ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అనుచిత వ్యాఖ్య చేసిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందనరావు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
సోషల్ మీడియా వేదికగా ఈ బీజేపీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రఘునందనరావు అసందర్భ ప్రేలాపనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆ విధంగా స్పందించింది.
ఇప్పుడు రఘునందనరావుకు వైఎస్ఆర్ మరణం గురించి స్పందించాల్సిన అవసరం ఏదీ లేదు. అయితే మూడో సారి పోటీ చేసి వెయ్యికి పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గే సరికి ఆయన గాల్లో తేలిపోతూ ఉన్నారు.
ఎమ్మెల్యే అయిన విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నట్టుగా ఉన్న సదరు పువ్వు పార్టీ నేత .. వైఎస్ గురించి కూడా మాట్లాడేశారు. గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు, తెలివిలేని కాంగ్రెస్ వాళ్లు వైఎస్ ఫొటోను వాడుకోవడానికి ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. అయినా వైఎస్ ప్రస్తావన తెచ్చారు రఘునందనరావు.
ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్చార్జ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ముందుగా ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడేంత స్థాయి రఘునందనరావుకు లేదని, అనుచితంగా మాట్లాడవద్దని ఆయన హెచ్చరిస్తూ పోస్టు చేశారు. ప్రజల కోసం వెళ్తూ వెళ్తూ వైఎస్ఆర్ ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఆ మరణం గొప్పదనే విషయాన్ని దేవేందర్ రెడ్డి ప్రస్తావించారు.
ఆ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. బహుశా రఘునందనరావు కొంత కాలం కిందటే కాషాయం వేసుకున్నారని, బీజేపీ నేతలు ఎలా మరణించారో తెలుసుకోవాలని కొందరు తలంటారు.
ఎమ్మెల్యే గా నెగ్గిన అత్యుత్సాహంలో ఉన్న రఘునందనరావు ఇలా అనుచితంగా మాట్లాడి.. ఇలా విమర్శల పాలవుతున్నారు.