సమంత చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చింది. తనను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టినా పట్టించుకోనని అంటోంది. కొద్దిసేపటి కిందట సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టింది. దీనికి ఓ కారణం ఉంది.
మయొసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత, కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది.
ఈ క్రమంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబ్యులైజేషన్ గురించి ఆమె ప్రస్తావించింది. దీనిపై ఓ డాక్టర్ భగ్గుమన్నాడు. తనకుతాను డాక్టర్ లా ఫీల్ అయి ఉచిత సలహాలు ఇవ్వొద్దంటూ సమంతకు చీవాట్లు పెట్టాడు. సమంత చెప్పిందని ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించాడు. సెలబ్రిటీ ముసుగులో ఇలాంటి సమాచారాన్ని అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైళ్లో పెట్టాలని అన్నాడు.
దీనిపై సమంత స్పందించింది. తనను జైళ్లో పెట్టినా ఓకే అంటూ స్పందించింది. సదరు వైద్యుడికి తనకంటే ఎక్కువ తెలుసని అంగీకరించిన సమంత.. తను అనుసరిస్తున్న వైద్య విధానాల్ని మాత్రమే సోషల్ మీడియా ఎకౌంట్ లో పెడుతున్నానని, డబ్బుల కోసం ఆ పని చేయడం లేదని, కేవలం అవగాహన కోసమే చేస్తున్నానని అంటోంది.
సమాజంలో చాలామందికి ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి తెలియదని.. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ లాంటి ఎన్నో వైద్య విధానాలున్నాయని, నిపుణుల్ని అడిగి తను వాటి గురించి తెలుసుకున్నానని, వాటిలో కొన్నింటిని పాటించిన తర్వాతే సోషల్ మీడియాలో పెడుతున్నానని స్పష్టం చేసింది.
25 ఏళ్ల పాటు డీఆర్డీవోలో సేవలందించిన ఓ సీనియర్ వైద్యుడు తనకు ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి చెప్పారని, తనలా ఆల్టర్నేటివ్ మెడిసన్ కోసం చూస్తున్న చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, వాళ్ల అవగాహన కోసమే తను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నానని తననుతాను సమర్థించుకుంది సమంత. ఈ విషయంలో తనను జైళ్లో పెట్టినా తనకేం అభ్యంతరం లేదంటోంది.