Advertisement

Advertisement


Home > Articles - Chanakya

‘పవర్‌’ డీల్‌ రూ.500 కోట్లు!!

‘పవర్‌’ డీల్‌ రూ.500 కోట్లు!!

పవర్‌ స్టార్‌... నో డౌట్‌ యువతరంలో ఒక తారకమంత్రం!

పవన్‌కల్యాణ్‌... నో డౌట్‌ యువతను ప్రేరేపించగల సూత్రం!!

అందుకే... ‘రాజకీయాల గురించి తన అభిప్రాయాలు చెబుతారు’ అనే ప్రెస్‌నోట్‌ రాగానే.. రాష్ట్ర ప్రజానీకం అంతా.. ఆయన పార్టీ పెట్టబోతున్నారని ఆశగా చర్చించుకుంటోంది. పవన్‌ పెట్టబోయే పార్టీ నవతరం రాజకీయాలకు ఒక చుక్కాని కాగలదేమో అని ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. ‘పవనిజం’ అనే ఒక భావజాలం.. సమాజాన్ని సమ్మోహితం చేసి.. పాజిటివ్‌ దిశగా పురోగమనం వైపు నడిపించగలదని కోరుకుంటున్నారు!

మరి ఈ ‘పవర్‌ డీల్‌’ సంగతేంటి? పవన్‌కల్యాణ్‌ పార్టీ ఆలోచన వెనుక కీలకమైన సూత్రధారిగా తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నదన్న ప్రచారం బాగా హల్‌చల్‌ చేస్తోంది. సీమాంధ్రలో ప్రస్తుతం ముక్కోణపు పోటీ ఉంది. అయితే పవన్‌ ప్రభంజనం ఒకటి- కులం కార్డు, రెండు- యువత కార్డు.. కోణాల్లోంచి.. తాము తలపడబోతున్న రెండు  ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌లకు పడగల ఓట్లను చీలుస్తుందని.. తెదేపా కుట్రగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆలోచనతోనే.. ‘‘బాబ్బాబూ ఈ నాలుగునెలలూ రాజకీయ తెరపై నటించవా.. 500 కోట్ల రెమ్యూనరేషన్‌ ముట్టజెప్పుకుంటాం’’ అంటూ తెదేపా డీల్‌ కుదుర్చుకున్నట్లు పుకారు షికారు చేస్తోంది. అధికారం దక్కుతుందంటే ఇవాళ అది పెద్ద మొత్తం కాదు... అలాగే ఆస్తులు అమ్ముకుంటున్న హీరోకు నాలుగు నెలల కాల్షీట్లకు ఈ మొత్తం తోసిపుచ్చగలిగేది కూడా కాదు. ఇలా పుకార్లకు లింకులు అన్నీ ఎంచక్కా సింక్‌ అవుతున్నాయి...!!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. రాజకీయ రంగంలో ఒక ప్రభంజన సదృశమైన కొత్త పార్టీగా అడుగుపెట్టడానికి.. తెలుగుదేశం పార్టీతో డీల్‌ సెట్‌ చేసుకుని.. అంతిమంగా ఆ పార్టీకి లబ్ధి చేకూరేలాగా పావులు కదపబోతున్నాడని.. ఆర్థిక లబ్ధి ఒక్కటే దీనికి మూలం అని రాజకీయ, సినీ వర్గాల్లో విచ్చలవిడిగా పుకార్లు చెలరేగుతున్న మాట నిజం. 

అదే సమయంలో- పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వం గురించి ఎరిగిన వారు, ఆయన వ్యవహార సరళిని, ముక్కుసూటి తనాన్ని, ఆయన ఆచరించే నైతిక విలువలను, సమాజం పట్ల ఆయన కనబరిచే నిబద్ధతను గురించి ఎరిగిన వారు మాత్రం.. ఈ పుకార్లను ఎంత మాత్రమూ నమ్మడం లేదన్నది.. అంతకంటె పరమ నిజం. 

ఈ ‘నిజం’-‘పరమనిజం’ మధ్య జరుగుతున్న దోబూచులాట ఏమిటి? పవన్‌ చుట్టూ పుకార్లు ఎందుకు ముసురుకుంటున్నాయి? ఈ కారు మేఘాలు విడిపోయేదెలాగ? ఇంతకూ పవన్‌ పార్టీ పెడితే ఏం జరగబోతోంది...? అనేదే ఈ వారం ‘గ్రేటాంధ్ర’ విశ్లేషణ.

కొత్తా దేవుడండీ...

