Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - Kapilamuni

లవ్‌లెటర్‌ 2 పవన్‌: వ్యాపారం చేస్తే తప్పేంటి?

లవ్‌లెటర్‌ 2 పవన్‌: వ్యాపారం చేస్తే తప్పేంటి?

బాబూ పవన్‌కల్యాణ్‌..

నీలోని ఆవేశం చూస్తోంటే చాలా ముచ్చటేస్తోందమ్మా! పసిపిల్లలు గనుక.. చాక్లెట్‌ ఇవ్వకుంటే అలిగి నేను ఇంట్లోంచి వెళ్లిపోతా అంటూ మారాం చేస్తారే. నువ్వు పార్టీ పెట్టడంలో కూడా అంతటి అమాయకత్వం, అవివేకం కనిపిస్తున్నాయి. పార్టీ పెట్టావు సరే.. ఎన్నికల్లో పోటీచేయను అన్నావు. అక్కడినుంచి ఎంత తక్కువగా మాట్లాడుతూ ఉంటే అంత పరువుగా ఉండేది. సినిమా బాగుంటే తప్ప నీ సినిమాలను సైతం ఒక దశాబ్దం పాటూ... నీకోసం గంగవెర్రులెత్తుతున్నారని నువ్వు అనుకుంటున్న ఇదే జనం ఛీకొట్టారనే సంగతి నువ్వు మరచిపోయినట్లున్నావ్‌. ఒక దశాబ్దం పాటూ నీ చిత్రాలకు ఓపెనింగ్‌ డే కలెక్షనే తప్ప.. రెండో వారం పోస్టరు పడకుండా బాక్సులు వెనక్కు వచ్చేశాయనే వాస్తవాల్ని నువ్వు విస్మరించినట్లున్నావు! ఇప్పుడేదో రెండు సినిమాలు భారీ హిట్‌లు కొట్టేసరికి అది సినిమాలో సత్తా కాదని నీ సత్తా మాత్రమేనని భ్రమల్లో బతుకుతున్నట్లున్నావు! పోన్లెద్దూ ముందే అనుకున్నాం కదా.. పసిపిల్లల అమాయకత్వంలా నిన్ను చూస్తే ముచ్చటేస్తున్నదని!!

ఇంతకూ ఏంటమ్మా పవనూ! హరీష్‌రావు గురించి ఏదో నిష్టుర సత్యాలను నిప్పులా వెలుగులోకి తేదలచుకున్నట్లున్నావేమిటి? హరీష్‌రావు.. బొత్స సత్యనారాయణతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడని సెలవిచ్చావు. బాగానే ఉంది. దరిమిలా.. దమ్ముంటే నిరూపించమని ఆయన నీకు నోటీసులు కూడా పంపాడు. ఆ లీగల్‌ గొడవేదో అనుభవించు. ఆ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు పాయింటుకు వద్దాం.

ఏంటిబాబూ.. పవనూ! పార్టీ స్థాపించిన రోజు నువ్వు ఏం అన్నావ్‌. రెండు ప్రాంతాల్లోని ప్రజలు ఒకరిని ఒకరు ద్వేషించుకునే పరిస్థితిని ఈ విభజన ద్వారా కల్పించారు.. అని సెలవిచ్చావు. గాద్గదిక స్వరంతో ఆ విషయాన్ని వెల్లడిరచి.. దాదాపు కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్నంత పనిచేశావ్‌. మనోడు బాగాన ఎమోషన్‌ వర్కవుట్‌ చేశాడే అనిపించింది... ఆ రోజు నిన్ను చూసి! ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి జీవించే పరిస్థితిని సృష్టిస్తానని ఆరోజు తెగ డాంబికంగా పలికావ్‌! సర్లే ఏదో అమాయకత్వంలో ఆశపడుతున్నాళ్లే అనిపించింది.

