ముఖ్యమంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కరోనా పరిస్థితిపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన స్టాలిన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమిళనాడు అంతటా కంప్లీట్ లాక్ డౌన్ అమల్లోకి రాబోతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వలస కార్మికులు ఎవ్వరూ తమ ప్రాంతాల్ని వీడి వెళ్లాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది.
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు, పాక్షిక లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గలేదు. నిన్నటికినిన్న 26,465 కేసులు నమోదయ్యాయి. ఇక చెన్నైలో పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
చెన్నైలో సగటున రోజుకు 42 మంది కరోనాతో మరణిస్తున్నారు. మే 1 నుంచి 6వ తేదీ మధ్యలో ఏకంగా 277 మంది చెన్నై వాసులు మరణించారు.
నిన్న ఒక్క రోజే చెన్నైలో 6738 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 13.23 లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. 15,171 మంది మరణించారు. లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న 12 రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి.