యడ్యూరప్ప ఇప్పుడు కర్నాటక కొత్త ముఖ్యమంత్రి! అయితే, పాపం… నేను కదా ముఖ్యమంత్రిని అని ఆయన బోర విరుచుకుని తిరగడానికి, తలెగరేసి ప్రవర్తించడానికి ఏ రకంగానూ అవకాశం లేదు. ఆయన బహుశా ఈ అయిదేళ్ల పొడవునా.. అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితులు తప్పకపోవచ్చు. ఆయన చేతిలో రాష్ట్రానికి సర్వోన్నత నాయకుడు అనే పదవి ఉంటుంది, అయిన వారికి పంచడానికి మంత్రి పదవులు కూడా ఉంటాయి.. తలచినంత సంపద కూడా ఉండవచ్చు… ఎన్నిఉన్నా సరే.. ఆయన మాత్రం ఇప్పుడు బిచ్చమెత్తవలసిందే… సంపూర్ణ మెజారిటీ దక్కేదాకా ఇతరుల మద్దతు కోరుతూ ఉండాల్సిందే.
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఏమాత్రం స్వతంత్రించి వ్యవహరించలేని ఇరకాటపు పరిస్థితుల్లో అధికార పీఠం మీదికి వచ్చారు. భాజపాలో ఇప్పుడు గాలిహవా నడుస్తోంది. ఒక కుటుంబానికి రెండు పదవులు వద్దనే నిబంధనతో యడ్డీ కొడుకుకు టికెట్ తిరస్కరించిన భాజపా, గాలి జనార్దనరెడ్డి సోదరుల్లో ఇద్దరికీ టికెట్లు ఇచ్చింది. కాకపోతే.. ‘మాటకు కట్టుబడి ఉన్నాం’ అనేపదం కోసం.. యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేస్తున్నారే తప్ప.. తెలుగురాష్ట్రాల సీఎంల లాగా ఆయన అన్ని విషయాలలోనూ స్వతంత్రించి వ్యవహరించే స్కోప్ ఉండదు.
అలాగే, ఇవాళ పదవీ స్వీకార ప్రమాణం అయితే జరిగింది గానీ… ఆయనకు నిమ్మళం లేదు. ఇంకా 8మంది మద్దతుకావాలి. గడువు చాలానే ఉన్నది గానీ.. అంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం సులభంగా కనిపించడంలేదు. కుమారస్వామి ఇప్పటికే 100కోట్ల వంతున డబ్బు, మంత్రి పదవులు ఇవ్వజూపుతున్నట్లుగా ఆరోపణలు చేశారు.
అంతమొత్తం సొమ్ములు ఇవ్వడం అనేది అధికారంలోకి రాదలచుకుంటున్న పార్టీకి పెద్ద విశేషం కాకపోవచ్చు. ప్రామిస్ చేసిన మొత్తం క్యాష్ రూపంలోనే కాకుండా, తదనుగుణమైన కాంట్రాక్టుల రూపంలో కూడా ఇవ్వవచ్చు. ఏది ఏమైనప్పటికీ.. ఈ ఆఫర్ లను ఒప్పుకునే వాళ్లు దొరకడం అనేది గగనం. ఇంచుమించుగా మద్దతుకోసం యడ్యూరప్ప బిచ్చమెత్తవలసిన పరిస్థితి. మరి ఈ రెండువారాల్లో ఆయన దానిని ఎలా సాధిస్తారో చూడాలి.