వారెవ్వా! అంతూ పొంతూ లేని కామెడీలు!

రాజకీయాల్లో కామెడీలు ఎక్కువైపోయాయి. చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో ఒక్కొక్క కామెడీ డైలాగులు మాట్లాడితే అదొక ఎత్తు. అలాంటివి మనకు చాలా తారసపడుతూ ఉంటాయి. ఫర్ సప్పోజ్.. యడ్యూరప్పను మించిన అవినీతి పరుడు లేనేలేడని,…

రాజకీయాల్లో కామెడీలు ఎక్కువైపోయాయి. చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో ఒక్కొక్క కామెడీ డైలాగులు మాట్లాడితే అదొక ఎత్తు. అలాంటివి మనకు చాలా తారసపడుతూ ఉంటాయి. ఫర్ సప్పోజ్.. యడ్యూరప్పను మించిన అవినీతి పరుడు లేనేలేడని, అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో వాక్రుచ్చవచ్చు. కాంగ్రెస్ పుణ్యం వల్లనే టీవాలా అయిన మోడీ ప్రధాని కాగలిగాడని.. మల్లికార్జున ఖర్గే తీర్మానించవచ్చు. వైఫై, ఇంటర్నెట్ అన్నీ వేదాల్లోనే ఉన్నాయని… మహాభారతంలో కూడా లైవ్ కామెంటరీ జరిగిందని.. మరో మేధావి తన మేధస్సును ప్రదర్శించవచ్చు. ఇలా పలువురు వేర్వేరు సందర్భాల్లో కామెడీలు చేస్తుంటారు.

అయితే ఒకే వ్యక్తి.. ఏదో నోరు జారారులే అనుకోవడానికి ఒక సందర్భంలో మాత్రమే కాకుండా.. అనేకానేక సందర్భాల్లో ఇలాంటి కామెడీ ప్రదర్శిస్తూ ఉంటే ఏం అనుకోవాలి. అందుకే మాననీయ మంత్రివర్యులు ఎక్కడ ఏ సభలో పాల్గొనడానికి వెళ్లినా కూడా.. ఖచ్చితంగా ఈ ప్రసంగంలో ఏదో ఒక కామెడీ ఎపిసోడ్ దొరకబోతున్నదని.. ప్రేక్షకులు కూడా టీవీ సెట్లకు అంటిపెట్టుకుని లైవ్ లు చూస్తూ గడిపేస్తున్నారంటే అతిశయోక్తి ఏముంది.

టీవీ ఛానెల్స్ ఇబ్బడి ముబ్బడిగా కామెడీ షోలను వండి వార్చేస్తున్నాయి. అయేనా సరే.. ప్రేక్షకదేవుళ్లకు ఏదోకాస్త అసంతృప్తి.. వెగటు. అంతా రొటీన్ కామెడీ అయిపోతోంది. పాచిపోయిన జోకులనే తిప్పించి మళ్లించి.. మళ్లీ చెప్పేస్తున్నారు. సినిమాల్లో కూడా పంచ్ లు తప్ప.. ఏమాత్రం పసలేని కామెడీనే దక్కుతోంది. అయితే భవిష్య ముఖ్యమంత్రిగా ట్యాగ్ లైన్ తగిలించుకుని.. తన వంది మాగధులందరితో విపరీతంగా పొగిడించుకుంటూ రోజులు నెట్టేస్తూ ఉండే.. మాననీయ మంత్రివర్యుల స్టయిలే వేరు.

ఆయన ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక కొత్తతరహా, నవ్యత ఉట్టిపడే కామెడీని పండించగలరు. జయంతి- వర్ధంతులను తారుమారు చేసేయడం, తాతయ్యకు సీఎం కుర్చీ ఇందిరాగాంధీ చలవతోనే వచ్చిదనడం లాంటి కొసమెరుపు కామెడీ బాణాలు ఆయన అమ్ములపొదిలో చాలానే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే.. ఆ లెక్క ఆయనకు కూడా తెలీదు. మంత్రిగారు ఎక్కడ మీటింగెట్టుకున్నా జాగ్రత్తగా ఫాలోకండి.. ఎక్కడో ఓచోట కొత్త కామెడీ పుడుతూ ఉంటుంది.