నాగ్ అశ్విన్- మీరు మారిపోయారు

దర్శకుడు నాగ్ అశ్విన్ మాటల మనిషి కాదు. నిజానికి మీడియా ముందు వెల్ ప్లాన్డ్ గా, గొప్పగా మాట్లాడడం అతనికి రాదు. కేవలం మంచి సినిమాలు తీయడం మాత్రమే వచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత…

దర్శకుడు నాగ్ అశ్విన్ మాటల మనిషి కాదు. నిజానికి మీడియా ముందు వెల్ ప్లాన్డ్ గా, గొప్పగా మాట్లాడడం అతనికి రాదు. కేవలం మంచి సినిమాలు తీయడం మాత్రమే వచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత తన పనేదో తాను చేసుకుంటూ సైలంట్ గా మహానటి తీసి వదిలారు. అప్పుడు కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. మాట్లాడింది లేదు. తరువాత తమ బ్యానర్ లో జాతిరత్నాలు, సీతారామం వంటి సినిమాలకు బ్యాక్ బోన్ గా నిల్చున్నపుడు కూడా సైలంట్ గా వున్నారు. తన ప్రమేయం వుందనే సూచనలు లేవు. హడావుడి లేదు. జస్ట్ తెర వెనుక సైలంట్ గా ప్రమోషన్ ప్లానింగ్ చేస్తూ వెళ్లారు.

మూడేళ్లకు పైగా కల్కి సినిమా చేస్తున్నపుడు కూడా నాగ్ అశ్విన్ నోట మాట వినిపించలేదు. విడుదలకు ముందు ఒక కామన్ ఇంటర్వూ తప్ప మీడియాతో ముచ్చటే లేదు. ముంబాయి వెళ్లి అరడజను ఇంటర్వూలు ఇచ్చినపుడు కూడా పెద్దగా డాంబికం, దర్పం మచ్చుకైనా లేవు. ఇంక బాగోదు అని తెలుగు మీడియా ముందుకు ఓ గంట వచ్చి అలా కూర్చుని వెళ్లారు.

అలాంటి నాగ్ అశ్విన్ ఓ సోషల్ మీడియా పోస్ట్, అది కూడా ఎవరికో ఎక్కడో గుచ్చేలా వేసారు అంటే అది సంచలనమే కదా. ‘ఏ కత్తి పిడి లేదు.. ఏ రక్త తడిలేదు.. ప్రేమ గెలిచింది’ అంటూ పాట వుంది మదరాసు పట్టణంలో. అలా రక్తం చిందించకుండా, బూతులు లేకుండా, వయిలెన్స్ లేకుండా సినిమా హిట్ అయింది అనే పోస్ట్ ను నాగ్ అశ్విన్ పెట్టడం కాస్త ఆశ్చర్యమే. ఆ వెంటనే డిలీట్ చేసారు. అది వేరే సంగతి.

ఈ లోగానే వైరల్ అయిపోయింది. భుజాలు తడుముకోవాల్సిన వారు తడిమేసుకున్నారు. కామెంట్లు, కౌంటర్లు, అన్నీ పడిపోయాయి. చూస్తుంటే నాగ్ అశ్విన్ మెల్లగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నిజంగా మారే క్రమంలో వున్నారు. వెయ్యి కోట్ల సక్సెస్ ఆయను మారుస్తోంది అంటే కనుక, కల్కి 2 విడుదల టైమ్ కు ఫుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది. లేదూ, ఇదేదో యాదృశ్ఛికం అంటే మళ్లీ ఎప్పటి లాగే సైలంట్ గా ఆయన సినిమా ఆయన తీస్తారు. హిట్ కొడతారు.