అదిగో పార్టీ..ఇదిగో ప్రకటన..అల్లదిగో పేరు..ప్యాకేజీలు, పిలుపులు, తాయిలాలు.. బుజ్జగింపులు.. అంచనాలు.. సర్వేలు.. ఆనందాలు.. అనుకోని అవాంతరాలు.. ఇలా ఎన్నని.. ఎన్ని కబుర్లు మోసుకువస్తుంది.. ఎన్నికల కాలం. ఇంతటి సందడి మరెప్పుడైనా వుంటుందా? రాజకీయ నాయకులు నోళ్లు తెరుచుకుని మైకుల ముందు ఇంతలా విరుచుకుపడిపోవడం మరెప్పుడైనా కనిపిస్తుందా.. సీజన్‌తో సంబంధం లేకుండా, అన్ని వ్యాపారాలు జోరందుకునే ఇలాంటి తరుణం అస్తమానం వస్తుందా.. వీటన్నింటిని మించిన సరదా.. వీటన్నింటిని మించిన హడావుడి.. వీటన్నింటిని మించిన ఆనందం మరోకటి వుందా? 

వుందా అంటే వుందనే చెప్పాలి. అదే ఈ వ్యవహారాలన్నింటికి మూలమైన అధికారం. దీనితస్సదియ్య.. అంత గొప్పది ప్రపంచంలో మరొకటి లేదు కదా.. జనాన్ని శాసించవచ్చు.. శాసనాలను తోసిరాజనవచ్చు.. కోట్లు గడించవచ్చు.. భూములు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, ఇలా ఒకటేమిటి.. ఎన్నో... ఒకతరం, రెండు తరాలేమిటి? మరో నాలుగైదు తరాలు కూర్చుని తిన్నా తరగనంత కూడేయచ్చు.. అందుకేగా ఈ యావ అంతా.. అందుకేగా ఈ కబుర్లన్నీ.. అందుకేగా ఈ మాయ మంత్రాలన్నీ.. అందుకేగా ఈ కులాల కుంపట్లు రాజేయడాలు.. అందుకేగా ఈ ప్రాంతాల నెగళ్లు రగిలించడాలు.. అధికారం అందకపోతే రాజకీయవేత్తలు ఆక్సిజన్‌ అందనంతగా బాధపడతారు. అధికారం అందడం కోసం ఏం చేయాలా అని అహరహం ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి ఈ ఆలోచనల్లోంచి పుట్టుకువచ్చేవే కొత్త పార్టీలు. జాతీయ స్థాయిలో కోత్త పార్టీలు రావడం అన్నది చాలా అరుదైన సంగతి. ప్రాంతీయ స్థాయిలో పార్టీలు పుట్టడం అన్నది అరిగిపోయిన సంగతి. కానీ పుట్టిన పార్టీలు మొగ్గతొడగి, పూలుపూసి, వికసించడం అన్నది చాలా.. చాలా.. అసాధ్యమైన సంగతి.

తెలుగునాట గడచిన అయిదు దశాబ్ధాల కాలంలో కాలానికి నిలిచిన ఒకే ఒక పార్టీ తెలుగుదేశం. నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అంతే కాదు. దేశంలోనే కాంగ్రెస్‌ వ్యతిరేకత అనే అజెండాను జెండాగా చేసుకుని, అలుపు లేకుండా భుజంపై మోస్తున్న పార్టీ తెలుగుదేశం. పైగా కాంగ్రెస్‌కు ఎదురుగా నిల్చుని, సవాల్‌ విసిరి, పార్టీ పెట్టి, ఆపై తొకముడిచి, అందులోనే విలీనం చేయడం అన్నది తెలుగునాట అనేకసార్లు అనుభవమైన సంగతి. 

అంటే ప్రాంతీయ పార్టీ పెట్టడం, దాన్ని నడపడం, కాంగ్రెస్‌లో విలీనం కాకుండా కాసుకోవడం అన్నది అరుదైన విద్య. దాన్ని అందరూ సాధన చేయలేరు. సాధించలేరు అన్నది చిరకాలంగా రుజువవుతున్న సంగతి. ఈ తరానికి గుర్తున్నంతవరకు, ఈ జనరేషన్‌కు గుర్తుచేయాల్సినంత వరకు చూస్తే, రెడ్డి కాంగ్రెస్‌ నుంచి  చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి మీదుగా, చిరంజీవి ప్రజారాజ్యం వరకు ఎన్ని ఉదాహరణలో.

అసలు పార్టీలు ఎందుకు పుడతాయి? పార్టీల పుట్టుకకు సాధారణంగా ఒకటి  కన్నా ఎక్కువ కారణాలుండవు ఏదైనా పార్టీలో వుంటూ, తనకు కావాల్సిన స్థానం అందకపోవడం. తమకంటూ పూర్తి స్థాయి అధికారాలు సాధించాలనుకోవడం. ఈ కారణానికి కవర్‌ పేజీలా ఏదో ప్రాంత అభ్యున్నతి లేదా మరేదో ఆశయసాధన అన్న కారణం. స్వాతంత్య్రోద్యమకాలం ఇందుకు మినహాయింపు.

కొత్తపార్టీలు వస్తున్నాయ్‌

ఇప్పుడు ఇదే విధమైన కారణాలు కావచ్చు. మరో విధమైన కవరింగ్‌ కార్యక్రమాలు కావచ్చు. తెలుగునాట రెండు కొత్త పార్టీలు పురుడుపోసుకునే అవకాశం కనిపిస్తోంది. 

ఒకటి ఇప్పటికే ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ.

రెండవది.. ఇదిగో అదిగో అంటున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించబోయే పార్టీ.

ఈ రెండు పార్టీలు ఎందుకు పుడుతున్నాయ్‌.. ఏం సాధించాలనుకుంటున్నాయ్‌..

కిరణ్‌ కుమార్‌ రెడ్డి గడచిన ఆరేడు నెలల కాలంగా రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానంతో పోరాడుతూ వస్తున్నారు. ఈ పోరుబాటలో ఆయన విజయం సాధించలేకపోయారు. అలా అని రాజీపడి కాంగ్రెస్‌లో వుండలేకపోయారు. ఇప్పుడు స్వంత కుంపటి వెలిగించుకునేందుకు సిద్ధమైపోయారు. అయితే ఈ పార్టీ ఎందుకోసం అని అడిగితే కిరణ్‌ కుమార్‌ రెడ్డి దగ్గర సరైన సమాధానం వుంటుందా అంటే అనుమానమే. 

ఆయన అసలు సిసలు కోరిక సమైక్యాంధ్ర. అంది ఇంక ఎలాగూ సాధ్యం కాదు. పోనీ సీమాంద్ర అభివృద్ధి అనుకుందాం. అది కొత్త పార్టీ పెట్టే సాధించాల్సినంత అసాధ్యమైన పని కాదు. కాంగ్రెస్‌లో వున్నపుడే, సమైక్యం కాకపోతే, ఇవన్నా ఇవ్వండి అని అడిగి వుండొచ్చు. లేదా అదే కండిషన్‌పై భారతీయ జనతా పార్టీలోనో, లేదా మరే ఇతర పార్టీలనూ చేరవచ్చు. వైకాపా, తేదేపా, ఇలా చాలా వుండనే వున్నాయి. పోనీ అన్ని పార్టీల సమైక్యానికి వ్యతిరేకం అనుకుంటే, వైకాపా సమైక్యం స్టాండ్‌ తీసుకునే వుంది కదా. ఇన్ని ఆప్షన్లు వదులుకుని, ఆయన సొంత పార్టీ ఎందుకు పెట్టాలి. అంటే ఆయా పార్టీ నేతలతో ఆయనకు పొసగకపోయి వుండోచ్చు. లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి, మరొకరు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించే పార్టీలో చేరడం అంటే ఎంత నామర్దా అని అనుకుని వుండొచ్చు. అంతకన్నా ఇప్పుడు కిరణ్‌ కొత్త పార్టీ పెట్టడానికి అద్భుతమైన, ఊహాతీతమైన కారణాలైతే మానవ మాత్రులకు తట్టడం లేదు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటిస్తూ కిరణ్‌ చేసిన ప్రసంగం అంతా నిన్నటివరకు ఆయన పదే పదే చెప్పిన సమైక్య సాధన సంగతులే. దాన్ని వ్యతిరేకించేవారిని ఎండగట్టిన వైనాలే. అంతేకానీ ఈ ఆశయసాధన కోసం ఈ పార్టీ ఆయన చెప్పలేదు. ఆవిష్కరణ సభలో చెబుతారన్న ఆశాలేదు. ఇక ఆత్మగౌరవ నినాదమా.. అది చాలా చాలా అవుట్‌ డేటెడ్‌.

నిజానికి గతంలో ఇలా ఆశయసాధనతో పెట్టిన చాలా పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయాయి. దానికి తాజా ఉదాహరణ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ సామాజిక న్యాయమే ధ్యేయం అంటూ ఆయన నినదించి, చివరకు సాధించినదేమిటో అందరికీ తెలుసు. 

పవన్‌ సంగతేమిటి? 

