రోమ్ నగరం తగలబడుతోంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడని అంటుంటారు. ఆధునిక నీరోలు కేవలం ఫిడేలు వాయిస్తూ కూర్చోవడం మాత్రమే కాదు.. ఆ పిమ్మట… దాని మీద నిరసన కూడా వ్యక్తం చేయగలరు! వైఫల్యం తమదే అయినా ఎదుటి వాళ్ల మీద రుద్దుతూ ఎగబడి దీక్షలు చేయగలరు. అంతటి ఘటనా ఘటన సమర్థులు అభినవ నీరోలు!
ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అంతకంటె తక్కువేమీ కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మొన్నటిదాకా పార్లమెంటులో నిమిషమైనా చర్చలు జరగకుండా సాంతం స్తంభించిపోతే.. ప్రధానిగా సభా నాయకుడిగా.. నిర్లిప్తత పాటించడం మినహా మోడీ చేసిందేమీ లేదు.
సభను సజావుగా నడపడం గురించి.. ఆయన సీరియస్ గా పట్టించుకున్నదీ లేదు. సభ ప్రారంభం రోజున… చివరి రోజున మాత్రం వచ్చి.. తతిమ్మా రోజుల్లో సభ జరిగేది ఎటూ లేదు కదా.. అని ఆయన రెస్టు తీసుకున్నట్లుగానే వ్యవహారం గడచిపోయింది. అయితే విపక్షాలు సభను జరగనివ్వకుండా అడ్డుపడ్డాయంటూ మోడీ చిత్రంగా ఎదురుదాడికి దిగుతున్నారు.
ఆయనకు కావాల్సింది రాజకీయ మైలేజీ మాత్రమే. అందుకే.. అయితే గియితే సభలో రాద్ధాంతి చేసింది.. ప్రధానంగా. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, తెరాస, అన్నా డీఎంకే కాగా.. మోడీ వెళ్లి చిత్రంగా కర్నాటకలో దీక్షకు ఉపక్రమిస్తున్నారు. తమ పార్టీ ఎంపీలందరినీ కూడా రిలే నిరాహార దీక్ష చేయమని ఆయన పురమాయిస్తున్నారు.
చూడబోతే అభినవ నీరోలు.. కేవలం తగలడుతోంటే.. ఫిడేలు వాయించుకుంటూ.. నిమ్మళంగా కూర్చోవడం మాత్రమే కాదు.. ఆ పిమ్మట తప్పు తమది కాదంటూ.. ఎదురుదాడికి దిగడంలోనూ సిద్ధహస్తులే.
-కపిలముని