భారీ సినిమాలకే జనం “జై” కొడుతున్నారు. చిన్నసినిమాలకి మాత్రం “నై” అంటున్నారు.
ఒకప్పుడు సినిమాలే ఏకైక ఆటవిడుపు. ఏ వయసు వాళ్లైనా వాళ్లకి నచ్చిన సినిమాలకోసం వెతుక్కుంటూ ఉండేవాళ్లు. మహిళల కోసం రకరకాల భక్తిచిత్రాలు, అత్తాకోడళ్ల కథలతో కూడిన సినిమాలు వస్తూండేవి. అలాగే మధ్యవయసు హీరోల సినిమాలు వచ్చేవి. పౌరాణికాలు, జానపదాలు అన్నీ రీ-రిలీజులౌతూ ఉండేవి. ఎవరీ కావాల్సిన వాళ్లు చూసేవాళ్లు. ప్రతి సినిమాకి అంతో ఇంతో గిరాకీ ఉండేది. టీవీలుండేవి కావు కనుక హాల్లో సినిమాలే శరణ్యం.
ఇప్పుడా బాపతు కథలన్నీ టీవీ సీరియల్స్ రూపంలో ఇంట్లోనే ఆడుతున్నాయి.
ఇక మిగిలిందల్లా యంగ్ ఆడియన్స్. ఏ కాలంలోనైనా మాస్ మసాలా పెద్ద హీరోల సినిమాలు ముందుగా ఇష్టపడేది వీళ్లే. వీళ్లు మాత్రం టంచనుగా పెద్ద హీరోల సినిమాలొచ్చినప్పుడు తొలి రోజు తొలి ఆటకే హాలుకొచ్చి హౌస్ఫుల్ చేస్తుంటారు. టాక్ బాగుంటే ఇక ఆగేది లేదు. తేడా కొట్టినా ఆ మూడు రోజులూ ఓకే అనిపిస్తారు.
తాజాగా “కల్కి” చిత్రం ఉదయం 5 గంటలు నుంచే ఆటలు మొదలుపెడితే… ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు.. అన్ని చోట్ల యువప్రేక్షకులు లైన్లు కట్టి కనిపించారు. ఆ రకం సందడి గతంలో ఎప్పుడు చూసామో కూడా గుర్తుకురాని పరిస్థితి.
ఎందుకంటే చిన్న సినిమాల తొలి ఆటకి జర్నలిస్టులు, సమీక్షకులు తప్ప ఎవరూ వెళ్లట్లేదు. అది కూడా ప్రసాద్ మల్టీప్లెక్సులో తొలిరోజు ఉదయం 9 గంటల ఆటకి కనిపిస్తారు వీళ్లంతా. ఆ షో తప్ప మిగిలిన అన్ని హాల్సులోనూ అన్ని షోలు ఈగలు తోలుకునే పరిస్థితే నెలకొని ఉంటోంది సాధారణంగా ఏ చిన్న, మధ్య స్థాయి సినిమాలకైనా.
అంటే ఇంటిపట్టున ఉండిపోయి టీవీల్లోనో, ఓటీటీల్లోనో సినిమాలు చూస్తున్నవారు, ఫేస్బుక్ రీల్స్ అవీ చూసుకుంటూ కాలక్షేపం చేసేసేవాళ్లు హాలుకొచ్చి సినిమా చూడాలంటే పెద్ద హీరోలొక్కరే డ్రైవింగ్ ఫాక్టర్.
టికెట్ రేట్లు పెరిగాయని అందుకే సామాన్యులు హాలుకొచ్చి సినిమాలు చూడట్లేదని ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. కానీ అది పూర్తి కారణం కాదు.
కల్కి సినిమాకి తొలి రోజు 500 ఖర్చు పెట్టి వచ్చిన యువ ప్రేక్షకులంతా ధనికులేం కాదు. వారిలో మధ్యతరగతి వాళ్లు చాలా మంది ఉన్నారు. పెద్ద హీరో సినిమా చూడాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేటుకి వెనకాడలేదు.
ఈ పరిస్థితి చూస్తుంటే.. మళ్లీ పుష్ప-2 కి తప్ప ఈ మానియా ఉండదని అనిపిస్తోంది.
ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్. టి. ఆర్, రాం చరణ్, మహేష్ బాబు తప్ప ఇతర హీరోలెవ్వరికీ ఈ స్థాయి మాస్ మానియా లేదు. తర్వాత శ్రేణిలో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు కానీ ఇప్పుడాయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సినిమాల మీద ఏ మాత్రం దృష్టిపెడతారో చూడాలి. చిరంజీవి, బాలకృష్ణ ఎక్సెప్షన్స్. వారి ఫాలోయింగ్ వాళ్లకుంది.