ఇక అత్యంత సంచలనం నమోదు చేస్తుందని భావిస్తున్న పార్టీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రారంభిస్తాడని చెబుతున్న కొత్త దుకాణం.

దీనిపై పుట్టుకొచ్చినన్ని రూమర్లు ఇటీవలి కాలంలో మరే విషయంలోనూ పుట్టలేదేమో?

కొన్నాళ్ల క్రితం టీవీ9 రవికిషోర్‌, ఈనాడు రామోజీరావు కలిసి పవన్‌ కళ్యాణ్‌ చేత పార్టీ పెట్టిస్తున్నారన్న వదంతులు ప్రారంభమయ్యాయి. పవన్‌ - రామోజీల నడుమ చర్చలు జరిగాయని వార్తలు పుట్టుకొచ్చాయి.

ఆ తరువాత లేదు.. లేదు. పవన్‌ తెలుగుదేశంలో చేరతాడని వార్తలు వెలువడ్డాయి. ఆ మేరకు  ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. అంతలోనే లేదంటూ ఖండనలు వెలువడ్డాయి.

ఢిల్లీలో అమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించన వెంటనే, పవన్‌ ఆ పార్టీలో చేరుతున్నట్లు మళ్లీ గ్యాసిప్‌లు ప్రారంభమయ్యాయి. 

అంతలోనే పవన్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని లోక్‌సత్తా ముందుగా బండెక్కి కూసింది. 

ఇవేవీ కాదు, చంద్రబాబే తన కుడి ఎడమలైన పారిశ్రామిక వేత్తలతో వందల కోట్ల ప్యాకేజీ ఇచ్చి పవన్‌ చేత పార్టీ పెట్టిస్తున్నాడని మరో వదంతి గుప్పుమంది. 

ఇక్కడ ఒక కీలకమైన సంగతి గమనించాలి.. పవన్‌ పార్టీ పెట్టడం అన్న ప్రతి వదంతిలోనూ తెలుగుదేశం పార్టీతోనో, దాన్ని కొమ్ముకాసే వారితోనో లింక్‌ కావడం.

అంటే పవన్‌ పార్టీ పెట్టడం లేదా పెట్టించడం అన్నది తెలుగుదేశం పార్టీకి అనుకూలిస్తుందని ఎవరైనా భావిస్తున్నారా?  లేదా అటువంటి భావన కారణంగా ఇటువంటి వదంతులు పుడుతున్నాయా? అసలు పవన్‌ పార్టీ పెట్టడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఎందుకు ప్లస్‌ అవుతుంది? అసలు పవన్‌ ఎందుకు పార్టీ పెడుతున్నట్లు? ఇది సరైన సమయమేనా? అసలు మరో పార్టీ అవసరం ఈ రాష్ట్రంలో ఏ మేరకు? 

ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని వెదికేందుకు ముందు రెండు సంగతులు చూడాలి.

ఒకటి పవన్‌ కళ్యాణ్‌.. అతగాడి చరిష్మా.. ఆశయాలు, సాధించగలిగిన స్థిరత్వం వగైరా.

రెండవది పవన్‌ పార్టీ పెట్టడం అన్నది జగన్‌ సారథ్యంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఏ మేరకు హాని చేస్తుంది? ఎలా?

పవన్‌ కళ్యాణ్‌కు అపరిమితమైన చరిష్మా వుంది. అది కాదనలేని సత్యం. యువతరం పవన్‌ పేరు చెబితే ఊగిపోతుంది. ఆ చరిష్మా చిరంజీవి క్యాంప్‌లో మరెవరికి లేదు. కానీ చిరంజీవి రాజకీయంగా విఫలమైనా ఇప్పటికే అదే స్థాయి ఇమేజ్‌ నిలబెట్టుకునే వున్నాడు. అది కూడా కాదనలేనివాస్తవం. పవన్‌ పార్టీపెడతాడని తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి అభిమానులు పవన్‌పై ఓ లెక్కలో విరుచుకు పడుతున్న వైనం చూస్తే ఇది అర్థమవుతుంది.

సరే, చరిష్మా మంచి చెడ్డలు పక్కన పెట్టి, పవన్‌ వ్యవహారాలు పరిశీలిస్తే, చాలా ఆవేశపరుడని గతంలోని అనేకానేక సంఘటనలు రుజువుచేసాయి. చిరంజీవి ఇంట్లో శుభకార్యం సందర్భంగా మీడియాతో ఘర్షణ, ఆపై నడిరోడ్లపై షో, డిసి ఆపీసు ఎదుట బైటాయింపు వగైరా.. మళ్లీ చిరంజీవి కుమార్తె ప్రేమ వివాహం సందర్భంగా తన తుపాకి హాండోవర్‌ చేసిన సంఘటన. ఆ హడావుడి. అందుకు దారితీసిన చిరంజీవి కుమార్తె వ్యక్తం చేసిన భయాందోళన.

