కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని సామెత.. ఇప్పుడు మోడీ సర్కారు కు పరిస్థితి అలాగే కలిసొస్తున్నట్లుంది. కాకపోతే.. ఆయనకు మాత్రం కలిసొచ్చే కాలమొస్తే.. ఆల్రెడీ ఏర్పాటు అయిపోయిన ప్రభుత్వంలో తమ పార్టీకి కూడా భాగస్వామ్యం దక్కే పరిస్థితి ఏర్పడుతున్నది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ తమ శత్రుకూటమి రాజ్యమేలుతున్న బీహార్ లో భాజపాను అధికార పార్టీకి మిత్ర పక్షంగా మోడీ మార్చబోతున్నారు. లాలూ కుమారుడి ఖాతాలో ఉన్న అవినీతి బాగోతాలు, వాటిమీద సాగుతున్న విచారణ కలగలిసి… ఇప్పుడు భాజపాకు పంట పండుతోంది. ప్రస్తుతానికి అధికారంలో భాగస్వామ్యం వారు అడగకపోవచ్చు గానీ.. ఇంకా మూడేళ్లకు పైగా ఉన్న ప్రభుత్వం కాలంలో.. ఏనాటికి పరిణామాలు ఎలా మారగలవో ఊహించడం కష్టం.
బీహార్ రాజకీయాలు కప్పల తక్కెడ రాజకీయాల్లాగా మారిపోయాయి. నిజానికి ఎంతో నిజాయితీ పరుడిగా గుర్తింపు ఉన్న నితీశ్ కుమార్, కరడుగట్టిన అవినీతి పరుడిగా పేరున్న లాలూప్రసాద్ యాదవ్ పార్టీతో జత కట్టి, అది చాలదన్నట్లు కాంగ్రెస్ తో కూడా జట్టు కట్టి… మహా కూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. భాజపాకు రోజులు బాగోలేక వారికి అధికారం కూడా దక్కింది. తమాషా ఏంటంటే.. శాసనసభలో అతిపెద్ద పార్టీగా లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ అవతరించినా కూడా నితీశ్ ని ముఖ్యమంత్రిని చేశారు.
కానీ ఆ కాపురం ఎంతో కాలం సవ్యంగా నడవలేదు. లాలూ కుమారుడు తేజస్వి అవినీతి వ్యవహారాలపై విచారణ మొదలు కావడం, నోటీసులు రావడంతో, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నితీశ్ కోరడం.. దానికి లాలూ ససేమిరా అనడం.. తేజస్వి పదవినుంచి తప్పుకోవడం లేదు గనుక.. నితీశ్ తనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం … నాటకీయ పరిణామాల్లాగా వేగంగా జరిగిపోయాయి. రాజీనామా ఆమోదం కూడా పూర్తయింది.
సరిగ్గా ఈ సమయంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భాజపా రంగ ప్రవేశం చేసింది. నితీశ్ పార్టీకి భాజపా మద్దతు ఇస్తేచాలు.. అక్కడ ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉంది. కమలనాధులు.. రంగంలోకి దిగి, బయటినుంచి మద్దతు ఇస్తూ నితీశ్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం బహుశా లాలూ ప్రసాద్ కు, అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మింగుడు పడేది కాకపోవచ్చు.
నితీశ్ రాజీనామా అనంతరం.. ‘‘అవినీతిపై పోరాటానికి కలిసి వస్తున్నందుకు’’ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపిన నరేంద్రమోడీ.. ఆయనను క్రమంగా తిరిగి తమ ఎన్డీయే కూటమిలోకి లాక్కోగలిగినా ఆశ్చర్యంలేదు. విపక్షాలకు ఇది ఖచ్చితంగా షాకే అవుతుంది.