‘గోపాల గోపాల’ టాల్‌స్టాయ్‌ రాసిందా?

సినిమాలంటే కథలే. కథల్ని, అల్లే వారు అల్లుతారు కొనే వారు కొంటారు కొట్టే వారు కొడతారు. ఎలా తెస్తానేం? తెర మీద చూసిన ప్రేక్షకుడికి ఆ రెండున్నర (పోనీ మూడు) గంటలసేపూ కొత్తగా అనిపించాలి.…

సినిమాలంటే కథలే. కథల్ని, అల్లే వారు అల్లుతారు కొనే వారు కొంటారు కొట్టే వారు కొడతారు. ఎలా తెస్తానేం? తెర మీద చూసిన ప్రేక్షకుడికి ఆ రెండున్నర (పోనీ మూడు) గంటలసేపూ కొత్తగా అనిపించాలి.

ఒక్క సారి థియేటర్‌ నుంచి బయిటకు వచ్చాక, ఈ కథ  ఎక్కడో ‘విన్న’ట్టుందే..అనో, ‘కన్న’ట్టుందే.. అనో అనుకుంటే అనుకోవచ్చు. దాని ప్రభావం ఆ సినిమా మార్కెట్టు మీద పడదు. జనం వస్తూనే వుంటారు. ఈ మధ్య సినిమాకు ‘దేవుడు’ తాకిడి ఎక్కువయ్యింది. భగవంతుడికీ భక్తుడికీ మధ్య.. ఉంటే ‘దర్బార్‌ అగర్‌ బత్తి’ వుండవచ్చు కానీ, దళారీలెందుకన్నది ఓ ప్రశ్న. చటుక్కున ‘బాబా’లనో, ‘మత ప్రచారకుల’నో ఇలా ‘దేవుడి ఏజెంట్లని’ అనేస్తే ఎలా? కానీ అనేస్తున్నారు. వినేస్తున్నారు. అలాంటి సినిమాలను పిల్లా, పాపలతో కలిపి చూసేస్తున్నారు. హిట్లు కూడా అయిపోతున్నాయి. ఓహో ‘బాబా’ ‘బాబా’ బ్లాక్‌ షీప్‌` అంటే ఇదా అర్థం? అని కాన్వెంటు పిల్లలు కొత్త భాష్యాలు నేర్చుకుంటున్నారు. 

ఇలా రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి బాలీవుడ్‌నీ, టాలీవుడ్‌ని కలిపి కుదిపేస్తే, ఇంకొకటి బాలీవుడ్‌లో ఒక ఊపు ఊపి, టాలీ వుడ్‌లో టాపు లేపింది. మొదటిది రాజ్‌కుమార్‌ హిరాణీ తీసిన ‘పీకే’ ఇంకొకటి కిషోర్‌ కుమార్‌ పార్ద సాని తీసిన ‘గోపాల గోపాల’. ఈ రెండూ సంచలనాలనీ, వివాదాలనీ ఏక కాలంలో లేపాయి. వివిధ మతాల పెద్దలు నొచ్చుకున్నారు. అన్ని మతాల ‘మధ్యవర్తుల్నీ’ కలిపి విమర్శించినా, తమ‘బాబా’లను కాస్త ఎక్కువ విమర్శించారని, ఆరెస్సెస్‌, భజరంగ్‌ దళ్‌, విహెచ్‌పీ కార్యకర్తలు అంతే ఎక్కువగా విరుచుకు పడ్డారు. 

‘పీకే’ కథను ఎక్కడనుంచి ‘పీక్కొని’ వచ్చారన్నది పక్కన పెడితే. ‘గోపాల గోపాల’ అన్నది అధికారికంగా ‘ఓ మై గాడ్‌’ (ఓఎంజీ) బాలీవుడ్‌ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. పీకేలో ఎలా అగ్ర తార్‌ అమీర్‌ ఖాన్‌ ప్రధాన భూమిక పోషించారో, ‘గోపాల గోపాల’లోఏకంగా ఇద్దరు పెద్ద హీరోలు పవన్‌ కళ్యాళ్‌, వెంకటేశ్‌లు  ప్రధాన పాత్ర పోషించారు. 

