తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామికి పెద్ద చిక్కే వచ్చి పడింది. మొదట్లో ఇది అంతగా పట్టించుకోవల్సిన విషయం కాదులే అని అన్నాడీఎంకేతోపాటు ఇతరులూ అనుకున్నారు. కాని ప్రతిపక్ష డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పట్టుబట్టి దీనికి పీటముడి వేసి హైకోర్టుకెక్కడంతో పళనిసామి తప్పనిసరిగా జవాబు చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం 'నైతికత'తో ముడిపడి ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయకపోతే సమస్య సుప్రీం కోర్టుకు చేరే అవకాశముంది. ఇంతకే పళనిసామికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? జయలలిత మరణించినప్పటికీ ఆమె ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికీ ఉన్నాయి. జయలలిత తన హయాంలో 'అమ్మ' పేరుతో ప్రవేశపెట్టిన పథకాలు అదే పేరుతో ఇంకా కొనసాగుతున్నాయి. పళనిసామి అధికారం స్వీకరించిన వెంటనే అమ్మ పేరుతో మరో ఐదు పథకాలను ప్రారంభించారు. తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులకు, అభిమానులకు 'అమ్మ' మీద ఉన్న వీరభక్తి తెలియందికాదు. కాబట్టి ఇదంతా సహజమే కదా అనుకోవచ్చు. కాని ఇదంతా 'అసహజం' అంటున్నారు డీఎంకే నేత స్టాలిన్.
అక్రమాస్తుల కేసులో జయలలిత దోషియని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఆమె ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా ఉంచుతారు? ఆమె పేరుతో ప్రభుత్వ పథకాలను ఎలా కొనసాగిస్తారు? అని ప్రశ్నించిన స్టాలిన్ ప్రభుత్వ కార్యాలయాల్లో జయ ఫొటోలు తొలగించాలని, పథకాలకు ఆమె పేరు తీసేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. కోరినంత మాత్రాన స్టాలిన్ అడిగిన పని చేయరు కదా. దీంతో ఆయన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. కోర్టు అవినీతిపరురాలిగా ముద్రపడిన జయలలిత ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడంపై, 'అమ్మ' పేరుతో పథకాలు కొనసాగించడంపై ప్రభుత్వ వైఖరి (స్టాండ్) ఏమిటి? అని ప్రశ్నించింది. దీనికి మార్చి 20లోగా పళనిసామి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. ఫొటోలు తొలగించబోమని, పథకాలు అమ్మ పేరుతోనే కొనసాగిస్తామని ప్రభుత్వం జవాబు ఇస్తే దాన్ని కోర్టు సమర్థించకపోవచ్చు. సుప్రీం కోర్టు అవినీతిపరురాలని తీర్పు ఇచ్చిన నాయకురాలిని హైకోర్టు ఎలా సమర్థిస్తుంది? ఒకవేళ హైకోర్టులో న్యాయం జరగలేదనుకుంటే స్టాలిన్ సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశముంది.
జయ ఫొటోలు తొలగిస్తామని సర్కారు చెప్పినట్లయితే అమ్మ భక్తిపరులు పళనిపై విమర్శల వర్షం కురిపించకుండా ఊరుకుంటారా? జైల్లో ఉన్న చిన్నమ్మ ఏమంటుందో…! జయలలిత అన్నాడీఎంకే నేతల హృదయాల్లో కొలువైన దేవత. ప్రతిరోజు ఆమె పేరు తలచుకోందే వారి రాజకీయ జీవితం ముందుకు సాగదు. జనం మధ్యకు పోలేరు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా అన్నాడీఎంకే నేతలు అమ్మ పేరుతో రాజకీయం చేస్తుండగా, వారిని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నేత స్టాలిన్ అమ్మనే ఉపయోగించుకున్నారు. అన్నాడీఎంకేకు జయ ఆరాధ్య దేవత కాబట్టి దివంగత నేత గౌరవార్థం ఆమె ఫొటోలు పెట్టుకోవడంలో అభ్యంతరం ఉండకపోవచ్చు. ఆమె ఫొటో పక్కన కావాలంటే ప్రస్తుత సీఎం ఫొటో పెట్టుకోవచ్చు. అది అధికార పార్టీ ఇష్టం. జయ 'క్లీన్ సీఎం' అయివుంటే స్టాలిన్ ఏమీ మాట్లాడకపోయేవాడేమో. కాని సుప్రీం కోర్టు ఆమెను దోషిగా చెప్పింది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని అవినీతిపరురాలి ఫొటో ఉండకూడదంటున్నారు. నైతిక విలువలరీత్యా చూస్తే ఇది సరైందేననిపిస్తుంది. కాని అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే, పాలన సాగించే అన్నాడీరఎంకే నాయకులు దీనిపై మండిపడుతున్నారు.
