పండ్లు అందరికీ ఇష్టమే. అరటి పండ్లు, ఆపిల్, ద్రాక్ష ఎవరైనా తింటారు. ఇంకాస్త డబ్బున్నోళ్లు దిగుమతి చేసుకున్న ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ తింటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండు మాత్రం అలాంటిలాంటి ఫ్రూట్ కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇది. దీని పేరు యుబారీ మెలన్.
చూడ్డానికి ఇది మన కర్బుజా లానే ఉంటుంది. సైజులో మాత్రం పుచ్చకాయ అంత ఉంటుంది. కానీ దీన్ని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. కేజీ యుబారీ మెలన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 20 లక్షల రూపాయలు. అవును.. చేతిలో 20 లక్షల రూపాయలు ఉంటే తప్ప ఈ పండు దక్కించుకోలేం.
ఇంతకీ ఇది ఏ దేశంలో దొరుకుతుందో తెలుసా? జపాన్ దేశానికి చెందిన పండు ఇది. ఆ దేశంలో కూడా కేవలం యుబారీ అనే ప్రాంతంలో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు (గ్రీన్ హౌజ్ లో) పండిస్తారు. జపాన్ లో సామాన్యులకు ఈ పండు అందుబాటులో ఉండదు. కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే. అది కూడా ముక్కలు చేసి అమ్ముతారు. ఒక్కో ముక్కను గ్రాముల్లో కొలిచి అమ్ముతారు.
సాధారణంగా శీతాకాలం ప్రారంభంలో ఇది పండుతుంది. ఒక చెట్టుకు ఒక పండు మాత్రమే కాస్తుంది. ఎక్కువ పండ్లు పూర్తిగా పక్వానికి రాకముందే కుళ్లిపోతాయి. కాయగా ఉన్నప్పుడు దీన్ని తినలేం. కాబట్టి వీటి లభ్యత చాలా తక్కువ. అందుకే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో ఇది దొరకదు. బాగా పండిన పండును ముక్కలుగా కోసి ప్రత్యేకంగా వేలం వేసి అమ్ముతుంటారు.