ఇక చిరంజీవి పార్టీ పెట్టాక, పవన్‌ ఆవేశపూరిత ప్రసంగాలు. అప్పటికప్పుడు రెండో పెళ్లిని చట్టబద్దం చేయడం. అంతకు మించి అప్పటికప్పుడు తన సొమ్ము మొత్తాన్ని కేటాయిస్తూ, ఓ స్వచ్చంధ సంస్థకు రూపకల్పన చేయడం.

ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో, తన సినిమా విడుదలకు ముందే పైరసీ కావడానికి కారణమైన వారి తాట తీస్తా అంటూ హూంకరించడం.

ఈ సంఘటనలు కాకుండా పవన్‌ - పరిటాల రవి వ్యవహారానికి సంబంధించి వదంతులు వున్నాయి. నిజానిజాలు తెలియవు.

పై సంఘనటలను విశ్లేషిస్తే, ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. పవన్‌కు ఆవేశం ఎక్కువ- కంటిన్యూటీ తక్కువ అని. 

రెండవ భార్య విషయంలో ఆవేశంగా చట్టబద్దం చేసాడు. ఆ తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు. విడాకులు ఇచ్చాడో.. భరణమే ఇచ్చాడో మొత్తానికి ఏదో జరిగింది.

కాంగ్రెస్‌ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలన్న కార్యక్రమం, ప్రజారాజ్యాన్ని జనం అటకెక్కించినపుడే ఆగిపోయింది.

స్వచ్చంద సంస్థ ఏమయిందో, దానికి కేటాయించిన సొమ్ము ఏమయిందో ఎవరికీ తెలియదు. 

పైరసీ ఎవరు చేసారో, ఎవరి తాట తీయాలనుకున్నాడో, ఎందుకు తీయలేదో అసలే తెలియదు. 

ఇక పవన్‌కు ఉన్నంత బద్ధకం ఎవరికీ వుండదని టాక్‌ వుండనే వుంది. ఆయన సినిమాలు ఆలస్యం అవడానికి అదో రీజన్‌ అంటారు. ఆయన తనకు మూడ్‌ వున్నపుడే షూటింగ్‌ కు వస్తారని, లేదంటే, హాయిగా తన తోటలో పుస్తకాలు చదువుతూనో, లేదా తోటపని చేస్తూనో గడిపేస్తారని అంటారు. పైగా వీలనంత తక్కువ మాట్లాడతారు. బాగా సెన్సిటివ్‌ అంటారు. కానీ మాటకు ప్రాణం ఇస్తారని, మాటపై నిలబడతారనీ కూడా అంటారు.

చిత్రమేమిటంటే ఈ లక్షణాలేవీ రాజకీయాలకు అస్సలు పనికిరావు. పవన్‌కు వున్న మంచి లక్షణమైన మాటకు ప్రాణం ఇవ్వడం, సున్నిత స్వభావంతో సహా. 

మరి పవన్‌ తానెందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు? తన వీక్‌ నెస్‌ తనకు తెలియకుండా వుండదు కదా?

అయితే ఇంతవరకు వినవచ్చిన వదంతుల ప్రకారం తెరవెనుక శక్తులు పనిచేసి వుండాలి. 

లేదా, పవన్‌ తనకు అలవాటైన ఆకస్మిక స్పందనతో వర్తమాన రాజకీయాలను చూసి, అసహ్యించుకుని, తాను ఏదైనా చేయాలన్న ఆవేశానికి లోనై వుండాలి. 

ఇప్పుడు ఈ  రెండు సంగతులు చూడాల్సి వుంది.

ఒకటి తెరవెనుక శక్తుల కృషి

ఈసారి ఎన్నికలు ఇటు తెలుగుదేశం అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లకు చావు బతుకుల సమస్యగా మారాయన్నది వాస్తవం. ఇన్నాళ్లు తెరవెనుక ముసుగేసుకుని వున్న కులాలన్నీ ఇప్పడు ముసుగులు తీసేయడమే కాక, నగ్నంగా తెరముందే నృత్యం చేస్తున్న సంగతీ కళ్లముందే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ విడిపోవడంతో, సీమాంధ్రలోని రెడ్టి, కమ్మ కులాలు ఈ మిగిలిన ప్రాంతంపై తమ ఆధిపత్యం సంపాదించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఇలాంటి సమయంలో జనంలో అంతో ఇంతో ఊపు సాధించుకున్న జగన్‌ మోహన్‌ రెడ్డిని దెబ్బతీయాలంటే రెండు మార్గాలు,. ఒకటి ఆయన సామాజిక వర్గమైన రెడ్లలో చీలిక తీసుకురావడం. రెండవది సంప్రదాయంగా ఎప్పుడూ ఒక విధంగా ఓటు చేయని సీమాంధ్రలోని బలమైన ఓటు బ్యాంకు అయిన కాపు, తెలగ, బలిజ, వగైరా ఓట్లు అటు పోకుండా చూడడం. 

