రాజమౌళి-మహేష్ మూవీ.. ఈ సినిమా కోసం ఆల్ ఇండియా ఎదురుచూస్తోంది. సినిమాకు సంబంధించి చాలా విశేషాలు బయటకొచ్చాయి. కానీ ఏదీ అధికారికం కాదు. రచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని వివరాలు వెల్లడించారు కానీ వాటిలో ఎన్ని మార్పుచేర్పులు జరిగాయో తెలియదు.
ఓవరాల్ గా మహేష్-రాజమౌళి సినిమాపై క్లారిటీ రావాలంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. ఎందుకంటే, రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు. అందుకే మహేష్ మూవీపై కూడా మీడియా సమావేశం కోసం అంతా వెయిటింగ్.
ఈ సినిమా ఓ షేప్ తీసుకుంది. కథ ఫైనల్ చేయడంతో పాటు, స్క్రీన్ ప్లే కూడా లాక్ చేశారు. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ కూడా మొదలైంది. విదేశాల్లో మహేష్ పై లుక్ టెస్ట్ కూడా జరిగింది. ఇన్ని జరిగాయంటే సినిమా పని దాదాపు మొదలైనట్టే. మరి ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టాలి కదా.
ఆ కార్యక్రమం ఉంటుందనే ప్రచారం ఈమధ్య జోరుగా జరిగింది. అయితే ఆ టైమ్ లో మహేష్ దేశంలో లేడు. ఆ తర్వాత కూడా కుటుంబంతో కలిసి మరోసారి విదేశాలకు వెళ్లాడు. ఇప్పుడా పర్యటనలన్నీ ముగించుకొని హైదరాబాద్ వచ్చాడు.
అందుకే మహేష్-రాజమౌళి ప్రెస్ మీట్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఏ క్షణమైనా సినిమాకు సంబంధించి ప్రకటన రావొచ్చనే ఫీలర్లు వినిపిస్తున్నాయి. అదే టైమ్ లో మీడియా సమావేశంలో రాజమౌళి మాత్రమే ఉంటారని, మహేష్ రాకపోవచ్చనే చర్చ కూడా నడుస్తోంది.