Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - Chanakya

ఛాంబర్ లో మీటింగ్ లు మొదలు

ఛాంబర్ లో  మీటింగ్ లు మొదలు

టాలీవుడ్లో ఉప్మా మీటింగ్ లు అనే పద ప్రయోగం ఒకటి వుంది. అంటే మరేమీ బూతు మాట కాదు. పెద్దగా ప్రయోజనం లేని సమావేశాలు అని. అలాగే వెనటికి ఓ మోటు సామెత వుంది.. మొగుడు చస్తే కానీ ముండకు బుద్ది రాదని. 

చాంబర్ లో సోమవారం షురూ అయిన చర్చా సమావేశాల గురించి ఆలోచించినా తెలుసుకున్నా ఇలాంటి వ్యవహారాలే గుర్తుకు వస్తాయి. ముఫై, నలభై రోజుల స్పాన్ లో తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలైతేనేం, బయ్యర్లయితేనేం..వంద కోట్లకు పైగా పోగొట్టుకున్నారు. ఆ మేరకు హీరోలయితే, బడా దర్శకులైతేనేం, బడా టెక్నీషియలన్లయితేనేం పోగేసుకున్నారు. ముఖ్యంగా బయ్యర్లు కుదేలైపోయారు. దీంతో ఒక్కసారి అందరూ కలిసి బోధి చెట్టు కింద కూర్చుని జ్ఞానోదయం చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. దాంతో నిర్మాతలు, బయ్యర్లు, నటీనటుల ప్రతినిధులు అంతా ఓ చోట చేరారు. 

సినిమాలు విడుదలకు ముందు గాలి పటాల్లా కళ్ల ముందు రంగుల ప్రపంచాన్ని ఎగరేస్తున్నాయి. విడుదలైన తరువాత గాలి బుడగల్లా పేలిపోతున్నాయి. ఈ తయారీకి, విడుదలకు నడుమ ఈ రంగుల ప్రపంచం చూసి, కోట్లు కుమ్మరించిన బయ్యర్లు బకెట్లు తన్నేసే స్థాయికి చేరుకుంటున్నారు. అదిగో పెద్ద సినిమా ప్రకటన అంటే చాలు, కొబ్బరి కాయ కొట్టినా కొట్టకున్నా కోట్లు తీసుకెళ్లి నిర్మాతల చేతుల్లో పోస్తున్నారు. ఈ పరిస్థితి గమనించి నిర్మాత ఓ క్రేజీ హీరో, డైరక్టర్ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. అలా ప్రారంభమైన సినిమా కథ, విడుదల తరువాత బయ్యర్లు ఖతమై పోయేందుకు దారి తీస్తోంది. 

ఇప్పుడు చాంబర్ సమావేశంలో తక్షణ కర్తవ్యం పై చర్చలో కీలక పాయింట్ అదే. సినిమా కుదేలైపోతే..బయ్యర్లు మాత్రమే ఎందుకు బలైపోవాలి అన్నది పాయింట్. అందుకే వాళ్లు ఓ స్థిర నిర్ణయంతో ఇండస్ట్రీ ముందుకు వచ్చారు. ఇకపై కోటి రూపాయిలు పెట్టి సినిమా కొంటే, అది కాస్తా బకెట్ తన్నేస్తే ఎనభై లక్షలు తమకు తిరిగి ఇవ్వాలని. అలా అయితేనే సినిమా కొంటామని, ఆడిస్తామని, లేదంటే లేదని తెగేసి చెబుతున్నారు.. కాదంటే కాస్త అడ్వాన్స్ ఇచ్చి షేరింగ్ మీద ఆడిస్తామంటున్నారు. దాంతో ఇన్నాళ్లు బయ్యర్ల డబ్బులతో వ్యాపారం చేసిన వారు ఇప్పుడు పరిస్థితి అడ్డం తిరిగేసరికి కిందామీదా అవుతున్నారు. దీంతో సమావేశం అనివార్యమయింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఈ సమావేశంలో రభస, సికిందర్, ఆగడు సినిమాల ఫలితాల నేపథ్యంలో చర్చ జరిగింది.

ఏకాభిప్రాయం

తొలిసారి చాంబర్ లో జరిగే ఇలాంటి సమావేశాల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. నిర్మాణ వ్యయం తగ్గాలని, అదే సమయంలో థియేటర్ల అద్దెలు తగ్గాలని, హీరోలు, బడా సాంకేతిక నిపుణులు కూడా నష్టాల్లో వాటా తీసుకోవాలని, పలువురు సూచించారు. తమ తమ ఆధీనంలో వున్న థియేటర్ల అద్దెలు తక్షణం తగ్గించడానికి తాము సిద్దమని నైజాం కు చెందిన దిల్ రాజు, ఆసియన్ సునీల్ చెప్పారు. ఆగడు నష్టానికి సంబంధించి తాను కొంత వరకు భరిస్తానని హీరో మహేష్ బాబు ముందుకు వచ్చారని ఆ సినిమా నిర్మాతలు వెల్లడించారు. రభస హీరో ఎన్టీఆర్ కు తాను ఫుల్ పేమెంట్ ఇచ్చానని, ఇప్పుడు నష్టం భరించమని అడగలేనని నిర్మాత బెల్లంకొండ అన్నట్లు బోగట్టా. 

సినిమా ప్రకటించకుండానే, ఏళ్లకు ఏళ్లు ముందుగా అడ్వాన్సులు ఇవ్వడం ఏమిటన్న పాయింట్ కూడా చర్చకువచ్చింది. సినిమా ప్రారంభించే ముందు అడ్వాన్స్ లు ఇవ్వడం, సినిమా విడుదలకు ముందు అన్న సెటిల్ చేయడం మంచి పద్దతి అని, ఇప్పటికీ గీతా ఆర్ట్స్ ఇదే పద్దతి పాటిస్తోందని సమావేశంలో కొందరు అన్నారు. నిర్మాతల సొమ్ము హీరోలు, దర్శకుల దగ్గర దాదాపు వంద కోట్లకు పైగానే వుందని లెక్క చెప్పారు మరి కొందరు. హీరోకు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి, వడ్డీలు భరిస్తూ ఏళ్ల తరబడి వేచి వుండడం ఏమిటన్న పాయింట్ కూడా వచ్చింది. 

ప్రస్తుతానికి ఈ దశలో చర్చలు ఆగాయి. ఎలాగైనా ఈ పరిస్థితి మార్చాలని, అన్ని విధాలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే అసలు సమస్యలు ఏమిటి? ఇలాంటి సమావేశాల వల్ల ఫలితం ఏ మేరకు. ఈ నిర్ణయాలు అమలు సాధ్యమేనా? ఇలాంటి నిర్ణయాల వల్ల చోటామోటా టెక్నీషియన్లు, నటీనటులు బలైపోయి, పెద్దవాళ్లు బాగానే వుంటున్నారన్న విమర్శలు ఏమేరకు నిజం..వంటి విషయాలన్నీ మరో వ్యాసంలో

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?