ఇప్పుడు ఈ లక్ష్య సాధన దిశగా తెలుగుదేశం పార్టీ, దాని మద్దతుదారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఎప్పుడూ రెడ్లు ఒక వైపునే బలంగా కొమ్ము కాసిన దాఖలాలు లేవు. రెడ్డి కాంగ్రెస్‌ వున్నప్పటి వ్యవహారాలతో సహా. అలా అయితే చంద్రబాబు నాయుడు పదేపదే రేవంత్‌ రెడ్డిని ముందుకు నెట్టి జగన్‌పై బాణాలు వేయించే అవకాశమే వుండదు. ఇప్పుడు ఇంత మంది రెడ్డి కులస్థులు తాజగా చంద్రబాబు నాయుడి వెంట నడవడానికి నిర్ణయించుకుని గోడ దూకరు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పార్టీ పెట్టకుండా జగన్‌ పంచన చేరి వుండేవారు. ఆ విధంగా రెడ్డి సామాజికవర్గంలో వున్న అనైక్యత చాలా వరకు కలిసి వచ్చింది. పైగా తెలుగుదేశం లెక్కల ప్రకారం సీమాంధ్రలో రెడ్ల ఓట్ల శాతం మూడు మాత్రమే. కమ్మ వారి ఓట్ల శాతం ఆరు కావడం గమనార్హం. జగన్‌ చెంత కమ్మవారెవరు లేరు.. పైగా ఇప్పడిప్పుడే సీమాంధ్రలో భాజపాను రెండోకమ్మ పార్టీగా మార్చే దిశగా వెంకయ్య నాయుడు తన కృషి ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇక మిగిలింది సుమారు 21శాతం ఓట్లతో పటిష్టంగా వున్న కాపు సామాజికవర్గం. అటు రాయలసీమలో బలిజలైతేనేమి, ఇటు దక్షిణ కోస్తాలో కాపు, తెలగలైతేనేమి, అటు ఉత్తర కోస్తాలో తూర్పు కాపులైతేనేమి? మొత్తానికి బలమైన ఓటు బ్యాంకు. పైగా ఇక్కడో తకరారు వుంది. చిరకాలంగా కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి, కాపులకు చుక్కెదురు. గతంలో రంగా హత్య అనంతరం జరిగిన అల్లర్లు, విజయవాడ ఈనాడు కార్యాలయంపై దాడి వగైరా వ్యవహారాలన్నీ ఇంకా చాలా మంది మరిచిపోలేదు. రాధా, రంగా హత్యలు, ఆపై జరిగిన వ్యవహారాలు అన్నీ కమ్మ-కాపు ఆధిపత్య పోరు ఫలితాలే అని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి పరిస్థితుల్లో వారిని విస్మరించి రాష్ట్రంలో అధికారం సాధించలేమని చంద్రబాబు అండ్‌ కో కు తెలుసు. అందుకే అనుకోకుండా చిన్న ప్రయోగం ఒకటి చేసారు. ఉపఎన్నికల్లో పగోజి, తూగో జిల్లాల్లో కాపు అభ్యర్థులకు కమ్మసామాజిక వర్గం తెరవెనుక మద్దతు ప్రకటించింది. ఇద్దరు అభ్యర్థులు గెలిచారు. ఇదేదో బాగుంది అనిపించింది. 

అప్పుడు పుట్టుకొచ్చిందీ వ్యూహం. కాపులను సైన్యంగా పెట్టకుని, తాము సేనాధిపతులమైతే బాగుంటుందని. దాంతో గతంలో ఎవరైతే తమకు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్‌ లేదని, చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వలసపోయారో, వారందరికి బంగరు భవిష్యత్‌ను హామీగా ఇచ్చి, వెనక్కు రప్పించే కార్యక్రమం మొదలైంది. అయినా కూడా, ఇంకా అనుమానం. యువత ఏదో పిచ్చి, వెర్రి అభిమానంతోనో, మరెందుకో జగన్‌ వెంట వెళ్తారని చిన్న భయం. దానికి బ్రేకెలా వేయాలి. అందుకే పవన్‌ను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటికే పవన్‌ రాజకీయాల గురించి చర్చిస్తున్నాడని, ఆలోచిస్తున్నాడని ఉప్పందింది. ఇది గతంలో ప్రజారాజ్యం మాదిరగా ఎక్కడ పుట్టి ముంచుతుందో అని అతగాడిని దగ్గరకు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికీ అవి ఆగిపోలేదు. జరుగుతున్నాయనే వినికిడి. ఈ కారణంగానే పుట్టుకొచ్చినవే పవన్‌ పార్టీ వెనుక వున్న వదంతులన్నీ. 

