కరోనా మొదటి డోసు ప్రజలకు అందని ద్రాక్షలా తయారైంది. మొదటి డోసు టీకా వేయించుకున్న వాళ్లకు మాత్రమే రెండో డోసు వేస్తామని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా టీకాలు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. మొదట మే 1వ తేదీ నుంచి 18 నుంచి ప్రతి ఒక్కరికీ టీకా వేస్తామని ప్రభుత్వాలు చెప్పడంతో జనాలు ఎంతో ఆశగా ఎదురు చూశారు.
ఆ రోజు రానే వచ్చింది. ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. టీకాలతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసే పవర్ కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం మాత్రం రాష్ట్రాల డిమాండ్‌ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. తమ ఇష్టం వచ్చినట్టు మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్త వారికి కొంత కాలం పాటు తొలి డోసు టీకా వేసే అవకాశమే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. దయచేసి వారు దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరడం గమనార్హం.
ప్రస్తుతం రెండో డోసు మాత్రమే వేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 73,49,690 డోసుల టీకా వచ్చిందన్నారు. తొలి, తుది విడత కలిసి 71,55,000 మందికి టీకా వేశామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే మే 1 నుంచి 15వ తేదీ వరకూ 9 లక్షల డోసులు కేటాయించిందన్నారు.
ఇందులో 6.90 లక్షల డోసుల కోవిషీల్డ్ రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఇంకా 1.08 లక్షల డోసులు ఈ నెల 15 నాటికి రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. వీటితో పాటు ప్రస్తుతం మిగిలిన 2 లక్షలతో కలిపి 3 లక్షలకు పైబడి డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ నెల 15 తర్వాత కేంద్రం కూడా వ్యాక్సిన్ కేటాయిస్తుందన్నారు. 35 లక్షల మందికి మలి విడత డోసులు ఇవ్వాలన్నారు. వీరిలో కొందరికి ఇవ్వగా, 23.89 లక్షల మంది ఇంకా ఉన్నారన్నారు. కేంద్రం నుంచి వచ్చే డోసులు మలి విడతకు మాత్రమే సరిపోతాయన్నారు. దీంతో కొత్త వారికి డోస్ ఇచ్చే అవకాశమే లేదని అశోక్‌సింఘాల్ గణాంకాలతో సహా తేల్చి చెప్పారు. అసలే సెకెండ్ వేవ్‌తో అల్లాడుతున్న జనానికి వ్యాక్సిన్ ఆశ కూడా ఆవిరైంది.
అందని ద్రాక్ష పులుపు అనే చందంగా … అందని వ్యాక్సిన్ పులుపు అని సరిపెట్టుకోవాల్సిన దయనీయ స్థితి. ఎవరికి వారు రక్షణ చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గమే కనిపించడం లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మహమ్మారి పంజా విసరడానికి సిద్ధంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త!