సరైన ప్రొడ్యూసర్ దొరకాలే కానీ, ఎంత ఖర్చయినా పెట్టించగల దర్శకుల్లో బోయపాటి శ్రీనివాస్ ఒకరు. పావలాతో చేసేదాన్ని పది రూపాయలతో చేసి, సీన్ కు భారీ తనం తెస్తారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత. ఈ సినిమా మీద కాస్త గట్టి అంచనాలే వున్నాయి. పైగా వంద కోట్ల మార్కెట్ వుంది. అదీ కాక, రంగస్థలం హిట్ అయిన ట్రాక్ రికార్డు హీరోకి వుంది.
అయితే ఈ సినిమాకు ఓపెనింగ్ సీన్ తోనే భయంకరంగా ఖర్చు చేయించడం ప్రారంభించారని వినికిడి. విలన్ ఎంట్రీ సీన్ అయిన బహిరంగ సభ కోసం కోట్లు ఖర్చు చేయించారని టాక్. అయితే ఇప్పుడు సినిమా మూడు వంతులు పూర్తయ్యాక మాత్రం ఖర్చు మీద ఫుల్ కంట్రోల్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది.
హీరో రామ్ చరణ్ ఈ విషయంలో ఫుల్ కంట్రోల్ తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకున్న బడ్జెట్ కన్నా పది కోట్లు కచ్చితంగా తగ్గాలని రామ్ చరణ్ క్లియర్ గా డైరక్టర్ బోయపాటికి చెప్పారట. నిర్మాతకు కాస్తయినా లాభం మిగలాలని, మార్కెట్ వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయించవద్దని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాచెప్పడమే కాదు, అనుకున్న దాని కన్నా 10 కోట్ల లోపు బడ్జెట్ తోనే ఫినిష్ చేస్తున్నదీ లేనిదీ స్వయంగా చూస్తున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
బోయపాటి లాస్ట్ సినిమా జయజానకీ నాయక సినిమాకు నలభై కోట్లకు పైగా ఖర్చు అయింది. కానీ రికవరీ మాత్రం రాక నిర్మాత కుదేలయిపోయారు. బోయపాటి లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ అయినా నిర్మాతకు గట్టిగా కోటి కూడా మిగలలేదు. దమ్ము సినిమా సంగతి తెలిసిందే. సరైనోడు ఒక్కటే నిర్మాత హ్యాపీ అయిన సినిమా అని చెప్పుకోవాలి.
బహుశా ఇవన్నీ చూసే రామ్ చరణ్ ముందుగా కాస్ట్ కంట్రోల్ మీద దృష్టి పెట్టి వుండొచ్చు.