జయపై నాయకుల మనసులో ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అమ్మను కాదంటే జనం ఊరుకోరు. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలతో జయ జనాన్ని ఆకట్టుకున్నారు. అమ్మ పేరుతో ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు జరుగుతున్నాయి. జయలలిత బతికున్నప్పుడు అమ్మ బ్రాండ్ పథకాల్లో 'అమ్మ కళ్యాణ మండపాలు' పథకం చేరింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని, కళ్యాణ మండపాల అద్దెలు భరించలేకపోతున్నారని, అందుకే అమ్మ కళ్యాణ మండపాల నిర్మాణం తలపెట్టామని జయలలిత ప్రకటించారు. రాష్ట్రంలోని పదకొండు ప్రాంతాల్లో అమ్మ కళ్యాణ మండపాలను 83 కోట్ల ఖర్చుతో నిర్మిస్తామన్నారు. ఇవి పేదల కోసం నిర్మించే కళ్యాణ మండపాలు కాబట్టి ఏవో నామమాత్రంగా కడుతున్నారనుకుంటే పొరబాటే. ఇవి అన్ని సౌకర్యాలతో కూడిన అత్యాధునిక కళ్యాణ మండపాలు. మురికివాడల్లోని పేదల కోసం అమ్మ పేరుతో 50 వేల ఇళ్లు 1800 కోట్లతో నిర్మించాలని జయలలిత ఆదేశించారు. ఇప్పటికే…తక్కువ ధరకు టిఫిన్, భోజనం పెట్టే అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్లేటు ఇడ్లీ రూపాయి, పెరుగన్నం మూడు, సాంబారన్నం ఐదు రూపాయలు. 'అమ్మ కుడినీర్' (తాగునీరు) పేరుతో 10 రూపాయలకు వాటర్బాటిల్స్ విక్రయిస్తున్నారు.
అమ్మ ట్యాప్టాప్స్ పేరుతో విద్యార్థులకు ల్యాప్టాప్స్ పంపిణీ చేశారు. చిన్న పిల్లలున్న తల్లులకు అమ్మ బేబీ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందులో పిల్లలకు అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. పేదల కోసం అమ్మ ఉప్పు ప్యాకెట్లు అమ్ముతున్నారు. మార్కెట్లో కంటే వీటి ఖరీదు చాలా తక్కువ. పేదల కోసం ప్రవేశపెట్టిన మరో పథకం అమ్మ సిమెంట్. దీని ఖరీదు కూడా బాగా తక్కువ. అమ్మ విత్తనాలు, అమ్మ గ్రైండర్లు, అమ్మ ఫ్యాన్లు, అమ్మ ఔషధాలు, అమ్మ మొబైల్ ఫోన్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 'అమ్మ మక్కల్ సేవై మైయ్యం (అమ్మ ప్రజాసేవ కేంద్రాలు) పేరుతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లోని మీ సేవ, ఈసేవ కేంద్రాల్లాంటివి. తక్కువ ధరలకు పేదలు సినిమాలు చూసే అవకాశం కల్పించేందుకు 'అమ్మ సినిమా' పేరుతో థియేటర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో టిక్కెట్ల ధరలు పాతిక రూపాయల కంటే తక్కువగా ఉంటాయి. పైగా ఇవన్నీ ఎయిర్ కండిషన్డ్ థియేటర్లు కావడం విశేషం. స్టాలిన్ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తన పేరుతో, బొమ్మలతో ఉచిత పథకాలను అమలు చేయడం జయలలిత స్టయిల్. దీని కారణంగానే ఆమె దశాబ్దాలపాటు పరిపాలించగలిగారు' అని పేర్కొంది. మరి 'అమ్మ' ఫొటోలు, పేరు ఉంటాయో, మాయమవుతాయో చూడాలి.
-నాగ్ మేడేపల్లి