ఎట్టకేలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏ కేసు కింద అరెస్ట్ చేశారో స్పష్టత రాలేదు.
గత కొన్ని రోజులుగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యంపై మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత, ఆయన కనిపించకపోవడం పలు అనుమానాలకు తావచ్చింది.
ఆయన సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాప్‌లో ఉంటోంది. మహారాష్ట్రలో ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను భీమవరంలో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. ఈటల భూకబ్జాల వ్యవహారంలోనా, లేక అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును అరెస్ట్ చేశారా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో వారం క్రితం ఆయన మంథని నుంచి ఎటో వెళ్లిపోయారని టీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.
ఈటల రాజేందర్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న మధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కన్నేసి ఉంచారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పుట్ట మధు అదృశ్యంపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ ఘాటుగా స్పందించారు.
పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె అన్నారు. తన భర్తకు స్వల్ప కోవిడ్ లక్షణాలున్నాయని, విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేశాడని ఆమె అన్నారు. ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో తమ అనుబంధం గురించి కూడా ఆమె మాట్లాడారు.
ఈటల టీఆర్ఎస్లో ఉండడం వల్లే ఆయన్ను కలిశామన్నారు. తాము ఎప్పటికీ టీఆర్ఎస్తోనే ఉంటామన్నారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది సీఎం కేసీఆరేనని ఆమె స్పష్టం చేశారు.
కొందరు కావాలనే తన భర్తపై దుష్ప్రచారం చేస్తున్నారని శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ తర్వాత పుట్ట మధు భవిష్యత్ ఏమిటన్నది ఒకట్రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.