అవునుగానీ ఇంతకూ నువ్వు ప్రవచించిన సదరు ప్రజల మధ్య విద్వేషాలు ఎక్కడున్నాయ్‌. తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా సెటిలర్లు ఇప్పటికీ ఇదివరకటి లాగానే బతుకుతున్నారు. రాష్ట్రం భౌతికంగా విడిపోయిది అని అందరూ ట్యూన్‌ అయ్యారు. తదనుగుణంగా ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. ఇక నువ్వు కొత్తగా చూస్తున్న విద్వేషాలు ఎక్కడున్నాయో.. నువ్వొచ్చి ఉద్దరించడానికి ఖాళీ ఎక్కడున్నాదో తోచడం లేదు. మరో సంగతేంటంటే.. నువ్వు రెండు ప్రాంతాల వాళ్లూ కలిసి మెలిసి జీవించే పరిస్థితి కల్పిస్తా అన్నావు. 

మరి నువ్వు ఆరోపించిన ప్రకారం.. హరీష్‌రావు` బొత్స సత్యనారాయణ కలిసి వ్యాపారం చేసుకుంటే.. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీ కలల ప్రకారం ఆ రెండు ప్రాంతాల ప్రజలు (నాయకులు) కలిసే బతుకుతున్నారు కదా! మరి వేదికల మీద విలపిస్తావ్‌ ఎందుకు? నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం... (అబద్ధం అయితే నీ పాపాన నువ్వుపోతావ్‌.. కోర్టులో) హరీష్‌రావు, బొత్స వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన కలిసి ఒక వ్యాపారం చేయకూడదా? మరి మీ అన్న వేరే పార్టీల్లో చెలరేగుతున్నాడే.. ఆయనతో తమ్ముడి బంధాన్ని తెంచుకుంటూ.. గెజిట్‌లో ఓ ప్రకటన చేసుకోకపోయావా? అసలు నీ ఆక్రోశం, ఆవేదన, ఆలోచన ఏమిటో అర్థం కావడంలేదు. 

బొత్స సత్యనారాయణ డబ్బులకు  బినామీగా వ్యవహరించే వ్యక్తి డబ్బులు పెట్టుబడి పెడితే.. కోట్లకు కోట్ల రూపాయలు పుచ్చుకుని నువ్వు సినిమాల్లో నటించలేదా? మద్దలచెర్వు సూరి, భాను సదరు హత్యోదంతాలతో ప్రమేయం ఉన్న ముష్కరమూకలు దందాలు చేసిన సొమ్ములు పుచ్చుకుని నువ్వు వారి బినామీలు తీసిన సినిమాల్లో హీరోగా నటించలేదా? రౌడీలు, అవినీతి పరుల, గూండాల, హంతకుల డబ్బులు పుచ్చుకుని.. కూలికి నటించి.. సినిమాలు చేసి.. వారి డబ్బును ఇబ్బడిముబ్బడిగా పెంచడానికి నటించింది నువ్వు. నీకు రెమ్యునరేషన్‌గా నువ్వు నిర్ణయించుకున్న కోట్ల కొద్దీ డబ్బు వస్తే చాలు.. అది అవినీతిలోంచి వచ్చిందా? అశుద్ధంలోంచి వచ్చిందా? అనే వెరపు లేకుండా అందినంత పుచ్చుకుని.. తెలిసీ ఫ్లాప్‌ సినిమాలు చేశావు. మరి వేర్వేరు పార్టీల నాయకులు కలిసి చేసుకునే వ్యాపారాల గురించి మాట్లాడడానికి నీకేం నైతిక హక్కు ఉంది. 

బాబూ పవనూ! ఇవాళ చేతిలో మోడీ చిడతలు ఉన్నాయి కదాని.. ఆయన స్తోత్రాలు పాడుకుంటూ.. ఆయన భజన గీతాలు పాడుకోవడం వరకు ఓకే! అంతే తప్ప.. ఏదో డెప్త్‌ ఉన్న రాజనీతిజ్ఞుడిలాగా బిల్డప్పులు ఇవ్వాలనుకుంటే.. మరింతగా అభాసు పాలైపోతావు. ఈ ఎన్నికల్లో పోటీచేయను అని నువ్వు ప్రారంభించిన జనసేన.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి దిక్కూదివాణం లేకుండాపోయినా ఆశ్చర్యం లేదు. 

కూసింత ముందూ వెనుకా చూసుకుని.. తర్కం విచక్షణ బుర్రలో ఉంచుకుని మాట్లాడు. నోటికి ఏదివస్తే అది మాట్లాడుతూ పోతే.. పరువు పలచన అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. 

-ప్రేమతో

కపిలముని

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?