ప్రశాంత్ కిషోర్.. ప్రశాంత్ కిషోర్… దేశ రాజకీయాల్లో ఈ పేరు మార్మోగుతూ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయంతో పీకే పేరు మరింత హాట్ గా మారింది. పీకే ఎక్కడ అడుగుపెడితే, ఎవరి తరఫున స్కెచ్ వేస్తే వారిని విజయం వరిస్తుందనేంత స్థాయిలో పాపులారిటీ ఇతడి సొంతం అవుతూ ఉంది. ఊపు మీదున్న రాజకీయ పార్టీల తరఫున పీకే పని చేయడం, అవి ఘన విజయం సాధించడం జరుగుతూ ఉంది. ఇది పీకే అదృష్టమో లేక ఆ పార్టీల లక్కో చెప్పడం కష్టమే!
ఇలాంటి క్రమంలో పీకే తదుపరి అసైన్ మెంట్స్ రెడీ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనది బెంగాల్ లో టీఎంసీ తరఫున పని చేయడం. లోక్ సభ ఎన్నికల్లో అక్కడ మమత పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. బీజేపీ అనూహ్య విజయాలు కొన్నింటిని సాధించింది. ఆ ఫలితాలతో బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పట్టు విడవకూడదని దీదీ కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగా పీకేతో ఆమె పార్టీ ఒప్పందం కూడా చేసుకుంది.
ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కు మరింత పెద్ద పీట వేస్తోంది దీదీ. తనకు నచ్చిన వారిని నెత్తిన పెట్టుకునే మమత ఆయనకు ఇప్పుడు జెడ్ కేటగిరి భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తుండటం గమనార్హం. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున పీకేకు జెడ్ కేటగిరి భద్రత ఏర్పాట్లకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. తను రాజకీయ నేత కాకపోయినా.. కేవలం వ్యూహకర్తగానే.. పార్టీలకు నచ్చేస్తూ పీకే జెడ్ కేటగిరి స్థాయికి ఎదిగాడు.