మల్టీస్టారర్ మూవీస్ కు పెట్టింది పేరు వెంకటేశ్. మంచి పాత్రలు దొరికితే మరో హీరోతో నటించడానికి వెంకీ ఎప్పుడూ సిద్ధమే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నారు వెంకీ. ఈ సినిమాలో మరో పెద్ద హీరో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని అనీల్ రావిపూడి తిప్పికొట్టాడు. తను చేయబోయే సినిమాలో వెంకీ మాత్రమే సోలో హీరోగా కనిపిస్తారని, మరో హీరోకు చోటు లేదని అంటున్నాడీ దర్శకుడు.
“ఈనెల లేదా ఆగస్ట్ లో సినిమా స్టార్ట్ చేస్తాం. వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత నా నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా ఇది. మీ అందర్నీ వెంకటేశ్ మరోసారి నవ్వుల్లో ముంచెత్తుతారు. ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నట్టు గాసిప్స్ వస్తున్నాయి. ఇందులో వెంకటేష్ సోలోగా నటిస్తారు, ఈ సినిమాలో మరో హీరో లేరు.”
ఇలా వెంకీ సినిమాపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు అనీల్ రావిపూడి. డిఫరెంట్ జానర్ లో సినిమా రాబోతోందని చెబుతూనే, వెంకీ నుంచి ఆశించే హిలేరియస్ ఫన్ అంతా ఉంటుందంటున్నాడు.
ఈ సినిమాలో వెంకటేష్ కు భార్యగా ఐశ్వర్య రాజేశ్, అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటించబోతున్నారు. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నడిచే హిలేరియస్ క్రైమ్ డ్రామా ఈ సినిమా.