‘హైపర్‌లూప్’ అంతా ఒక పెద్ద మాయ!

తాజాగా సీఆర్డీయే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్త మాయను ఆవిష్కరించారు. అమరావతి నుంచి విశాఖకు 23 నిమిషాల్లోను, తిరుపతికి 25 నిమిషాల్లోను చేరుకోగల సరికొత్త రవాణా వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరిస్తాం అంటూ ప్రజల…

తాజాగా సీఆర్డీయే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్త మాయను ఆవిష్కరించారు. అమరావతి నుంచి విశాఖకు 23 నిమిషాల్లోను, తిరుపతికి 25 నిమిషాల్లోను చేరుకోగల సరికొత్త రవాణా వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరిస్తాం అంటూ ప్రజల మీద మహా బురడీ అస్త్రం ప్రయోగించారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా సక్సెస్ అయినట్లుగా (ట్రయల్ బేస్ మినహా) నిరూపణ అంటూ లేని.. ఒక సైన్స్ ఫిక్షన్ వంటి రవాణా విధానాన్ని.. ఆయన ఆమోదించేసి.. ఆచరణలో సాధ్యాసాధ్యాలేమిటో.. దానికి అయ్యే వ్యయంతో పోల్చినప్పుడు.. దాని ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనం ఏమిటో తర్కబద్ధంగా లెక్కలు వేయకుండానే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా అధికారుల్ని పురమాయించేశారు. నిజానికి హైపర్ లూప్ టెక్నాలజీ మనకు సరితూగేది కాకపోయినా.. కేవలం మభ్యపెట్టే కాలయాపన టెక్నిక్కునే చంద్రబాబు ప్రయోగించినట్లు తెలుస్తోంది. 

హైపర్ లూప్ టెక్నాలజీ అనేది 2013లోనే పుట్టిన సరికొత్త రవాణా ఆలోచన. అయితే స్వల్ప దూరాలకు తప్ప ఆచరణలో ఇది అంత ఈజీకాదు. ఈ విధానంలో అమరావతి నుంచి విశాఖకు ఒక స్ట్రెయిట్ లైన్ (సరళరేఖ) లాంటి వంతెన నిర్మిస్తారు. మామూలు రోడ్లకంటె బాగా ఎత్తులో ఉండేలా పిల్లర్లు వేసి.. స్కేలుతో గీత గీసినట్లుగా ఎలాంటి మలుపులు లేకుండా ఈ వంతెన ఉండాలి. దాని మీద ఒక పెద్ద గొట్టం లాంటిది అమరుస్తారు. ఆ గొట్టంలో మనం ప్రయాణించే వాహనం ఒక ట్యూబ్ ఆకృతిలో ఉంటుంది. ఆ ట్యూబ్ కు- గొట్టానికి మధ్య ఉండే ఖాళీ జాగాను ‘గాలి’ లేకుండా శూన్యంతో నింపేస్తారు. అంటే వాక్యూమ్ క్రియేట్ చేస్తారు. సాధారణంగా.. వాహనాలు ప్రయాణించేప్పుడు గాలిరాపిడి – ఎయిర్ ఫ్రిక్షన్ వల్లనే వేగం తగ్గుతుంది. ఈ పద్ధతిలో అసలు వాహకం ట్యూబ్ ఉండే గొట్టంలో గాలే ఉండదు గనుక.. వేగం తగ్గకుండా అపరిమితమైన వేగంతో ట్యూబ్ ప్రయాణిస్తుంది. 

గంటకు 970 కిమీల వేగంతో ప్రయాణం చేయవచ్చునని దాన్ని ఏర్పాటు చేసే సంస్థ చెబుతోంది. కానీ తమాషా ఏంటంటే.. ప్రపంచంలో ఎక్కడా ఇది ఇప్పటిదాకా ఏర్పాటు కానేలేదు. కాలిఫోర్నియాలో సంస్థ హెడ్ క్వార్టర్స్ వద్ద కూడా మోడల్ ను పరిశీలించే నిమిత్తం కంపెనీ వారే ఒక ట్రాక్ ఏర్పాటు చేశారు. అది కేవలం 1.6 కిలోమీటర్ల పొడవు మాత్రమే. అంత చిన్న శాంపిల్ ను గమనించి.. మన రాష్ట్రంలో వందల కిలోమీటర్ల పొడవునా.. భూముల్ని సదరు సంస్థకు మనం కట్టబెట్టాలన్నమాట. పైగా ఇది చాలా అధిక వ్యయంతో కూడుకున్న ఆలోచన. వాక్యూమ్ నిండిన గొట్టంలో ట్యూబ్ లో ప్రయాణించడంలో ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందులు ఏవీ ఇప్పటిదాకా తెలీదు. పైగా.. 23 నిమిషాల్లో అమరావతి టూ విశాఖ తీసుకువెళ్లడానికి ఆ కంపెనీ ఎంత టిక్కెట్ ధర నిర్ణయిస్తుందో ఇప్పుడే వారు కూడా చెప్పలేరు. నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఖచ్చితంగా విమాన ఛార్జీలకంటె చాలా ఎక్కవ అవుతుంది. పైగా ఈ సంస్థ క్రెడిబిలిటీ కూడా ప్రశార్థకమే. ప్రభుత్వ భాగస్వామ్యంతో గనుక ఈ ప్రాజెక్టు చేపడితే.. ఎంతకాలం సదరు సంస్థ నిరంతరాయ సేవలందిస్తుంది అనేది ఇప్పటిదాకా నిరూపణలేదు. 

ఏ రకంగా చూసినా కూడా.. హైపర్ లూప్ ప్రయాణం అనేది కేవలం మాయ మాత్రమే అని.. సినిమాల్లో పెట్టుకోడానికి చక్కగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబునాయుడుకు ఈ వాస్తవం అర్థంకాకుండా ఉండదు. కాకపోతే.. తానేదో కొత్త రాజధాని కోసం బ్రహ్మాండాన్ని బద్ధలు చేస్తున్నట్లుగా.. 23, 25 నిమిషాల్లో రాజధానికి చేరుకోగల వరాన్ని విశాఖ, తిరుపతి ప్రజలకు ఇస్తున్నట్లుగా బిల్డప్ కోసం ఈ మాయను ప్రయోగిస్తున్నారు అని జనం అనుకుంటున్నారు.