Advertisement

Advertisement


Home > Sports - Cricket

బెట్టింగ్‌ బురదలో యువతరం!

బెట్టింగ్‌ బురదలో యువతరం!

అంతర్జాతీయ మ్యాచ్‌లపై ఐసీసీ ప్రత్యేక నిఘాను ఉంచింది. ఫిక్సింగ్‌ చర్యలు బాగా తగ్గుముఖం పట్టాయి. దుబాయి వేదికగా జరిగిన కొన్ని మ్యాచ్‌లు మాత్రం ఫిక్సింగ్‌ వాసన కొట్టాయి. పలుసార్లు పాకిస్తాన్‌ క్రికెటర్లే అలాంటి వ్యవహారాలతో వెలుగులోకి వచ్చారు. బెట్టింగులు పతాక స్థాయికి చేరినప్పుడే ఫిక్సింగుల వరకూ వెళ్తుంది వ్యవహారం. ఇండియన్‌ టీమ్‌ వరకూ అలాంటి కంపులేదు కొన్ని సంవత్సరాల పాటు. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో మళ్లీ బెట్టింగ్‌ బుసలుకొట్టి ఫిక్సింగ్‌గా మారింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం సంచలనం రేపింది.

స్పాట్‌ ఫిక్సింగ్‌ మూలాలు కూడా బెట్టింగుల వద్దే ఉన్నాయని తేలింది. ఐపీఎల్‌ మొదలైన అతి తక్కువ కాలంలోనే తీవ్రస్థాయికి చేరిన బెట్టింగ్‌లు స్పాట్‌ ఫిక్సింగ్‌కు క్రికెటర్లను పురికొల్పాయి. బెట్టింగ్‌లపై మొదలైన పోలీసుల విచారణ, స్పాట్‌ ఫిక్సింగ్‌ దగ్గర తేలింది. ఆ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఐపీఎల్‌ టీమ్‌ల ఓనర్ల పేర్లే బయటకు వచ్చాయి! దీంతో బీసీసీఐ ఇరకాటంలో పడింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఓనర్ల ఇన్‌వాల్వ్‌ మెంట్‌ ఉందని తేలడంతో రెండు ప్రాంచైజ్‌లను రెండేళ్లపాటు నిషేధించింది బీసీసీఐ. కొంతమంది క్రికెటర్లపై చర్యలు తీసుకుంది. అంతటితో ఆ వ్యవహారానికి అలా ముగింపును ఇచ్చింది బీసీసీఐ. అయితే బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ ఈ రెండూ తగ్గుముఖం పట్టాయంటే  నమ్మలేని పరిస్థితి. ప్రత్యేకించి బెట్టింగ్‌ తీవ్రస్థాయిలో ఉండటంతో.. అది మ్యాచ్‌లను ప్రభావితం చేసేందుకు అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటుంది. క్రికెట్‌లో ఈ అవినీతి వ్యవహారాన్ని బీసీసీఐ ఎంతవరకూ నియంత్రిస్తోందో అర్థంకాని పరిస్థితి!

ఐపీఎల్‌ సాగినంతకాలం ఈ వ్యసనానికి పండగలా ఉండింది. బెట్టింగ్‌ మాఫియాకు యువతరం ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. కుర్రాళ్లకు క్రికెట్‌ అంటే కిక్‌. అందులోనూ ఎవరికివారు తాము క్రికెట్‌ పండితులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ టీమ్‌లో ఎవరు ప్లస్‌ పాయింట్‌, ఎవరు బాగా ఆడగలరు, ఆ క్రికెటర్ల గత చరిత్ర ఏమిటి, వారి ప్రస్తుత ఫామ్‌ ఏమిటి.. ఈ అంశాలన్నీ కలగలుపుతూ మేధావుల్లా మాట్లాడుతూ ఉంటారు కుర్రాళ్లు. వీళ్లలో చాలామంది పట్టణాల్లో ఉంటూ బీటెక్‌, డిగ్రీలు  చదివేవాళ్లే. సమ్మర్‌లలో కూడా అక్కడే మకాంపెట్టి.. ఇతర కుర్రాళ్లతో కలిసి బెట్టింగులు వేయడం వీళ్లలో చాలామందికి అలవాటుగా మారింది!

