ఇదే ‘చంద్ర’ మార్కు పారదర్శకత!

ఒక పథకానికి సంబంధించి కాంట్రాక్టరు విన్నవించుకోగానే.. అతడికి లబ్ధి చేకూర్చడం కోసం (లేదా, అతను నష్టపోకుండా ఉండడం కోసం) ప్రభుత్వం వారు సదరు ప్రాజెక్టు ఎస్టిమేట్లను సవరించేస్తారు. ఫలానా కారణం వల్ల నాకు నష్టం…

ఒక పథకానికి సంబంధించి కాంట్రాక్టరు విన్నవించుకోగానే.. అతడికి లబ్ధి చేకూర్చడం కోసం (లేదా, అతను నష్టపోకుండా ఉండడం కోసం) ప్రభుత్వం వారు సదరు ప్రాజెక్టు ఎస్టిమేట్లను సవరించేస్తారు. ఫలానా కారణం వల్ల నాకు నష్టం వస్తుందని, సదరు కాంట్రాక్టరు నివేదించుకోగానే అధికార్లు, ప్రభుత్వం కళ్లు మూసుకుని దానికి ఓకే చెప్పేస్తుందని అనుకోవడం భ్రమ. వారు కోరిన సవరింపులను మదింపు చేసి, పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతనే ఎస్టిమేట్లను సవరిస్తారు. ఏతావతా కాంట్రాక్టరుకు మాత్రం.. మాట్లాడుకున్న మొత్తం కంటె అదనపు మొత్తం దక్కుతుంది. 

ఇక వర్తమానంలోకి వస్తే.. రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టుగా, ప్రతిష్టాత్మకమైనదిగా నిర్మాణం అవుతున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎస్టిమేట్లను అడ్డగోలుగా రివైజ్ చేసేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల మేర, కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగేలా చంద్రబాబు సర్కారు వ్యవహరించిందనేది ఆరోపణ. ఎంత అడ్డగోలుగా చేసినా కూడా అధికార్ల అధ్యయనం ఎంతో కొంత జరిగే ఉంటుంది కదా…?

ఇదంతా వారి నివేదికల రూపంలో రికార్డెడ్ గాన ఉంటుంది కదా? అనేది ఒక డౌటు. అలాగే కాంట్రాక్టరు కోరితే కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే.. ఆ తర్వాత జరిగే కేబినెట్ భేటీలోనే దానికి ఆమోద ముద్ర వేసేసి ఎస్టిమేట్లను రివైజ్ చేసేస్తారు. తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ఈ వ్యవహారం బాగానే ఉంది. కానీ దానిక సంబంధించిన నివేదికల్ని కేంద్రానికి పంపకుండానే.. వారి నుంచి మేం ఖర్చు పెట్టిన డబ్బులు ఇచ్చేయండి అంటూ అడిగితే ఎలాగ? ఇక్కడే వ్యవహారం ప్రభుత్వం మెడకు  చుట్టుకుంటోంది. 

పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక మొత్తం కేంద్రం నిదులతోనే జరగాలి. కేంద్రం ఇప్పటిదాకా దీనికి ఇచ్చింది తక్కువ కాగా, రాష్ట్ర సర్కారు చాలా ఎక్కువ డబ్బు కర్చు పెట్టేసింది. మధ్యలో ఎస్టిమేట్లను కూడా కేంద్రంతో నిమిత్తం లేకుండా రాష్ట్రమే రివైజ్ చేసేసింది. ఈ సవరించిన అంచనాల నివేదిక అందితే తప్ప తాము కొత్తగా నిధులు విడుదల చేయం అంటూ కేంద్రం ఇప్పుడు భీష్మించుకుంది.

ఎప్పుడో జరిగిపోయిన నిర్ణయానికి సంబంధించి నెలలు గడుస్తున్నా కూడా  కేంద్రానికి నివేదిక ఇవ్వలేనంత దారుణంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం పనిచేస్తున్నదా? లేదా, వారికి ఇచ్చే నివేదికలో మాయ చేయడానికి డొంకమార్గాలను వెతుకుతున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

చంద్రబాబునాయుడు నిత్యం.. పారదర్శకత గురించి, అవినీతి ఎరగని తన స్వచ్ఛమైన పాలన గురించి కబుర్లు చెబుతూ ఉంటారు. ఈ దఫా గద్దె ఎక్కిన నాటినుంచి తన రొటీన్ మాటల గారడీకి కొన్ని కొత్త పదాలను కూడా కలిపారు. డాష్ బోర్డు, రియల్ టైం గవర్నెన్స్, జాప్యం నివారించడం, ఎవిరీథింగ్ ఆన్ లైన్ వంటి పడికట్టు మాటలు వాడుతున్నారు. చాలా సంతోషం.

ఇదంతా నిజమే అయితే.. మరి పోలవరం సవరింపు అంచనాలను కేంద్రానికి సకాలంలో తెలియజేయడానికి అడ్డు వచ్చిన గ్రహాలు ఏమిటి? ఎందుచేత ప్రభుత్వం ఇన్నాళ్లుగా ఆ పనిచేయలేక, కేంద్రమంత్రులు వద్దకు వెళ్లి… అంచనాలు తర్వాత ఇస్తాం  ప్రస్తుతానికి ఎంతో కొంత నిధులివ్వండి అంటూ దేబిరించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. వారు కోరుతున్న మేర సవరించిన అంచనాలను వారికి సమర్పించేస్తే.. హక్కుగానే పెట్టిన ఖర్చు చెల్లించాల్సిందిగా కేంద్రాన్ని డబాయించి అడగడానికి ఉంటుంది కదా?

ఇవన్నీ సామాన్యులకు కలుగుతున్న సందేహాలు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏమిటి? ఇలా మాయ చేయడమేనా? లేదా, జరిగిన నిర్ణయాల నివేదికలకు కూడా కొన్ని నెలలు జాప్యం చేయడమేనా? ప్రభుత్వం పారదర్శకంగా తమ ప్రతి పనినీ గమనిస్తున్నారని, తమ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో అవాంతరాలు వస్తున్న సంగతి వారు గుర్తెరుగుతున్నారని చంద్రబాబు సర్కారు తెలుసుకోవాలి.