లోకేశ్వరుడు

తెలుగు రాష్ట్రాలకూ ఆయనే సర్వ సేనాని కొడుకు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చే నెలలో ప్రకటన జాతీయ అధ్యక్షునిగా బాబు Advertisement తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ చేతిలోకి వెళ్లిపోతున్నాయి. భవిష్యత్తు నేతగా…

తెలుగు రాష్ట్రాలకూ ఆయనే సర్వ సేనాని
కొడుకు చేతికి టీడీపీ పగ్గాలు
వచ్చే నెలలో ప్రకటన
జాతీయ అధ్యక్షునిగా బాబు

తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ చేతిలోకి వెళ్లిపోతున్నాయి. భవిష్యత్తు నేతగా నిన్నటివరకూ పార్టీ పెద్దల నోళ్లలో నానిన ఆయన పేరు ఇపుడు ఉత్తరాధికారిగా ప్రకటితమవుతోంది. త్వరలోనే ఈ ముచ్చట తీరనుంది. లోకేష్ తెర వెనుక నుంచి తెర ముందుకు వచ్చారు, ఇపుడు అధినాయకత్వం చేపట్టి పూర్తి స్ధాయి రాజకీయ నాయకుని అవతారం ఎత్తనున్నారు. తండ్రి చాటు తనయునిగా ఇంతకాలం కధ నడిపిన నారా వారి తనయుడు ఇపుడు నేరుగా రంగంలోకి దూకేస్తున్నారు. టీడీపీ రాజకీయాలలో వారసత్వం అన్నది ఇదే తొలిసారి కాబోతోంది. మూడున్నర దశాబ్దాల క్రితం అన్న ఎన్టీఆర్ స్ధాపించిన టీడీపీలో అంతా ఆయనే అయ్యారు. ఆయన తరువాత నంబర్ టూగా వచ్చిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటును మొగ్గలోనే తుంచేసి మళ్లీ పార్టీ నాయకత్వాన్ని, అధికారాన్ని సొంతం చేసుకున్నారు. 

మరి, తరువాత కాలంలో ఆయన అల్లుడు చంద్రబాబు నంబర్ టూగా ఎదిగారు, చివరికి ఆయనే ఎన్టీఆర్ పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కున్నారు. ఇది జరిగి రెండు దశాబ్దాల కాలం అయింది. బాబు తరువాత పార్టీలో నంబర్ టూ స్ధానం కోసం ఎందరో పోటీ పడినా వారిని ఆ స్ధాయిలో కూర్టోబెట్టేందుకు ఆయన సుతరామూ ఇష్టపడలేదు. ఒకేసారి నలుగురైదుగురిని అత్యంత సన్నిహితులుగా చేసుకుని వారిలో వారికే పోటీ పెట్టి తన వరకూ రాకుండా బాబు చూసుకున్నారు. ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ టీడీపీ నాయకత్వం కోసం పోటీ పడే రాజకీయ స్ధాయికి ఏ రోజూ చేరుకోలేదు. బాబు కేబినెట్‌లో మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన హరికృష్ణ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు యువత అధ్యక్ష పదవికి పట్టం కట్టాలని విశ్వ ప్రయత్నం చేసినా అది కూడా చివరికి నెగ్గలేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలోనూ, అ ముందు అంటే 2009 ఎన్నికలలోనూ లోకేష్ తండ్రీ వెనుక ఉండి తన బాధ్యతలను నిర్వహించారు. ఇపుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. మరో నాలుగున్నర ఏళ్లలో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోగా కుమారుడు కుదురుకోవాలంటే ఇదే సరైన సమయమని చంద్రబాబు తలపోస్తున్నారు. అందుకు ముందుగానే సీనియర్ నాయకుల సమ్మతిని సంపాదించిన ఆయన లోకేష్‌కు నూరు శాతం మార్కులు వారి చేత కూడా వేయించుకోగలిగారు. ఇపుడు యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తమే తరువాయి.