సరే తెరవెనుక వ్యవహారాలు ఇలా వుంటే, పవన్‌ ఆవేశాన్ని కూడా చూడాలి. పవన్‌ అనే వాడు విపరీతంగా చదువుతాడు.. సమాజాన్ని తన కళ్లతో చూస్తాడు. ఆవేశపడతాడు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో అమ్‌ ఆద్మీ వ్యవహారం. మోడీ చరిష్మా చూసి ఆవేశ పడీ వుండొచ్చు. ఇప్పుడు కొత్త పార్టీ కాకున్నా, ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించాలనీ అనుకోవచ్చు. తప్పేమీ కాదు. కానీ ఎవరికి ముప్పు? అటు బాబుగా, ఇటు జగన్‌ కా? అసలు కాపు సామాజిక వర్గ ఓట్ల సంఖ్య సంగతి అలా వుంచితే, జనం ఇంకా సినిమా స్టార్లను చూసి ఓటేసే పరిస్థితిలోనే వున్నారా? ఈ వైనాలు కూడా పరిశీలించాలి. 

పవన్‌ పార్టీ పెట్టినంత మాత్రాన కాపు ఓట్లు గుత్తగా పడిపోతాయనుకోవడం భ్రమ. ఈ వైనం చిరంజీవి ప్రజారాజ్యం సమయంలోనే స్పష్టమయింది. తాను పుట్టిన గడ్డమీదే చిరంజీవి ఓటమి పాలయ్యారు. అనకాపల్లిలో ఇద్దరు వెలమలు (నూకారపు, సబ్బం హరి) పోటీ చేస్తే ఒక్కడైన కాపు అభ్యర్థి అరవింద్‌ ఓటమి పాలయ్యారు. అంటే కాపు ఓట్లు ఏ ఒక్క పార్టీనో గుత్తగా తీసుకుపోయే పరిస్థితి లేదు. అంతకన్నా క్లారిటీ అయిన సంగతి మరోటుంది. కేవలం ఓ కులం ఓట్లతో విజయం సాధించడం అన్నది ఏ పార్టీకి కూడా అసాధ్యమని. అదే సాధ్యమయి వుంటే చిరంజీవి ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానంలో వుండి వుండాల్సింది. 

ఇక సినిమా స్టార్ల వైనం. ఇది ఎన్టీఆర్‌ టైమ్‌లోనే బయటపడింది. అంతటి మాస్‌ ఇమేజ్‌ వున్న నటుడే మూడు చోట్ల పోటీ చేస్తే, జనం ఓ చోట ఓడించి పంపారు. రోజా పరిస్థితి ఏమిటి? రాజమండ్రి నుంచి పోటీ చేసిన కృష్ణంరాజు సంగతేమిటి? ఇలా చాలా చాలా ఉదాహరణలున్నాయి. అంటే కేవలం సినిమా చరిష్మా ఒక్కటే విజయానికి సరిపోదు.

అంటే అటు కులబలం, ఇటు సినిమా చరిష్మా ఏవీ ఒక్కటిగా విజయాన్ని సాదించి పెట్టలేవు. ఇంకా ఏదో కావాలి.. ఇంకేదో కావాలి. 

జనాల  మనసుకు నచ్చాలి.. వారి అభిమానాన్ని గెలవాలి.. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. వీటికి అప్పుడు కులాల బలాలు, సినిమా చరిష్మాలు తోడవుతాయి. పైగా ఆంధ్రదేశ్‌ జనం భలే చిత్రమైన వారు. చాలా చాలా సార్వత్రిక ఎన్నికల్లో ‘సర్వే’శ్వరుల అంచనాలకు అందని తీర్పునిచ్చారు. ఒకసారి నెత్తిన పెట్టుకున్నవారనే నమ్మకం లేక పక్కన పెట్టారు. మీడియా అంతా ఓక్కటే, దాడి చేసినా వైఎస్‌ను నెత్తిన పెట్టుకున్నారు. 

