపాదించుకున్న అంతులేని ప్రజాదరణ ఆయన తనయుడిని అమితానందానికి గురి చేయడమే కాదు, తను కూడా అంతటి ఆదరణ పొందాలనే ఒక రకమైన లక్ష్యాన్ని ఏర్పరిచినట్టుగా ఉందని స్పష్టం అవుతోంది. అచ్చం తండ్రి రీతిలోనే జగన్ పాలనా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా మళ్లీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర లేదు. అలాంటి చరిత్రకు బీజం వేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ తన పాలనతో వేసిన పునాదిపై జగన్ సొంత పార్టీలో పదేళ్లు కష్టపడి అధికార సౌధాన్ని నిర్మించారు.
వైఎస్ భౌతికంగా దూరమై 11 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకవేళ ఆయన ఆ ప్రమాదానికి గురి కాకపోయి ఉంటే.. ఈ 11 యేళ్లూ మరోలా ఉండేవి. దేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రత్యేక నేతగా నిలిచే వారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జాతీయ స్థాయిలో వేధిస్తున్న నాయకత్వ సమస్యకు ఒక పరిష్కారం అయ్యేవారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.