ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అంశంపై మంగళవారం రాజ్యసభలో కార్యకలాపాలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డితోపాటు ప్రతిపక్ష సభ్యులు తాము రూల్ 267 కింద తాము ఇచ్చిన నోటీసును అనుమతించాలని కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ రూల్ 267 కింద ఈరోజు 15 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని అందులో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఇప్పటికిప్పుడు తాను చర్చకు అనుమతించలేనని అన్నారు.
విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది కూడా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశమే అంటూ దీనిపై చర్చకు మీరు ఎప్పుడు అనుమతిస్తారని ప్రశ్నించారు. చైర్మన్ దీనికి సమాధానం చెబుతూ దీనిపై వాదన వద్దని, ఈ అంశం (ప్రత్యేక హోదా) మీకు (రాష్ట్ర ప్రభుత్వం) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని జవాబిచ్చారు. దీంతో విజయసాయి రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసనకు దిగారు. ఇంతలో సభను సభలో గందరగోళం ఏర్పడటంతో చైర్మన్ సభను గంటపాటు వాయిదా వేశారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా వైఎస్సార్సీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ దశలో బీజేపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పియూష్ గోయల్ జోక్యం చేసుకుంటా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి మీరు చాలా సీనియర్ పార్లమెంటేరియన్, పార్లమెంట్ సభా మర్యాదులు బాగా అవగతం చేసుకున్నవారు. కోవిడ్ ఎంతటి విలయం సృష్టిస్తున్నదో మీకు తెలుసు.
దేశంలోనే కాదు ప్రపంచంలోనే కోవిడ్ మహమ్మారి యావత్ మానవాళికే సవాలుగా నిలిచింది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు యావత్తు సమాజం కోవిడ్ బారినపడి అల్లాడుతోంది. అలాంటి అతి ముఖ్యమైన అంశంపై సభ చర్చకు సమాయాత్తమైంది. యావత్ దేశం మనం ఏ చర్చిస్తామోనని చూస్తోంది. మీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి సభలో సుహృద్భావ వాతావారణం నెలకొని చర్చ కొనసాగడానికి సహకరించండి.
మీరు కూడా చర్చలో పాల్గొని కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మీ ప్రభుత్వం అనుభవాలు, సలహాలు, సూచనలను తోటి సభ్యులతో పంచుకోండి. ఆందోళనను విరమించి చర్చలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని అన్నారు. అయినప్పటికీ పోడియం వద్ద ఉన్న వైఎస్సార్సీ ఎంపీలు మాకు న్యాయం కావాలి అని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను ముందుకు సాగనీయకపోవడంతో సభ తిరిగి కొద్ది సేపు వాయిదా పడింది.
అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించలేం జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలతో సహా హనుమంతుడి జన్మస్థలం తిరుమలకు ఉత్తరంగా జాపాలి తీర్ధంలోని అంజనాద్రి పర్వతమేనని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ధారించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అన్న ప్రశ్నకు టీటీడీ దీనిపై విడుదల చేసిన పుస్తకం, పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు చెప్పారు.