Advertisement

Advertisement


Home > Articles - Chanakya

కెసిఆర్ కు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక

కెసిఆర్ కు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక

కెసిఆర్ వైఖరి ఇఫ్పుడు ఆయనను ఇరకాటంలో పడేస్తోంది. అన్నిసార్లు తమ మాటే నెగ్గదనే విషయానికి ఉదాహరణగా నిలుస్తోంది. జంటనగరాల జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు నిర్మాణం సందిగ్ధంలో పడింది. ఎల్ టి సంస్థ ప్రభుత్వ సహకారం పై కినిసి చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది అంత సులువుగా వెనక్కు వెళ్లగలిగిన ప్రాజెక్టు కాదు ఇరు వర్గాలకు కూడా. కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందక, నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని, అందువల్ల, తమ వల్ల కాదని, ఎల్ అండ్ టీ సంస్థ స్పష్టం చేసేసింది. దీంతో ఇప్పుడు బంతి కెసిఆర్ కోర్టులోకి వచ్చి పడింది. అలా అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మొండికేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రానున్నవి కార్పొరేషన్ ఎన్నికలు. ప్రజల మనోభావాలపై మెట్రో చాలా కీలక ప్రభావం కనబరుస్తుంది. మెట్రొ ఆగిందంటే, తెరాస, దాని దోస్త్ మజ్లిస్ కు నగరంలో అధికారం కల్ల.

నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కెసిఆర్ మెట్రోపై మండి పడుతూనే వున్నారు. చాలా మంది చిన్న వ్యాపారుల పొట్ట కొట్టారని, దీన్ని అంగీకరించమని అంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక, మెట్రో ను కొంత వరకు సొరంగమార్గంలోకి మార్చాలని చూస్తున్నారన్న వార్తలు వినవచ్చాయి. అయితే అంతలోనే అన్నీ సర్దుబాటు అయిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఎన్నికలే కారణమా

మెట్రొపై కెసిఆర్ తాత్సారం చేయడానికి నగర ఎన్నికలే కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు మెట్రోను బలంవంతగా ముందుకు తీసుకుపోతే, తెరాస మాట తప్పినట్లు అవుతుంది. అందువల్ల కాస్త నాన్చి, ఆపై ఎన్నికలు అయ్యాక, మళ్లీ ముందుకు పోతే ప్రజలు మరేమీ చేయలేరన్నది వ్యూహాగా కనిపిస్తోంది. మరో అయిదేళ్ల నాటికి మెట్రొ పూర్తి అయిపోతుంటది కాబట్టి, జనం సమాధానపడతారని ఆయన భావన. అయితే వేలాది కోట్లు పెట్టుబడి పెట్టిన ఎల్ అండ్ టి సంస్థకు ఆరేడు నెలల సమయం అంటే అంత తక్కువ కాదు. ఆర్థికంగా నష్టం సంగతి అలా వుంచి, రికార్డు సమయంలో పూర్తి చేయలేకపోయిన అపప్రధ చుట్టుకుంటుంది. అది దాని భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఇలాంటి రాజకీయ వ్యవహారాలు సరిపడని ఎల్ అండ్ టి సంస్థ తొందరపడుతోంది. పైగా ఇది పూర్తి చేసి పట్టాలు ఎక్కిస్తే కానీ, ఆదాయం ప్రారంభం కాదు. మరిన్ని మెట్రో ప్రాజెక్టులు ఎల్ అండ్ టి ముందు వున్నాయి.  వాటన్నింటికి నిధులు కావాలి అంటే రన్నింగ్ లో వున్న ప్రాజెక్టులు పూర్తి కావాలి

కింకర్తవ్యం?

ఇప్పుడు ఎల్ అండ్ టి లేఖ బహిరంగం అయిపోయింది. మరి కెసిఆర్ ఏం చేస్తారు. ఎల్  అండ్ టి పై కోపం వచ్చినా కూడా ప్రజల కోసం సముదాయించుకోక తప్పదు. లేదంటే ప్రజలు గమనిస్తారని, గుర్తిస్తారని, ఆపై గుర్తుంచుకుంటారని ఆయనకు తెలియంది కాదు. పోనీ పంతానికి పోయి, పోతే పొండి మా మెట్రో మేమే కట్టుకుంటాం అందా మన్నా, ముందు ఎల్ అండ్ టి కి పెట్టుబడి వెనక్కు ఇవ్వాలి. పైగా ఇందులో కేంద్రం జోక్యం కూడా వుంది. గతంలో ఒకసారి కేంద్రం కెసిఆర్ ప్రభుత్వానికి ఈ విషయంలో తలంటిందని వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి మరొసారి పునరావృతం అవుతుంది. ఇప్పుడు కేంద్రాన్ని కాదంటే, ఇక రాష్ట్రానికి పథకాలు సరిగ్గా అందడం అనుమానాస్పదమవుతుంది. ఇప్పటికే పలు విషయాల్లో ఆయన తనకు తెలియకుండానే కేంద్రానికి దూరం అవుతున్నారు. టీవీ9 ఎబిఎన్ విషయాల్లో కేంద్రం నెమ్మదిగా చెప్పి చూసినా ఫలితం లేకపోయింది. 

ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చంద్రబాబు వ్యవహార శైలిపై మాట్లాడడం, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కరెంటు సమస్యపై తమ దగ్గరకు రాలేదని అనడం వంటివి ఇక్కడ గమనించాలి. అవసరం మనదైనపుడు ముందు అడుగు వేయక తప్పదు. అసలే ఇప్పుడు చంద్రబాబుతొ పోటీ వ్యవహారం. ఢిల్లీ నుంచి పనులు సాధించుకోవడంలో బాబు ముందున్నారు. హీరో సంస్థ కోసం తెలంగాణ, ఆంధ్ర పోటీ పడితే, అది వెళ్లి చిత్తూరులొ కూర్చుంది. ఇలా ప్రతి చోటా కెసిఆర్ వెనుక అయితే ఇప్పటికి వచ్చిన డ్యామేజీ ఏమీ లేదు కాని, అయిదేళ్ల తరువాత కష్టమవుతుంది. ఎల్లప్పడు జనం లోకల్ జపానికి లొంగరని కెసిఆర్ గమనించాలి. ఏదేమైనా  ఈ పరిస్థితుల్లో  కెసిఆర్ రాజీకి వచ్చి, మెట్రోను ఏదో విధంగా ముందుకు నడిపించుకోక తప్పదు. లేదంటే ఆయన కు అధికారంలోకి వచ్చిన తరువాత తొలి అతి పెద్ద బ్యాడ్ రిమార్క్ పడిపోతుంది.

చాణక్య

writerchanakya@gmail,com

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?