Advertisement

Advertisement


Home > Articles - Chanakya

హెచ్చు, తగ్గులు తెలియని జగన్‌!

హెచ్చు, తగ్గులు తెలియని జగన్‌!

అన్నికళలు అందరూ ఔపాసన పట్టాలని లేదు. అందరికీ అన్నీ అందిరావాలనీ లేదు. పాపం, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యవహారం ఇలాంటిదే. ఆయనకు వ్యాపార పటిమ వుందేమో కానీ రాజకీయ చాకచక్యం వున్నట్లు కనిపించడం లేదు. రాను రాను ఈ అనుమానం పెనుభూతంగా మారుతోంది. వైకాపా దుకాణాన్ని ఖాళీ చేస్తోంది. 

రాజకీయాల్లో రాణించాలనుకునే వారు వైరి బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. గాలి వాటాన్ని బట్టి సరంగు తెరచాప సరిచేసుకున్నట్లు, పరిస్థితిని బట్టి తగ్గడం, హెచ్చడం చేసుకోవాలి. 

జగన్ చేసిన తొలి తప్పిదం కాంగ్రెస్ పై తిరుగుబాటు బావుటా ఎగరేయేడమే. వైఎస్ కు స్వంత పార్టీ అంటూ వుంటే వారసత్వాన్ని ఆశించితే వేరేగా వుండేది. కాంగ్రెస్ దుకాణంలో ఉద్యోగిగా వున్న వైఎస్ మరణిస్తే, అది తనకు అందించాలని కోరడం తొలి తప్పు. అలా అందివ్వకపోతే తిరుగుబాటు చేయడం మలి తప్పు. ఎందుకంటే శోధనలు, పరిశోధనలు, దర్యాప్తులు ఎలా వున్నా, జగన్ కు తన వ్యవహారాలు తనకు క్షుణ్ణంగా తెలిసి వుండాలి.అలాంటపుడు తేలు కుట్టిన చందంగా వీలయినంత నెమ్మదిగా వుండాలి కానీ గెంతకూడదు. అదే చేసారు..సోనియా పుణ్యమా అని జైలుపాలయ్యారు. నానా ఇబ్బందులు పడుతున్నారు.

సరే, తిరుగుబాబు చేసారు. పార్టీ పెట్టారు. జనాల్లోకి వెళ్లారు. అలాంటి సమయంలో భాజపా నుంచి సిగ్నల్ వచ్చింది. మరి అందిపుచ్చుకోవాలి కదా. దేశంలో వీస్తున్న మోడీ గాలిని అంచనా వేయడంలో విఫలమయ్యారు. తన వెనుక వున్న ఓట్ బ్యాంక్ మోడీ, భాజపా కారణంగా ఎక్కడ దూరమవుతుందో అని భయపడ్డారు. గెలిచిన తరువాత కొమ్ముకాస్తా కావాలంటే,అని వర్తమానం ఇచ్చారు. కానీ మోడీకి, భాజపాకు బేరాలు కరువా..రాజకీయ సమీకరణలు మారుతున్న వైనం, గాలి మార్పు గమనించి, ఆ అవకాశాన్ని బతిమాలి, బామాలి మరీ అందిపుచ్చుకుంది తెలుగుదేశం. ఆ పార్టీకి రాని సెక్యులర్ సమస్య జగన్ కు ఎక్కడి నుంచి వచ్చి వుండేది. ఇలా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం మూడో తప్పిదం. 

విభజన పనికిరాదని గొంతెత్తారు. కానీ తెలుగుదేశం పార్టీ విభజన కాంగ్రెస్, దాని అనుబంధ పిల్ల కాంగ్రెస్ పుణ్యమే అని గోల గోల చేసింది. నిజానికి విభజనను పరోక్షంగా సమర్థించింది తెలుగుదేశం అన్నది క్లియర్. ఈ తప్పుడు ప్రచారాన్ని జగన్ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. నాలుగో తప్పిదం.

రైతులు రుణమాఫీ పట్ల ఆకర్షిలవుతున్నారు అని గమనించలేకపోయారు జగన్. రుణమాఫీ అసాధ్యం అన్నిది వాస్తవమే.కానీ జనాలకు కావాల్సింది సాధ్యమా? అసాధ్యమా అన్నది కాదు. తమకు ఆయన ఇస్తామంటున్నారు..ఈయన కుదరదంటున్నారు. అంతే. రుణమాఫీ తన పార్టీ విజయాన్ని ప్రభావితం చేస్తుందని ఏ మాత్రం గుర్తించినా జగన్ కూడా సై అని వుండే వారేమో? అలా గుర్తించలేకపోయారు. మరో తప్పిదం.

