అన్న నాగ్ చైతన్య కెరీర్ దాదాపు సెటిల్ అయింది. జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లడానకి మార్గం ఫిక్స్ అయింది. మంచి రోడ్ రెడీ అయింది. కానీ తమ్ముడు అఖిల్ అక్కినేని సంగతి ఏమిటి? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? అన్నీ ప్రశ్నలే. జవాబులు లేవు.
యువి సంస్థ సినిమా ప్లానింగ్ లో వుంది. కానీ నిర్మాణంలోకి మాత్రం ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. యువి సంస్థ నుంచి వేరే ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. కానీ అఖిల్ సినిమా పరిస్థితి మాత్రం తెలియడం లేదు.
పోనీ యువి సంస్థ సంగతి పక్కన వుంచితే మరే ప్రాజెక్ట్ అయినా వుందా అనే గ్యాసిప్ లు కూడా లేవు. మరి అఖిల్ ఏం చేస్తున్నట్లు? తండ్రి నాగార్జున ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్న ఫ్యాన్స్ లో వుంది. కానీ తగిన సబ్జెక్ట్, తగిన దర్శకుడు దొరకాలి. అలా దొరికితెే నాగ్ ముందుకు వెళ్తారేమో? పోనీ వేరే బ్యానర్లలో కూడా అఖిల్ తో సినిమా ప్లానింగ్ కూడా నాగ్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. అలా అబేయన్స్ లో వుంచేసినట్లు అనిపిస్తోంది.
అఖిల్ ఎంట్రీ టైమ్ లో జరిగిన హడావుడి గుర్తుంది అందరికీ. మంచి అందం, ఒడ్డు, పొడవు వున్న అఖిల్ ను చూసి, మరో మంచి స్టార్ వచ్చాడు టాలీవుడ్ కు అనుకున్నారంతా. కానీ వరుస పరాజయాలు పలకరించేసరికి అదంతా మాయమైంది.
నిజానికి నాగ్ చైతన్య ను కూడా ఆరంభంలో పరాజయాలు పలుకరించాయి. కానీ మీడియం రేంజ్ సినిమాలు వరుసపెట్టి చేస్తూ, మంచి లవ్ స్టోరీలు ఎంచుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లి, ఇప్పుడు ఓ రేంజ్ కు చేరుకున్నారు.
కానీ అఖిల్ అలా మిడ్ రేంజ్ సినిమాలు చేసే ఆలోచనలో వున్నట్లు కనిపించడం లేదు. అదే సమస్య అనే అనుమానం కూడా వుంది. తండ్రి నాగ్, అన్న చైతూల గైడెన్స్ అఖిల్ కు ఇప్పుడు చాలా అవసరం కెరీర్ విషయంలో. మరేం జరుగుతుందో చూడాలి.