Advertisement

Advertisement


Home > Articles - MBS

బాపు గురించి బాలు - 02

బాపు గురించి బాలు - 02

బాపుగారి గురించి ప్రఖ్యాత గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ''హాసం'' పత్రికలో ''బాపు విశ్వరూపం'' శీర్షిక క్రింద 2002 లో వ్రాసిన వ్యాసపరంపర. బాలుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో పునర్ముద్రణ...

'సాక్షి' సినిమా పోస్టర్స్‌ చూసాక  నిజంగానే దిగ్భ్రాంతి చెందాను. అప్పుడు నాకు భరణి అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పోస్టర్‌ ఆర్టిస్టు. ఎన్నో ప్రక్రియలు చేసి పోస్టర్‌ పబ్లిసిటీలో గొప్ప గొప్ప ఛేంజస్‌ తీసుకొచ్చాడు ఆ రోజుల్లో. నేను తమిళ సినిమాల్లో ప్రవేశం కావడానికి అతనే ముఖ్యమైన కారణం... అది వేరే కథ. 'బాపుగారి పోస్టర్స్‌ చూశావా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఇన్నాళ్ళూ ఆయన ఎందుకు మా డిపార్ట్‌మెంట్‌లోకి రాలేదో నాకు అర్థం కాలేదు' అని అన్నాడతను.

''సాక్షి'' సినిమా ఫైనాన్షియల్‌గా పెద్ద సక్సెస్‌ కాకపోయినా తెలుగు సినిమా విూద పిపాస ఉన్నవాళ్లందరూ కూడా చాలా అందమైన సినిమా అని... బాపుగారి బొమ్మంత అందమైన సినిమా అని గొప్పగా మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో పాడలేక పోయాననే దుగ్ధ ఉండేది నాకు. 

''సాక్షి'' సినిమా తర్వాత ఓ గమ్మత్తయిన సంఘటన... దర్శకుడిగా బాపుగారి రెండవ సినిమా ''బంగారు పిచ్చిక''... ఈ సినిమాలో చంద్రమోహన్‌ వేసిన వేషం నన్ను వెయ్యమని అడిగారు... ఆ రోజుల్లో నేను చాలా సన్నగా, అందంగా ఉండేవాణ్ణి. ఇప్పట్లోలా అందంగా మందంగా లేను. సరే... వాళ్లు అలా అడిగిన వెంటనే ఆకాశంలో ఎగురుతున్న పకక్షులు ఫ్రీజ్‌... సముద్రంలో ఎగసిన అల ఫ్రీజ్‌.. అడవిలో దూకుతూ పరుగెత్తే లేళ్లు ఫ్రీజ్‌... వింటున్న నేనూ ఫ్రీజ్‌...!

నేనేమిటి... వేషం వెయ్యటం ఏమిటి... అనుకుని భయపడి పారిపోయాను. ఈ తర్వాత కొన్నాళ్లకి పాటలయితే పాడతానండి అన్నాను. సరేనని ఆ సినిమాలో పాటలు నాతో పాడించారు... బాపు రమణలతో నా తొలి పరిచయం అలా మొదలయింది.

ఇలా నేను మెల్ల మెల్లగా కాలూనుకుంటూ నేపథ్య గాయకుణ్ణి అవుతున్న సందర్భంలో 1969లో ఒకసారి బాపుగారు రమణగారు  'నను పాలింపగ నడిచి వచ్చితివా' అన్నట్లు ఇద్దరూ రామలక్ష్మణుల లాగ  మా ఇంటికొచ్చారు. వరండాలో కూర్చున్నారు. వాళ్లు వచ్చారనగానే హడావిడిగా పడుతూ... లేస్తూ... కంగారు పడుతూ... సంతోషపడుతూ... ఎదురువెళ్లాను. అసలు వాళ్లు మా ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటూ - ముందు అతిథిమర్యాదలన్నీ అయిన తర్వాత 'ఏంటి విశేషం మాస్టారూ' అని అడిగాను.  'మేం ''అందాల రాముడు'' అనే ఓ సినిమా తీస్తున్నాం. ఘంటసాల గారు అనారోగ్యంతో ఉన్నారు. అందుకని విూచేత ఈ పాటలన్నీ పాడించాలి అనుకుంటున్నాం. కాని నాగేశ్వరరావుగారికి అంత  నమ్మకం లేదు - కొత్త కుర్రాడు కదా గాత్రం నప్పుతుందో లేదో నాకు అని ఆయన కొంచెం అనుమానాన్ని వ్యక్తీకరించారు. కాని మీరు పాడితే బాగుంటుందని మా అభిప్రాయం. విూరు ఏవిూ అనుకోనంటే మాకో వరం కావాలి' అని అడిగారు. 

