సాధారణంగా రాజకీయ నాయకుల వైఖరి అంటేనే… ఎప్పటికప్పుడు తమను కలిసిన వారికి సంతృప్తి పరచడానికి నాలుగు మంచి మాటలు చెప్పి.. అక్కడితో వారి ఎపిసోడ్ ను మరచిపోవడం అన్న తరహాలోనే జరుగుతూ ఉంటుంది. ముఖప్రీతికి చెప్పే మాటలే తప్ప.. వారు సీరియస్ గా పట్టించుకునే సంగతులు చాలా తక్కువగానే ఉంటాయి. భారత రాజకీయాలోల వందేళ్లకు పైబడిన సుదీర్ఘ అనుభవం కాంగ్రెస్ నాయకులకు ఇది కొత్త సంగతేమీ కాదు. ఏ ఎండకాగొడుగు పట్టడం, ఏ రోటికాడ ఆ పాట పాడడం వారికి అలవాటే!
మరో రకంగా చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ కార్యరూపం దాల్చకపోవడానికి ప్రధాన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కూడా మోయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో తాము హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించడానికి తాము పోరాడుతున్నట్లుగా చాలా పెద్ద బిల్డప్ లే ఇచ్చింది. ఏపీ కాంగ్రెస్ నాయకులు స్థానికంగా చాలా ముమ్మరంగానే ఉద్యమాలు నడిపారు గానీ.. ప్రజలు వారిని పట్టించుకోలేదు.
అయితే కేంద్ర నాయకుల నుంచి, ప్రధానంగా సోనియా, రాహుల్ ల నుంచి వారికి ‘నిజాయితీతో కూడిన’ మద్దతు లభించలేదు. ఏపీ కాంగ్రెస్ నాయకులు కలిసినప్పుడు.. ‘‘ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే’’ అని రాహుల్ ఓ మాట వదులుతారే తప్ప.. పార్లమెంటులో తానుగా, స్పష్టంగా ఎన్నడూ దానికోసం పోరాడింది.. ప్రయత్నించింది లేదు! ఏపీలో పర్యటిస్తున్నప్పుడు సభల్లో ప్రత్యేకహోదా గురించి సానుభూతి వ్యక్తం చేయడం, ఢిల్లీ చేరగానే.. దాన్ని కన్వీనియెంట్ గా మరచిపోవడం రాహుల్ కు అలవాటు.
తాజాగా కూడా అదే జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఢిల్లీలో ఆయనను కలిసినప్పుడు, ఏపీకి ప్రత్యేక హోదా గురించి రాహుల్ చాలా సానుభూతి మాటలు మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అయితే రాహుల్, నేతలతో మాట్లాడుతూ… ‘‘ఏపీకి అప్పటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇచ్చిన తరువాతే.. సీట్ల పెంపు గురించి ఆలోచించాలని’’ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాహుల్ ఈ మాటలు నిజాయితీతోనే చెప్పి ఉంటే గనుక.. రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారానికి చట్టసవరణ అవసరం అయ్యేట్లయితే.. పార్లమెంటు మూడింట రెండొంతుల మెజారిటీ కావాల్సి ఉంటుంది. అనివార్యంగా విపక్షాల మద్దతు ప్రభుత్వానికి అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్, నాలుగ్గోడల మధ్య నాయకులతో చెప్పినట్టు కాకుండా, సభలో కూడా గట్టిగా హోదాకోసం పట్టు పడితే.. కేంద్రం దిగిరాక తప్పకపోవచ్చు.
కానీ.. రాహుల్ ఆపద్ధర్మపు మాటలాడి రోజులు నెట్టేయడమే తప్ప.. ఎంత మాత్రం నిజాయితీతో ఏపీకి హోదాకోసం పట్టుపడతారన్నది ప్రశ్నార్థకమే. కాంగ్రెస్ ఏపీ నాయకులు కూడా ఏదో జనాంతికంగా తమ రాహుల్ తో ఒక మాట చెప్పించేసి, పాలకపక్షాల మీద నిందలు వేసేసి చేతులు దులుపుకోకుండా నిజాయితీగా పోరాడితే ఫలితం దక్కుతుంది. కనీసం హోదా ఇప్పించగలిగితే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఊపిరి పీల్చుకోవడానికి తగినంత యోగ్యత దక్కుతుంది.