వీళ్లని మినహాయిస్తే నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, ఇతర మెగా హీరోలు, అక్కినేని హీరోలు… వీళ్ల సినిమాలు టాక్ ని బట్టి నడవాలి తప్ప తెల్లవారుజాము షోల నుంచీ హాలుకి ప్రేక్షకుల్ని వేలంవెర్రిగా లాక్కురాగిలిగే బాహుబలీమైన స్టార్ డం వీళ్లకి లేదు.
అంటే ఇక బాక్సాఫీసుకి అతిపెద్ద స్టార్ హీరోలే దిక్కు. మిగిలిన హీరోల సినిమాలన్నీ లాటరీలే.
ఈ డైనమిక్స్ అన్నీ చూసాక 15 కోట్ల రేంజ్ సినిమా కన్నా, 200 కోట్ల సినిమా సేఫ్ అనే డిస్కషన్ ఒకటి నడుస్తోంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకే మార్కెట్ ఉన్నప్పుడు అక్కడే పెట్టుబడి పెడితే ఏ మాత్రం టాక్ బాగున్నా లాభాలు, ఒకవేళ టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మరియు మొదటి మూడు రోజుల కలెక్షన్స్ తో దాదాపు బ్రేక్ ఈవెన్ అనే లెక్క, ఆ పైన ఓటీటీ, ఆడియో రైట్స్ అన్నీ లెక్క కనిపిస్తున్నాయి.
చిన్న బడ్జెట్ సినిమాలకి ఆడియో రైట్స్ కొనే నాథుడు లేడు. హాల్లో ఆడితే చూద్దామని మొహం చాటేస్తున్నారు తప్ప, ఎక్కటో ఒకటీ అరా తప్ప ఓటీటీ వాళ్లు కూడా ముందుగా కొనేయట్లేదు. ఆడితే తోచినంత ఇచ్చి కొంటారు. ఆడకపోతే మొహమే చూడరు. వీటిల్లో రెండో రకం సినిమాలే అధికం.
కనుక ఓటీటీలని నమ్ముకుని సినిమాలు తియ్యాలని దిగితే అంతే సంగతులు. సినిమా జనం కూడా అస్సలు మార్కెట్ తెలియని బయటి ప్రొడ్యూసర్లనే ఎక్కువగా సినిమా మేకింగులోకి దింపుతున్నారు.
రెండు కోట్ల బడ్జెట్టుతో తీసే కథ, నాలుగు కోట్ల బడ్జెట్టుతో అయిపోయే సినిమా అని చెప్పి కొత్తవాళ్ళతో సినిమాలు తీస్తున్నారు. వాటిలో అసలు విడుదలకే నోచుకోని సినిమాలు ఎక్కువ. విడుదలైనా ఎప్పుడయ్యాయో, ఎక్కడయ్యాయో కూడా తెలియని బాపతు చాలా ఉంటాయి.
ఉదాహరణకి, ఏ సమయంలోనైనా బుక్ మైషో ఓపెన్ చేసి చూడండి. అస్సలు ప్రచారానికి నోచుకోకుండా, అందులో నటించెదవరో కూడా తెలియకుండా కొన్ని సినిమాలుంటాయి. వాటి నిర్మాతలంతా దాదాపు కొత్తవారే ఉంటారు.
ఈ లెక్కన కొత్త, చిన్న స్థాయి, మధ్యస్థాయి హీరోల పరిస్థితి ఏవిటి అంటే అగమ్యగోచరమే. ఎంత ప్రయిత్నించినా సక్సెస్ రాకపోతే ఎలాగూ చేసేదేం లేదు. కొన్నాళ్లు కాస్త వెలిగి సడెన్ గా ఆరిపోతేనే ఏం చెయ్యాలో, ఎటు అడుగువేయాలో అర్ధం కాదు. పేర్లు ఎందుకులే గానీ అలా ఎప్పటికీ సక్సెస్ కాని సినిమా నేపథ్యమున్న యంగ్ హీరోలు, ఒక వెలుగు వెలిగి సడెన్ గా మార్కెట్ లేక ఆరిపోయిన యువ కథానాయకులు కాస్త పరిశీలిస్తే చాలామందే కనిపిస్తారు.
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ స్టార్ హీరో-డ్రివెనే. ఇప్పుడూ అంతే. అయితే గతంలో ప్రేక్షకులు మిగిలిన హీరోలని కూడా పట్టించుకునేవాళ్లు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఏదో ఒక ప్రత్యామ్నాయ పద్ధతి రావాలి తప్ప థియేటర్ దగ్గర మిడ్ రేంజ్, చిన్న హీరోలకి కాలమైతే చెల్లిపోయింది.