కరోనా మహమ్మారే అనుకుంటే, దాని పేరుతో జనాన్ని మరింత భయపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓ పథకం ప్రకారం ముందుకెళుతోంది. ఇలా చేస్తే జనం అసహ్యించుకుంటారనే భయం ఒకవైపు, దీనంతటికి జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని క్రియేట్ చేయడమే లక్ష్యంగా మరోవైపు ఏకంగా చంద్రబాబే ఆ పనికి దిగారు.
కరోనా ఉధృతిపై సమీక్ష, ప్రజల్ని అప్రమత్తం చేసే పేరుతో ఆయన నిర్వహిస్తున్న ఆన్లైన్ సమావేశాలు భయపెట్టేందుకే తప్ప, చైతన్యపరచడానికి ఎంత మాత్రం కాదని ప్రత్యర్థులు విమర్శలు ఎక్కు పెట్టారు.
నిన్నమొన్నటి వరకూ కర్నూలు కేంద్రంగా N440K వైరస్ వేరియెంట్ ప్రబలిందంటూ చంద్రబాబు విష ప్రచారం చేయడానికి బలమైన కారణం లేకపోలేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
కర్నూల్‌ను న్యాయరాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో, ఉద్దేశ పూర్వకంగానే ఆ ప్రాంతాన్ని అభాసుపాలు చేయడానికి చంద్రబాబు నేతృత్వంలో పకడ్బందీగా పన్నిన కుట్రగా అభివర్ణిస్తున్నారు. అయితే ఆ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడంతో ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ వేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఉధృతితో ప్రజలు గందరగోళానికి గురవుతున్న సమయంలో సరైన సమాచారాన్ని వారికి అందించడానికే అంటూ చంద్ర బాబు ఓ ఆన్లైన్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దేశంలో థర్డ్‌వేవ్, ఫోర్త్‌వేవ్ కూడా రావచ్చునని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయన నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సెకెండ్ వేవ్ ఉధృతి మరో నాలుగు నుంచి 8 వారాలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
అప్రమత్తానికి, భయపెట్టడానికి తేడా ఉందని, చంద్రబాబు ప్రధాన లక్ష్యం ఏపీ ప్రజానీకాన్ని భయాందోళనలకు గురి చేసి, వారి జీవితాలతో చెలగాటం ఆడడమే అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
ఒక వైపు ఈ నెలాఖరు వరకూ సెకెండ్ వేవ్ ఉంటుందని, ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి తగ్గొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజల్ని భయపెట్టే నిజాల కంటే, కాస్తా భరోసా కలిగించే మంచి మాటలు వైద్య నిపుణులతో చంద్రబాబు చెప్పించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా థర్డ్‌వేవ్ రావడం ఖాయమని, అదికూడా ఇంకా బలంగా వస్తుందని చెప్పించడం దేనికి సంకేతమని పలువురు ప్రశ్నిస్తున్నారు. కరోనా ఫోర్త్ వేవ్ కూడా వస్తుందని చంద్రబాబు చెప్పిస్తున్నారని, అసలే సెకెండ్ వేవ్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్న జనాన్ని, కొత్తకొత్త విషయాలతో మరింత ఆందోళనకు గురి చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుత విపత్తు నుంచి ఎలా బయటపడాలో తెలిస్తే రెండు మంచి సూచనలు చేయాలని, లేదంటే మౌనం పాటించడం ద్వారా ఎంతో మేలు చేసినట్టు అవుతుందనే హిత వచనాలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి.
ఇలాంటి విపత్కర సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును చూస్తుంటే…. కరోనా సెకెండ్, థర్డ్, ఫోర్త్ …ఇలా ఎన్ని వేవ్‌లు, ఆయనతో సమానం కాలేవనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే, అంతేగా మరి!