ఒకసారి జనం విశ్వాసం కోల్పోతే మళ్లీ సాధించడం అంత సులువుకాదు. కానీ ఈ సంగతి తెలియకే ఎత్తుగడలు వేస్తుంటారు. కొత్త పార్టీలు పెడుతుంటారు. కొత్త దేవుళ్లు పుడుతుంటారు.

జనం మాత్రం లోకల్‌.. పర్మనెంట్‌.. వారు ఇక్కడే వుంటారు. తమ తీర్పు చెర్నాకోలతో నాయకుల కలల ఎత్తుగడలను చిత్తుచేస్తుంటారు. 

ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఇంకోటుంది. అసలు ఇంకో ప్రాంతీయపార్టీ అవసరం ఇప్పుడు ఇక్కడ వుందా?

కాంగ్రెస్‌ అధికారంలో వుండగా జగన్‌ మోహన్‌ రెడ్టి పార్టీ పెట్టడమే అనవసరం. కేవలం తనకు వారసత్వ అధికారం అందివ్వలేదని పార్టీ పెట్టారు తప్ప, మరో పరమావధి లేదన్నది కఠోరవాస్తవం. సరే ఇంతలో విభజన వచ్చింది.. వైకాపా పార్టీ సమైక్యం వైపు నిల్చుంది కాబట్టి,. ఆ విధంగా ఆ పార్టీ పుట్టుకకు ఓ అర్థం ఏర్పడింది.  ఇక తెలుగుదేశం పార్టీ బరిలో వుండనేవుంది. ముఫై ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ను ఢీకొని, పదేళ్లకు పైగా ప్రతిపక్షంలో వుండి కూడా బతకగలిగిన పార్టీ. తిరిగి జవసత్వాలు పుంజుకుని, పోరుకు సిద్ధమైన పార్టీ. జాతీయస్థాయిలో మార్పునకు ఆలంబనగా కనిపిస్తున్న మోడీని ప్రధాని అభ్యర్థిగా తలకెత్తుకున్న భాజపా వుండనే వుంది. సరే గోదాలో నేనూ వున్నానంటూ వున్న కమ్యూనిస్టులు, లోక్‌సత్తా, ఇలాంటివి చాలా వున్నాయి. పార్టీలకు అమ్మమ్మ లాంటి కాంగ్రెస్‌ వుండనే వుంది. 

మరి ఇన్ని వుండగా కిరణ్‌ పార్టీ, పవన్‌ పార్టీ ఇంకా అవసరమా? అంటే అవసరమే అని ఎవరైనా అనొచ్చు. బరిలో వున్న పార్టీలకు భిన్నమైన లేదా అవి తలకెత్తుకోని అజెండా వుంటే, అప్పుడు కచ్చితంగా అవసరమే అని అందరూ అనొచ్చు. కిరణ్‌ కుమార్‌ పార్టీ ఆత్మగౌరవ నినాదం తలకెత్తకుంది. అది తెలుగుదేశం పార్టీ నినాదం. కాదనే దెవరు? దాని కోసమైతే కిరణ్‌ హాయిగా తెలుగుదేశంలో చేరి, దాంతో కలిసి కృషి చేయచ్చుగా? అలాగే పవన్‌ భిన్నమైన దారి ఏదని వెదుకుతారు. ప్రశ్నించు అన్నది పవన్‌ నినాదం అని ఓ వదంతి. అమ్‌ ఆద్మీ చెబుతున్నది అదేగా. 

పైగా ఇప్పటికిప్పుడు సీమాంధ్ర వాసులు కొత్త పార్టీ కోసం చూస్తున్న దాఖలాలు ఏమీ లేవు. అయితే మరోసారి బాబుకు చాన్సిచ్చి చూద్దామనో, లేదా జగన్‌కు ఇస్తే ఎలా వుంటుందో అనో ఆలోచిస్తన్నారు. మోడీ వస్తే బాగుంటుందని భావిస్తున్నవారున్నారు. ఇవన్నీ వివిధ సర్వేలు చెబుతున్న నిజాలు. అంతే కానీ ఏ సర్వేలో కూడా ఓ కొత్త పార్టీ కావాలని కానీ, ఓ కొత్త దేవుడు రావాలని కానీ వెల్లడి కాలేదు?

మరెందుకు ఈ కొత్తదేవుడు కొత్త కొలువు పెట్టడం. ఆ సంగతి తేల్చాల్సింది జనం. పోలింగ్‌కు వెళ్లినపుడు..వేచి వుండక తప్పదు కదా.

- చాణక్య

[email protected]

Click Here For This Week Tabloid

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?