‘దేవుడు’ అనే భావనే ఎరుగని గ్రహాంతర వాసి, భూ గ్రహంలోని భారత దేశం మీద అడుగు పెడితే, అతడికి ఇక్కడ ‘దేవుడు’ పరిచయమయిన విధానాన్ని హాస్య, వ్యంగ్య ధోరణిలో చిత్ర కథను అల్లుతారు. ‘దేవుడి’తో తాము స్వయంగా మాట్లాడుతున్నామన్న వారంతా, అబధ్ధమాడుతున్నారని(రాంగ్‌ నెంబర్‌)కి ఫోన్‌ చేస్తున్నారని తేలుస్తాడు. ఆ సినిమాలో ‘దేవుడు’ ఎప్పటికీ దొరకడు. ఇదీ ‘పీకే’ కథ.

కానీ, ‘గోపాల గోపాల’ లో సాక్షాత్తూ దేవుడే దిగివస్తాడు. తానున్నానని నిరూపించి మరీ వెళ్తాడు. ఇంక భక్తులకు తగాదా ఏముంది? సమస్యంతా ఇక్కడే వుంది. భగవంతుణ్ణి పలువురు పలుపేర్లతో పిలుస్తారు పలురకాలుగా ఊహించుకుంటారు. కానీ భగవంతుడొక్కడే.  బాబాలూ, విగ్రహాలూ, ఇవన్నీ అ బధ్ధమని ఈ చిత్రం తేలుస్తుంది. అంతే భగవంతుడెక్కడుంటాడో ఈ చిత్రం అడ్రసు కూడా ఇస్తుంది. ప్రతీ మనిషిలో భగవంతుడుంటాడు` అని చెబుతుంది. ఈ సారాన్ని ఎప్పుడూ ఎవరో ఒకరు చెబుతునే వున్నారు.  కానీ దీనిని కథగా మలిచిన తీరు ఆసక్తి కరంగా వుంటుంది. భగవంతుడు మతబోధకుడికీ, భక్తుడికీ కాకుండా నాస్తికుడికి దర్శనమిస్తాడు. ఇది కూడా కొత్త కాదు. నాస్తికుడే తనను (భగవంతుణ్ని) ఆదరించి పంపిచాడని భగవంతుడే ఆనక సెలవిస్తాడు.

ఈ కథను మాత్రం లియో టాల్‌స్టాయ్‌ ‘లవ్‌ ఈజ్‌, వేర్‌ గాడ్‌ ఈజ్‌’ (భగవంతుడెక్కడ వుంటాడో, ప్రేమ అక్కడ వుంటుంది) అని రాస్తాడు. మతబోధకుడి మాటలతో విసిగి వేసారిన చెప్పులు కుట్టుకునే వాడికి కలలో భగవంతుడు కనిపించి, తాను ఆ మరుసటి రోజు ఇంటి వస్తానని చెబుతాడు. అతను ఆ రోజంతా ఎదురు చూసినా భగవంతుడు రాడు. కానీ మళ్ళీ కలలో వచ్చి, తాను వచ్చానని చెబుతాడు భగవంతుడు. ‘నేను( వృధ్ధుడిలాగా) చలితో వచ్చాను, నువ్వు దుప్పటి కప్పావు, నేను (బాలింతలాగా) అకలితో వచ్చాను. నువ్వు అన్నం పెట్టావు. నేను (పసివాడిలా )పండు కోసం వచ్చాను, నువ్వు కొని ఇచ్చావు.’ అ తర్వాత భక్తుడు మేల్కొంటాడు. తనకీ భగవంతుడికీ మధ్య ఓ మధ్యవర్తి (మతబోధకుడు) అవసరం లేదని ఆ మధ్యవర్తికే చెప్పేస్తాడు.

అంటే, ‘గోపాల.. గోపాల’ అనబడే  ‘ఓఎంజీ’ కథకు మూలం ఎప్పుడో రాసిన ‘టాల్‌స్టాయ్‌ కథే’. ఇలా అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ‘అయామ్‌ శామ్‌’ అనే ఇంగ్లీషు సినిమా , తెలుగు,తమిళాల్లో ’నాన్న’ అవుతుంది. ఇంగ్లీషులో ‘ప్యాచ్‌ ఆడమ్స్‌’ , హిందీలో ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ అయి, తెలుగులో ‘శంకర్‌ దాదా, ఎంబీబీఎస్‌’ అవుతుంది. ఇలాంటి వాటికి హక్కులు కొనాలా? అసలు హక్కుదారులెవ్వరు? ఇవి ఎప్పటికీ తెగని ప్రశ్నలే!

-సతీష్ చందర్