ముసుగు: ముందు ఒకరు- వెనుక ఇద్దరు…

వెనకటికి ఒక సామెత ఉంది. కోర్టులో వ్యాజ్యం ఓడిన వాడు కోర్టులోనే ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడ్చాడని..! అచ్చంగా పరిస్థితి అదే అని చెప్పలేం గానీ.. తాజా పరిణామాల్లో కన్నడ విధాన సభలో…

వెనకటికి ఒక సామెత ఉంది. కోర్టులో వ్యాజ్యం ఓడిన వాడు కోర్టులోనే ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడ్చాడని..! అచ్చంగా పరిస్థితి అదే అని చెప్పలేం గానీ.. తాజా పరిణామాల్లో కన్నడ విధాన సభలో ఒకరు ఏడిస్తే.. హస్తినలో తమ ఇళ్లలోనే కూర్చుని ఇద్దరు ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్కింది ఒక విజయం మరియు ఒక ఓటమి! కానీ, దానికి పరాభవం మాత్రం.. అలవిమాలిన అవమాన భారం మాత్రం ముగ్గురిది! ఆ ముగ్గురూ ఎవరో ప్రత్యేకించి పేర్లు చెప్పవలసిన అవసరం లేదు.

కాంగ్రెస్ ముక్త భారత్ అనేది నరేంద్రమోడీ కోరిక కావొచ్చు. కానీ అందుకు ఆయన అడ్డదారులు తొక్కడాన్ని ఎందుకు ఎంచుకున్నారో ఎవ్వరికీ అర్థం కాని సంగతి. నీతులు ప్రవచనాలు వల్లించడం అనేది ఇవాళ్టి రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. వాట్సాప్ లు, ఫేస్ బుక్కులూ ముదిరిపోయిన తరువాత.. ప్రతి ఒక్కరూ ఏ రకంగా అయితే… పొద్దున్లేవగానే.. తమ తమ గ్రూపుల నిండా సందేశాలను, నీతులను, హితోక్తులను వమనం చేసుకుంటున్నారో.. అదే రీతిగా నలుగురు ప్రజలు గుమికూడా కనిపిస్తే చాలు.. ప్రతి రాజకీయ నాయకుడూ నీతిమాటలను, స్వచ్ఛతను, పరిశుద్ధతను తన నోటిద్వారా మాటల రూపంలో వమనం చేసుకుంటున్నారు. అంతే తప్ప.. వాటిని తలకు ఎక్కించుకునే ప్రయత్నం ఎవ్వడూ చేయడం లేదనేది తాజాగా మోడీ మరియు అమిత్ షా కలిపి నిరూపించిన సంగతి.

అందుకే ఈ పరిణామాల్ని బొమ్మాబొరుసూగా విడగొట్టి చూస్తే.. బొమ్మ వైపు ఒకరు ఏడిస్తే.. బొరుసు వైపు ఇద్దరు ఏడవాల్సిన పరిస్థితి ఇవాళ భాజపాకు ఏర్పడింది. దీనిని ప్రజాస్వామ్యానికి ఓటమిగా.. అతిపెద్ద పార్టీగా తమను ఎంచుకున్న కన్నడ ప్రజల తీర్పునకు పరాభవంగా అభివర్ణిస్తూ ప్రజల సానుభూతి పొందడానికి వారు ప్రయత్నించవచ్చు.

కానీ.. రాజ్యాంగ బద్ధంగా రెండు పార్టీలు కలిసి మెజారిటీని చూపించినప్పుడు వారిని అడ్డుకోడానికి నానా వక్రమార్గాలు తొక్కడం అనైతికం అనే సంగతి వారు తెలుసుకోకపోవడం హేయం. అందుకు తగిన శాస్తి జరిగింది. ఈ పరిణామాలను భవిష్యత్తులో వారు తమకు అనుకూలంగా మలచుకోవచ్చు గాక.. కానీ ఈ పరాభవం మాత్రం ఎన్నటికీ చరిత్రలో మిగిలిపోతుంది.