సరే ఓడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వెనకటికి సామెత వుంది. వెధవ ఆస్తి పోతే పోయింది కానీ, కోర్టు పద్దతులు తెలిసాయి అన్నాడట. ఓడితే ఓడారు కానీ రాజకీయం వంటబట్టిందా అంటే అనుమానంగానే వుంది. జగన్ మాట తీరు, చేత తీరు రెండూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

రుణమాఫీ మీద నానా పోరు చేసారు. జగన్ రేపు పోరు తీవ్రం చేస్తారనగా ముందు రోజు చంద్రబాబు మాఫీ ప్రకటించారు. అది ఆ పార్టీ విజయం అన్నదాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. అలాగే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వేరు, పోరాటం చేయడం వేరు. ఈ రెండింటి సంగతి అలా వుంచి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది. నేను ముఖ్యమంత్రిని అవుతా అనే అర్థం వచ్చేలా మాట్లాడకూడదు. అది నాయకుడికి నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది. 

ఇక రాజధాని వ్యవహారంలో సాక్షి పత్రికలో వస్తున్న కథనాల మేరకు వైఎస్ఆర్ పార్టీ పోరు బాట వుడడం లేదు. రాజథానిపై నిర్థిష్ట కార్యాచరణ కనిపించడంలేదు. మరోపక్క పార్టీని వీడిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అటు తెలంగాణలో పార్టీకి ఓ దిశ, దశ అన్నవి కనిపించడం లేదు. కేసిఆర్ ను పల్లెత్తు మాట అనకుండా తెలంగాణలో పార్టీని ఎలా బతికించి, పెంచి పెద్ద చేయాలన్నది జగన్ ఆలోచన అన్నది అర్థం కాదు. అదే సమయంలో ఆంధ్రలో మాత్రం విమర్శలు చేయడం అన్నది ఏ విధంగా సమర్థనీయం అవుతుంది అని ఆలోచించడం లేదు. 

మరోపక్క తన పార్టీ నుంచి పోయే వారు పోతుంటే, కొత్త నెత్తురు ఎక్కించే ప్రయత్నం కనిపించడం లేదు. నాయకుడు అనేవాడు తన ఛత్ర ఛాయకిందకు వచ్చేవారిన చూసి జంకకూడదు. ఎందరు వచ్చినా, ఎలాంటి వారు వచ్చినా మేనేజ్ చేయగలగాలి. జేసి బ్రదర్స్ లాంటి వారినే బాబు తన పార్టీలోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ మాజీ కాంగ్రెస్ వాదులను ఎందుకు కూడగట్టకూడదు. బాబు విమర్శిస్తారని భయమేల. ఎందుకంటే ఆ పార్టీ నిండా వున్నది వారే కదా ఇప్పుడు. కాంగ్రెస్ లోని సీనియర్లు అనేకమంది సరైన ఫ్లాట్ ఫారమ్ లేకుండా మూలన వున్నారు. 

వారిని ఏకతాటిపైకి తెచ్చి, జిల్లాల వారీగా పార్టీని బలోపేత చేసే దిశగా జగన్ ఎందుకు ఆలోచన చేయడంలేదు. తెలివైనవాడు బలవంతులను వాడుకుని పైకి వస్తాడు.వారిని దూరంగా వుంచి ధైర్యంగా వుండడు. మొదటివాడు చంద్రబాబు అయితే, రెండవ కేటగిరీ జగన్. ఇలా రాజకీయంగా ఎత్తులు వేయడంలో కానీ, పార్టీని పటిష్టం చేసుకోవడంలో కానీ జగన్ అన్నివిధాలా విఫలమవుతుంటే, ఇంకా ఆ పార్టీని నమ్ముకుని ఎవరు వుంటారు. మళ్లీ కావాలంటే నాలుగేళ్ల తరువాత జగన్ బాగుంటే అప్పుడు రావచ్చులే అనుకనేవారే అంతా. ఇలా అనిపించిందంటే,అది నాయకత్వలోపం, నాయకత్వంపై నమ్మకం లేకపోవడం కాక మరేమిటి అనుకోవాలి. 

జగన్ ఇంకెప్పుడు రాజకీయానుభవం సంపాదించి, పార్టీని పటిష్టం చేసుకుంటారో? అప్పటికి పుణ్యకాలం పూర్తయిపోతుందేమో?

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?