తక్కిన రాష్ట్రాలలో కంటె కర్ణాటకలో మఠాలు ఎక్కువ. అనేక విద్యాలయాలు, సంస్థలు, ఆస్తులు వారి ఆధ్వర్యంలో నడుస్తూ వుంటాయి. వారి ప్రభావం ఆ యా కులస్తులపై వుండడం చేత ఓట్ల కోసం పాలకులు ఆ మఠాలను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. బిజెపి పాలనలో ఎడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీశ్ శెట్టార్ అనేక మఠాలకు కోట్లాది రూపాయల గ్రాంట్లు యిచ్చి మఠాధిపతులను మెప్పించారు. ఇప్పుడు కాంగ్రెసు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మఠాలకు ముకుతాడు వేసి బిజెపి బలాన్ని తగ్గిద్దామని చూస్తున్నాడు. కర్ణాటక హిందూ రెలిజియస్ ఇన్‌స్టిట్యూట్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (ఎమెండ్‌మెంట్) బిల్లు తయారుచేసి యిటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఏదైనా మఠం నిర్వహణలో అవకతవకలు జరిగినా, వారసత్వపు గొడవలు వచ్చినా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని నిర్వహణ చేపట్టవచ్చు. మఠాధిపతి కోరినా, వారసుణ్ని నియమించకుండా చనిపోయినా, వారసుడు మైనర్ అయిన సందర్భాల్లో సంరక్షకుణ్ని నియమించకపోయినా, వారసుడికి భౌతికంగా కానీ మానసికంగా కానీ వైకల్యం వున్నా, ఒక్క షో కాజ్ నోటీసు యిచ్చి హేండోవర్ చేసుకోవచ్చు. మఠం మీద వచ్చే ఆదాయాన్ని మఠం మీదనే ఖర్చు పెట్టాలనే నిబంధన పెట్టారు.
కర్ణాటక జనాభాలో లింగాయతులు 19%, ఒక్కళిగలు 17% మంది వున్నారు. వీరే కర్ణాటక రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. చాలా భాగం మఠాలు వీరి చేతిలో వున్నాయి. ఈ బిల్లు వలన తమ ఆధిపత్యానికి భంగం కలుగుతుందని వారు ఆందోళన చెంది, నిరసనలు చేపడుతున్నారు. ''అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున అంత అడావుడిగా ఎందుకు తీసుకురావాలి? దీన్ని అడ్డం పెట్టుకుని వారసత్వపు గొడవల్లో చిక్కుకుని వున్న హుబ్బళిలో మూరుసవీర మఠ్ వంటి పెద్ద మఠాన్ని సునాయాసంగా ప్రభుత్వం చేజిక్కించుకోగలదు.'' అని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. ''నిజానికి షిమోగాలోని కూడలి శృంగేరి మఠాధిపతి, నర్సీపూర్‌లోని శ్రీ సోసలే వ్యాసరాజ మఠాధిపతి ప్రభుత్వం తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని చాలా రోజులుగా కోరుతున్నారు. కానీ చట్టప్రకారం అలా చేసేందుకు వీలు లేకపోయింది. దక్షిణ కన్నడకు చెందిన ఉప్పినగుడి గ్రామంలో వున్న సహస్ర లింగేశ్వర స్వామి దేవస్థాన పై అప్పటి జెడియస్-బిజెపి ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు అంతిమ తీర్పు వెలువరించే ముందు యీ విషయాలపై రాష్ట్రప్రభుత్వం వైఖరి తెల్పాలంటోంది. అందుకే యీ బిల్లు త్వరగా పాస్ చేయవలసి వచ్చింది.'' అని న్యాయశాఖ మంత్రి జవాబిస్తున్నాడు. మఠానికి చెందిన ఒక్క భక్తుడు ఫిర్యాదు యిచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చనే షరతు పెట్టడంతో ప్రభుత్వం ఉద్దేశంపై అనుమానాలు అలుముకున్నాయి.
బిల్లుకు వ్యతిరేకంగా 400 మంది మతపెద్దలు కలబరిగిలో సమావేశమై సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా తొలగించమని సోనియాను కలిసి కోరడానికి నిశ్చయించుకున్నారు. గోవధ నిషేధంపై 1964 నాటి బిల్లుకు గత బిజెపి ప్రభుత్వం వధ్యయోగ్యమైన జంతువుల వయసు పెంచుతూ, శిక్షలు పెంచుతూ మార్పులు చేసింది. అయితే దేశాధ్యకక్షుడు ఆ మార్పులకు ఆమోదముద్ర వేయలేదు. అందువలన బిజెపి చేసిన బిల్లులను సిద్ధరామయ్య ఉపసంహరించుకున్నారు. ఇదంతా మైనారిటీలను, వెనకబడిన కులాలను బుజ్జగించడానికే అని బిజెపి ఆరోపిస్తోంది. హిందూత్వం పేర ఓట్లు సమీకరిస్తున్న బిజెపిని అడ్డుకోవడానికి సిద్ధరామయ్య యిలాటి చిట్కాలు ప్రయోగిస్తున్న మాట వాస్తవమే. కర్ణాటక బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ అని పెట్టి వెనకబడిన కులాల సామాజిక స్థితిగతులు, విద్యలపై సమాచారం సేకరించమని గత ప్రభుత్వం ఆదేశిస్తే సిద్ధరామయ్య దాని పరిధిని మరింత పెంచారు. ఉపకులాలు, సంప్రదాయ వృత్తులు చేసే వారు, వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలవబడే ఒకే కులాల వివరాలు, మతం మారిన వాళ్ల విషయంలో మారకముందు వారి కులమేదో కనుక్కోవడం యిలాటి పనులన్నీ అప్పచెప్పి దాని బజెట్‌ను రూ.117 కోట్లకు పెంచారు. ఎందుకిదంతా అంటే సమాజంలో భిన్నకులాల సంఖ్య, పరిస్థితి తెలిస్తే దానికి తగినట్టుగా బజెట్ కేటాయింపులు చేయవచ్చు కాబట్టి అంటున్నాడాయన. ఉపకులాలను కూడా లెక్కలోకి తీసుకోవడం ప్రారంభిస్తే తమ జనాభా నిష్పత్తి తగ్గిపోయి, తమ పట్టు తగ్గిపోతుందని లింగాయతులు, ఒక్కళిగలు భయపడుతున్నారు. సిద్ధరామయ్యను హిందూ వ్యతిరేకి అంటున్నారు. కాదని చూపుకోవడానికి అతను 34,266 దేవాలయాల్లో పూజారుల జీతాలను పెంచాడు. అంతేకాదు ఏటా రూ. 25 లక్షల ఆదాయాన్ని మించి గడిస్తున్న 41 ఎ క్లాస్ ఆలయాల నిర్వహణకు బిజెపి నియమించిన కమిటీలను రద్దు చేశాడు కూడా. ఇప్పుడీ బిల్లుకు వ్యతిరేకంగా సొంత పార్టీలోని అగ్రకులాల నాయకులు కూడా ఉద్యమించడంతో వచ్చే అసెంబ్లీ సెషన్స్‌లో యీ బిల్లును ఉపసంహరించుకుంటామని చెపుతున్నాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)