పది రోజుల క్రితమే …

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖీ ఎన్నడూ బాబు నెరపలేదు. దీంతో, ఏడు నెలలుగా ముఖ్యమంత్రికి, పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరిగిపోతూ వస్తోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబునాయుడు ఈ నెల 4న పార్టీ ఎమ్మెల్యేలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం పూర్తి సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ఎమ్మెల్యేలు చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇదే వేదికను తన కుమారునికి పట్టాభిషేకానికి బాబు చక్కగా వినియోగించుకున్నారు. ఈ సమావేశంలో లోకేష్ అతి ముఖ్య పాత్ర పోషించారు. అంతటితో ఆగలేదు. పార్టీకి అత్యంత సీనియర్లు అనుకున్న వారితోనూ ఆయన తండ్రితో పాటే కూర్చుని ఆంతరంగిక చర్చలు జరిపారు. ఏడు నెలల కాలంలో టీడీపీ పాలన ఎలా ఉంది, చేసిన వాగ్దానాలు ఎలా నెరవేర్చాం, జనం ఏమి అనుకుంటున్నారు వంటి వాటిపై ఆరా తీశారు, అపైన రానున్న కాలంలో ఎలా పనిచేయాలి అన్నది కూడా దిశానిర్దేశం చేసే స్ధాయికి లోకేష్ ఎదిగారు. ఈ సమావేశం చూసిన వారితోపాటు, సీనియర్లు సైతం లోకేష్ ఇక టీడీపీ అధినాయకుడు అన్న మాట అని ఖాయం చేసేసుకున్నారు. బాబు కూడా మానసికంగా వారిని అలా సమాయత్తపరిచారు. దీంతో, లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అన్ని వైపుల నుంచి కూడా సానుకూలతను బాబు రాబట్టగలిగారన్నమాట.

ఒకటా. రెండా…

లోకేష్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షున్ని చేస్తారని పార్టీ వర్గాల టాక్‌గా ఉంది. అదే సమయంలో తెలంగాణాలో అక్కడ నాయకులు మాత్రం ప్రైవేటు సంభాషణల ఏపీ నాయకత్వాన్ని మళ్లీ ఎలా రుద్దుతారని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో, మధ్యేమార్గంగా ఏది వీలు కుదురుతుందో దానిని ఎంచుకోవడానికే బాబు కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు లోకేష్‌ను సమన్వయకర్తగా నియమించి అక్కడా, ఇక్కడా అనుబంధ కమిటీలను పార్టీ విభాగాలతో ఏర్పాటు చేయడం ఇందులో మొదటిది. ఈ విధంగా ఏర్పాటుచేసే కమిటీలలో సీనియర్లను నియమించడం ద్వారా వారిని సంతృప్తి పరచడమే కాకుండా తుది అధికారాన్ని లోకేష్ చేతులలో నుంచి పోకుండా చూసినట్లవుతుందని బాబు భావిస్తున్నారు. దాంతో, రెండు తెలుగు రాష్ట్రాలకకు సమన్వయ కర్తగా లోకేష్‌బాబు పేరు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుంటే లోకేష్‌ను ఏదో ఒక రాష్ట్రానికి పూర్తి స్ధాయి అధ్యక్షున్ని చేసి రెండవ దాంట్లో ఆయనను కీలక పాత్ర పోషించేలా చేయడం కూడా మరో ప్రతిపాదనగా ఉంది. అంటే ఎట్నుంచి ఏమి జరిగినా పార్టీ పగ్గాలు మాత్రం బాబు నుంచి లోకేష్‌కే దేక్కలాగానే బాబు ఆలోచనలు సాగుతున్నాయి. అయితే, దీనిని ఆచరణలో పెట్టేందుకు బాబు సీనియర్ల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచే అటు, ఇటూ కూడా వివిధ జిల్లాలలో లోకేష్ పర్యటనలు ఏర్పాటుచేయడం, వాటికి మంచి స్పందన వచ్చేలా చేసుకోవడం ద్వారా సర్వజనామోదం ఉందన్న టాక్‌ను విస్తృతం చేయాలన్నదే బాబు వ్యూహంగా కనిపిస్తోంది.

