2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తి దాదాపు రెండేళ్లు కావొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలు అక్కడి రాజకీయ పరిస్థితి గురించి పూర్తి స్పష్టతను ఇస్తున్నాయి. ముందుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తు మీద కాకుండా, అధికారికంగా పార్టీల ప్రమేయం లేకుండా జరగడంతో.. ఎవరికి పడ్డ ఓట్లు ఎన్ని? అనేది కచ్చితంగా తేలలేదు.
దానికి తోడు చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి..తమ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయంటూ ప్రకటించుకున్నారు. ఆయనకు ఎలాగూ మీడియాపై పట్టుంది కాబట్టి.. ఆ శాతంపై ఎలాంటి ధ్రువీకరణ లేకపోయినా అదే నిజం అన్నట్టుగా పచ్చమీడియా ప్రచారం చేసింది. అయితే ఇంతలోనే జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పూర్తి స్పష్టత రానే వచ్చింది.
పార్టీల గుర్తుల మీద జరిగిన మున్సిపోల్స్ తో ఎవరి సత్తా ఏమిటో బయటపడనే పడింది. సార్వత్రిక ఎన్నికలు జరిగిన దాదాపు రెండేళ్లకు జరిగిన మున్సిపోల్స్ తో ప్రజల్లో ఏ పార్టీకి ఎంత ఆదరణ ఉందో క్లారిటీ వచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో ఏకంగా 50 శాతం ఓట్లను పొందింది జగన్ పార్టీ. అయితే మున్సిపోల్స్ లో అంతకు మించి సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతం 52.63 అని తేలుతోంది.
పోల్ అయిన ప్రతి వంద ఓట్లలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52కు పైగా పడ్డాయి. అందునా.. చాలా చోట్ల ఏకగ్రీవంగా వివిధ వార్డులు పూర్తయ్యాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాల వరస భారీగా ఉంది. వాటిల్లో కూడా ఓట్లు పోల్ అయ్యే పరిస్థితి ఉండుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డ మొత్తం ఓట్ల శాతం కచ్చితంగా ఏ అరవైకో చేరేది! ఒకటికి మించి నామినేషన్లు దాఖలు అయిన చోట మాత్రమే పోలింగ్ కాబట్టి, అలాంటి చోట కూడా దాదాపు 53 శాతం ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందింది.
ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికలప్పుడు టీడీపీ సాధించిన ఓట్ల శాతం దాదాపు 40. సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు కూడా ముందు రకరకాల తాయిలాలు ఇచ్చి, చంద్రబాబు నాయుడు అప్పుడు 40 శాతం ఓట్లను పొందారు. అయితే ఇప్పుడు ఆ పోలింగ్ పర్సెంటేజ్ కాస్తా 30 శాతానికి వచ్చింది. వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలు కూడా టీడీపీకి ఈ మాత్రం ఉనికిని నిలుపుతున్నాయి. వాటిల్లో కూడా ఓటింగ్ జరిగి ఉంటే.. టోటల్ ఓట్ షేర్ లో టీడీపీ వాటా మరింత తగ్గిపోయేది. అది ఏ పాతిక శాతానికో చేరినా పెద్ద ఆశ్చర్యం లేదు.
ఇక పంచాయతీ ఎన్నికల్లో తన పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయంటూ చెప్పుకున్న పవన్ కల్యాణ్ పార్టీకి మున్సిపోల్స్ లో దక్కిన ఓట్ల శాతం 4.67. కనీసం ఐదు శాతం ఓట్లను కూడా పొందలేకపోయింది జనసేన. ఇక తామే రెండో ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటున్న బీజేపీకి సరిగ్గా రెండు శాతమే ఓట్లు వచ్చాయి. 2.41 శాతం ఓట్లతో నిలిచింది కమలం పార్టీ.
సీపీఐ, సీపీఎంలు చెరో 0.80 శాతం ఓట్లతో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ 0.67 శాతం ఓట్లను పొందింది. నోటాకు 1.07 శాతం ఓట్లు పడ్డాయి ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో.
వాస్తవానికి పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు తక్కువే. పల్లెలే వైఎస్ఆర్సీపీకి పట్టుగొమ్మలు. మరి పట్టణాల్లోనే సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి సుమారు మూడు శాతం ఓట్లను వైఎస్సార్సీపీ పెంచుకోగలిగింది అంటే, పల్లెల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. 80 శాతం పల్లె పంచాయతీలను తాము నెగ్గినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని, మున్సిపల్ ఎన్నికలతో పూర్తి స్పష్టత వస్తోంది.