కరోనా వచ్చి తగ్గిన తర్వాత పిల్లల పరిస్థితేంటి?

సెకెండ్ వేవ్ లో ఎక్కువమంది పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇలా వైరస్ బారిన పిల్లల్లో ఎక్కువమంది కోలుకోవడం శుభ పరిణామం. అయితే ఇలా కరోనా నుంచి కోలుకున్న తర్వాతే…

సెకెండ్ వేవ్ లో ఎక్కువమంది పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇలా వైరస్ బారిన పిల్లల్లో ఎక్కువమంది కోలుకోవడం శుభ పరిణామం. అయితే ఇలా కరోనా నుంచి కోలుకున్న తర్వాతే అసలు సమస్య మొదలవుతోంది. కరోనా నుంచి బయటపడిన చిన్నారుల్లో మానసిక, ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలం వెంటాడుతాయని ఆమెరికాకు చెందిన నిపుణుల బృందం బయటపెట్టింది.

యూఎస్ లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 11 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా తగ్గినప్పటికీ వాళ్లలో 13 శాతం మందికి లక్షణాలు వీడడం లేదని తెలిపింది. అలాగే 12 నుంచి 16 ఏళ్ల వయసుల్లో పిల్లల్లో కరోనా తగ్గిన తర్వాత కూడా 17 శాతం మందికి లక్షణాలు వేధిస్తున్నాయని తెలిపింది. పిల్లల్లో ఈ పోస్ట్-కరోనా బాధలు సగటున 5 వారాల వరకు ఉన్నట్టు గుర్తించారు.

ఇక లక్షణాల విషయానికొస్తే, కరోనా నుంచి కోలుకున్న 12 ఏళ్ల లోపు పిల్లల్లో అలసట, నిద్రలేమి, కాళ్లు-చేతులు నొప్పిపెట్టడం, తలనొప్పి, నీరసం, విరోచనాలు లాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న పిల్లల్ని 5 వారాల పాటు జాగ్రత్తగా చూసుకోవడం అత్యావశ్యకం అంటున్నారు నిపుణులు.

పిల్లలకు 5 వారాల పాటు సులభంగా అరిగే ఆహారం ఇవ్వాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకునే వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలని, అతిగా టీవీ చూడడం, మొబైల్ లో గేమ్స్ ఆడడం లాంటివి కొన్నాళ్ల పాటు నివారించాలని సూచిస్తున్నారు.

ఇక భోజనం విషయానికొస్తే, కరోనా నుంచి కోలుకున్న పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. రోజూ ఉడికించిన గుడ్డు, బాదం పప్పు అలవాటు చేయాలి. భోజనంలో పాలకూర, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు లేదా పళ్ల రసాలు, పెరుగు ఎక్కువగా ఇవ్వాలి.