ఫిబ్రవరిలోనే ముహూర్తం

అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి నెలలోనే లోకేష్‌బాబును మనం తెలుగు రాష్ట్రాల సర్వ సేనానిగా చూడబోతున్నాం. ఎందుకంటే మే నెలలో టీడీపీ మహానాడు ఉంటుంది, అప్పటికి జాతీయ కమిటీలను ఏర్పాటు చేసే పనిలో టీడీపీ బిజీగా ఉంటుంది. ఏపీ, తెలంగాణాతో పాటు, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల పార్టీ శాఖలను ఏర్పాటుచేయాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాతో పాటు, వివిధ రాష్ట్రాలకు అధ్యకలను నియమించాలని భావిస్తున్నారు.

మేలో జాతీయ స్ధాయిలో టీడీపీకి ఎన్నికలు జరిపించి చంద్రబాబును అధ్యక్షునిగా ఎన్నుకుంటారని పార్టీ నాయకుల సమాచారం. అంటే బాబు జాతీయ రాజకీయాను చూసుకుంటే తనయుడు లోకేష్ తెలుగు రాజకీయాలను చూసుకుంటారన్నమాట. ఇక, పార్టీలోని సీనియర్లను కూడా జాతీయ స్ధాయి కమిటీలో నియమించడానికి బాబు కసరత్తు చేస్తున్నారు. ఆ విధంగా వారి సీనియారిటీని గౌరవించినట్లవుతుంది, ఇక్కడ లోకేష్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లవుతుందన్నది బాబు యోచనగా ఉంది.

మొత్తం మీద పార్టీలోని పెద్ద తలకాయలన్నీ లోకేష్ ఇక పార్టీ బాస్ అన్న నిర్ణయానికి వచ్చేసారు.  ఆ విధంగా బాబు వారిని సిద్ధం చేశారని కూడా చెప్పుకోవాలి.

బడుగుల మాటేమిటి..

కాగా, టీడీపీ అంటేనే ఓ సామాజికవర్గం పార్టీ అన్న ముద్ర ఉంది. ఇపుడు జాతీయ స్ధాయికి ఎదిగిన పార్టీలో కూడా అదే సామాజికవర్గం పెత్తనం చేస్తే బడుగులు, బలహీనుల మాటేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి టీడీపీ అధ్యక్ష పదవిని తెంగాణాలో బీసీ సామాజికవర్గానికి, ఏపీలో ఎస్‌సి సామాజికవర్గానికి ఇవ్వాలన్న డిమాండు చాలాకాలంగా ఉంది. బాబు ఎటూ ముఖ్యమంత్రిగానూ, జాతీయ స్ధాయి అధ్యక్షునిగానూ ఉంటారు కనుక. తమకు కూడా న్యాయం చేసినట్లవుతుందని వారి ఆశ. తెలంగాణాలో రెడ్డి సామాజికవర్గం కూడా ఈ పదవి కోసం పట్టుపడుతోంది. అక్కడ రాజకీయ సమీకరణలలో ఆ వర్గం పాత్ర కీలకం. ఈ పదవిని యువనేత రేవంత్‌రెడ్డి కూడా ఆశిస్తున్నారు. అలాగే, బీసీల నుంచి ఎర్రబెల్లి దయాకరరావు ఉండనే ఉన్నారు. ఇక, ఏపీలోనూ ఆ పదవి కోసం పోటీ పడే నేతలు చాలామంది ఉన్నారు. బయటకు పేర్లు చెప్పకపోయినా ఎస్‌సి, బీసీల నుంచి అనేక మంది పదవి ఇస్తే చేపట్టాలని కుతూహలంతో ఉన్నారు. ఇపుడు లోకేష్‌బాబుకు పెత్తనం మొత్తం అప్పగించి తూతూమంత్రం కమిటీలలో ఈ ఆశావహులను నియమిస్తే వారు ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాల్సిన అవసరంఉంది. ఎంతైనా టీడీపీ కుటుంబ పార్టీ అన్న నిర్ణయానికి వచ్చినవారే టీడీపీలో కొనసాగుతారు కాబట్టి, వారి వ్యతిరేకత పెద్దగా పనిచేయదన్న ధీమా కూడా నాయకత్వానికి ఉంది. ఒకవేళ ఎవరైనా అలా కనుక చేస్తే వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో కూడా బాబుకు తెలుసు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ పగ్గాలు లోకేష్‌కు బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించే రోజు కడు సమీపంలోనే ఉందన్నది సత్యం.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,