ఈ బెట్టింగ్‌ వ్యవహారం ఆఫ్‌లైన్‌, బెట్టింగ్‌ మాఫియాల ద్వారానే కాదు.. ఒకరకంగా ఆన్‌లైన్లో కూడా సాగుతూ ఉంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ తరహా వ్యవహారానికి మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కొహ్లీ వంటి స్టార్‌ క్రికెటర్లే ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదెలాగంటే.. ఫాంటసీ లీగ్‌, డీమ్‌ ఎలెవన్‌.. వంటి మొబైల్‌ యాప్స్‌తో ఒకరకంగా వారు బెట్టింగును ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ మొబైల్‌ యాప్స్‌కు ధోనీ, కొహ్లీలు ప్రమోటర్లు. ఐపీఎల్‌ సమయాల్లో అందుకు సంబంధించి యాడ్స్‌ కూడా వస్తూ ఉంటాయి.

ఇంతకీ ఏమిటా యాప్స్‌ అని ఆరాతీస్తే.. అదంతా ఒకరకమైన బెట్టింగ్‌ వ్యవహారం. ఆ యాప్స్‌లో ఏ రోజుకారోజు మ్యాచ్‌ల అప్‌డేట్స్‌ ఉంటాయి. వాటిల్లో మీరు ఒక జట్టును సెలెక్ట్‌ చేసుకోవచ్చు. రెండు టీమ్స్‌కు సంబంధించిన సభ్యుల్లో పదకొండు మందిని ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న పదకొండు మంది మీద కొంత సొమ్మును మీరు కట్టాలి. వారిలో ఎవరైనా రాణిస్తే.. మీకు డబ్బులు వస్తాయి. మీరు ఎంచుకున్న ప్లేయర్లు సరిగా ఆడకపోతే మీ డబ్బులు పోతాయి. ఇలాంటి అప్లికేషన్స్‌ ముందుగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యువతరానికి పరిచయం అవుతున్నాయి. పదిరూపాయలు, వంద రూపాయల స్థాయితో మొదలు.. వేలరూపాయల వరకూ వీటిల్లో డబ్బులు పెట్టుకోవచ్చు.

గెలుపు-ఓటముల మీద కాకుండా.. ఆటగాళ్ల మీద బెట్టింగ్‌ వ్యవహారాలు ఇవి. ఆటాళ్లు రాణిస్తే డబ్బులు, లేకపోతే ఆ డబ్బులు పోతాయి. ఇలాంటి వాటికి మొబైల్స్‌ చాలు. ముందుగా వీటి పట్ల యువత ఆకర్షితం అవుతోంది. ఆ తర్వాత మెల్లమెల్లగా బెట్టింగులకు ఇలాంటి అప్లికేషన్లే మార్గాలుగా నిలుస్తూ ఉన్నాయి. డబ్బును కట్టి ఆడే జూదంలాంటి ఈ అప్లికేషన్లకు భారత ప్రభుత్వం ఎలా అనుమతిని ఇచ్చిందో, స్టార్‌ క్రికెటర్లు వీటికి ఎలా బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఇదో ఆన్‌లైన్‌ జూదంగా మారింది. యువతను చాలా తేలికగా ఇది బానిసగా మార్చుకుంటూ ఉంది. ఇలాంటి వాటిని తక్షణం నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.

వాటికన్నా ముందు ఎన్నికల మీద భారీగా బెట్టింగులు సాగాయని వేరే చెప్పనక్కర్లేదు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వందల కోట్లరూపాయల బెట్టింగులు పడ్డాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి అనే పాయింట్లతో మొదలుకుని.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అనే అంశం మీద భారీగా బెట్టింగులు సాగాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల మీద బెట్టింగులు భారీ నుంచి అతి భారీస్థాయిలో ఉన్నాయి. ఎవరికి వారు  రాజకీయ పండిట్లుగా, ఎవరికివారు రాజకీయం గురించి అవపోసన పట్టిన వారుగా.. భారీగా బెట్టింగులు కాశారు.

మే 23న విడుదల అయ్యే ఎన్నికల ఫలితాలతో ఇలాంటి బెట్టింగ్‌ ముఠాల్లో సభ్యులైన వారి జాతకాలు మారిపోనున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల ఫలితాల గురించి రాజకీయ నేతల కన్నా బెట్టింగులు కాసినవారే చాలా ఎగ్జియిట్‌ మెంట్‌తో ఉన్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు అనే అంశం గురించి పోటీచేసిన నేతల కన్నా.. బెట్టింగులు వేసిన వారికే ఎక్కువ టెన్షన్‌ ఉంది. ఫలితాలు వచ్చిన రోజునే ఇలాంటి వారికి లాభనష్టాల బేరీజులన్నీ తేలిపోనున్నాయి. ఇలా క్రికెట్‌, రాజకీయం... వంటి అంశాలతో బెట్టింగ్‌ వ్యసనం పతాక స్థాయికి చేరింది. నియంత్రించలేని స్థాయిలో ఉంది.

తెలుగు హీరోల మంచితనం.. సినిమాల వరకేనా!

ఎమ్బీయస్‌: బెదురు బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?