Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

శెభాష్ హరీష్: శషబిషలు లేకుండా తేల్చేశారు!

శెభాష్ హరీష్: శషబిషలు లేకుండా తేల్చేశారు!

కేంద్రం పిలిచి అడగగానే మొహమాటంతో వంకర్లు తిరిగిపోవడం, తమకు కావాల్సిందేమిటో స్పష్టత లేకుండా.. ‘అంతా మీ ఇష్టం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం.. వారేదో ముష్టి విదిలిస్తే ఆ తర్వాత అసంతృప్తికి గురికావడం, దాన్ని పూడ్చుకోవడానికి జీవితపర్యంతమూ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడం.. ఇలాంటి చాటుమాటు రాజకీయ వ్యవహార సరళి అస్సలు కనిపించలేదు.

అభిప్రాయాలు చెప్పమని అడిగినప్పుడే.. సత్సంబంధాలూ, సంయమనమూ, సానుకూల దృక్పథంతో రాష్ట్రప్రయోజనాలను సాధించుకోవడమూ.. లాంటి పడికట్టు మాటల మాయాజాలం లేకుండా.. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెగేసి చెప్పేశారు. తమ ఇబ్బందులు ఏమిటో, ఏం చేస్తే కేంద్రం ఆలోచనకు తాము ఓకే చెప్పగలమో ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నదుల అనుసంధానం మీద దృష్టి పెడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నదుల్ని అనుసంధానించడం గురించి ప్రతిపాదనలు నడుస్తున్నాయి. మహానది- గోదావరి- కావేరీ నదుల్ని అనుసంధానించాలనేది ప్రతిపాదన. అందులో భాగంగా తెలంగాణలోని అకినేపల్లి వద్ద ఓ ప్రాజెక్టు నిర్మాణం అవసరం అవుతుంది.

20టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. అదే జరిగితే గనుక... దాదాపు 35 వేల ఎకరాల భూమి, 45 గ్రామాలు, కాలువల కింద మరో 12 వేల ఎకరాల భూమి మునిగిపోతాయి. ఒకవైపు తెలంగాణ ఇంతటి త్యాగానికి సిద్ధపడినా కూడా.. ఈ నధుల అనుసంధానం వల్ల ఈ రాష్ట్రానికి ఒరుగుతున్న ప్రయోజనం ఏమిటి అనేది స్పష్టత లేదు.

ఇలాంటి నేపథ్యంలో.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించే లేదా ద్వితీయ ప్రాధాన్యంగా భావించే ఎలాంటి ప్రతిపాదనకు కూడా తాము అంగీకరించేది లేదని దాదాపుగా తెగేసి చెప్పేశారు. తెలంగాణకు కీలకం అయిన మహానది- గోదావరి నదుల అనుసంధానాన్ని సెకండ్ ప్రయారిటీగా భావించేలా కేంద్రం తయారుచేసిన ప్రతిపాదనకు ఆయన మాటలు బ్రేకులేసినట్టే.

ముందు మహానది-గోదావరి అనుసంధానం పూర్తిచేసి, తెలంగాణకు గోదావరి ద్వారా లభించగల మొత్తం నీటి లభ్యత లెక్కలు తేల్చిన తర్వాత.. మిగిలిన విషయాలు ఆలోచిద్దాం అంటూ హరీష్ రావు శషబిషలు లేకుండా చెప్పేశారు. దీంతో రాష్ట్రాలు అంగీకరించే దాకా ఒక రకం మౌఖిక హామీలతో మురిపించి, ఆ తర్వాత మొహం చాటేసే కేంద్రం వైఖరికి చెంపపెట్టులా అయింది.

ఏ రాష్ట్రానికి అభ్యంతరాలు లేకుండా.. అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్తాం.. వంటి జనాంతికమైన మాటలతో కేంద్రం ఈ సమావేశాన్ని ముగించింది. ఇదే సమావేశానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం అధికారులు మాత్రమే హాజరు కాగా, వారు కూడా పెదవి విప్పకపోవడం, అదే సమయంలో హరీష్ రావు.. సాధికారికమైన వాదనతో.. తెలంగాణ రాష్ట్ర అవసరాల్ని, ప్రయోజనాల్ని విస్మరించడం తగదంటూ కేంద్రం ముందు ప్రకటించడం అభినందనలకు నోచుకుంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?