నాకు దేవుళ్లలాంటి వాళ్లు వచ్చి నన్ను వరం అడగడం ఏంటి!? అనుకుని 'ఏంటి మాస్టారూ చెప్పండి' అన్నాను - ''మా ఆఫీసుకు వచ్చి ఆ పాటలు నేర్చుకుని ఒకసారి క్యాసెట్‌లో పుహళేంది హార్మోనియంతో వాయిస్తున్నప్పుడు పాడి ఇచ్చారంటే అది మేం నాగేశ్వరావుగారికి వినిపించి, ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడని ఆయన్ని ఒప్పించి విూచేత మా సినిమాలో పాడించుకోవాలన్నది మా కోరిక'' అన్నారు. ఇంతకన్న నాకు కావలసింది ఏముందసలు!? 

నిజంగా ఎంత సంబర పడ్డానో తెలియదు. మర్నాడే  వెళ్లిపోయి అన్ని పాటలూ నేర్చుకుని క్యాసెట్‌లో పాడి రికార్డ్‌ చేశాం.  అంతవరకూ యీ సంతోషంలో ఉన్న నేను రికార్డింగ్‌ ఎప్పుడని అడగలేదు వాళ్లని. ఎందుకంటే అప్పటికి నేను అంత బిజీ సింగర్‌ని కాదు.  రికార్డింగ్‌ ఎప్పుడు అని అడిగేంత ధైర్యం లేదు. సరే పాటలన్నీ మేము టేప్‌ చేసిన తర్వాత అప్పుడు అడిగాను బాపుగారిని, రికార్డింగ్‌ ఎప్పుడని. 'మేము ఫలానా తారీఖు నుంచి ఫలానా తారీఖు వరకూ ఒకటే షెడ్యూల్‌లో గోదావరి ఒడ్డున తీయాలనుకుంటున్నాం. అందుకని అన్ని పాటలూ ఒకేసారి రికార్డ్‌ చేసుకుని లొకేషన్‌కు వెళ్లాలనుకుంటున్నాం. ఫలానా తారీఖు నుంచి ఫలానా తారీఖు వరకూ రికార్డింగ్‌ ఉంటుంద'ని ఒక ఆరు రోజులో, ఏడు రోజులో చెప్పారు.  నా గుండెలో పెద్ద బండరాయి పడినంత బాధేసింది. కారణమేమిటంటే  సరిగ్గా నా మొట్టమొదటి ఫారిన్‌ ట్రిప్పు ఆ టైమ్‌లోనే ఉంది. నేను సింగపూర్‌, మలేషియాలో ఇరవై రోజుల పాటు పన్నెండు ప్రోగ్రామ్స్‌ నా బృందంతో వెళ్లి తమిళ కార్యక్రమాలు చేయడానికి అగ్రిమెంటు కుదుర్చుకుని సంతకం పెట్టి అడ్వాన్సు తీసుకున్నాను కూడా! 

బాపుగారి రమణగారి సినిమా... అందులో నాగేశ్వరావుగారికి పాడుతున్నాం... ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని మార్చుకోవడానికి వీలవుతుందా అని శతవిధాల ప్రయత్నించాను. రాజలింగం అని ఒకాయన ఉండేవాడు. చాలా పెద్ద పెద్ద రష్యన్‌ సర్కస్‌, జెమిని సర్కస్‌ (ఇక్కడున్న జెమిని కాదు. వాళ్లది ఇంటర్నేషనల్‌ ఫేమస్‌ సర్కస్‌) లాంటి కార్యక్రమాలతో బాటు కౌలాలంపూర్‌లో ఫ్యూజన్‌ ఆర్టిస్టులతోటి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేసే  వ్యక్తి... నేను అప్పుడప్పుడే గళం విప్పుతున్న రోజుల్లో తమిళ ప్రోగ్రామ్స్‌ కోసం నన్ను ఫారిన్‌ తీసుకెళ్తున్నాడు. అతన్ని ఎంత బ్రతిమిలాడినా 'నువ్వు అగ్రిమెంట్‌ సైన్‌ చేశావు. అడ్వాన్స్‌  ఇచ్చాను. థియేటర్లు అన్నీ బుక్‌చేసి పబ్లిసిటి కూడా ఇచ్చాను. నేను ఎలా మార్చుకోవాలి?' అని అన్నాడు అతను. ఈ విషయం బాపుగారికి రమణగారికి చెప్పాను. అవాక్కయ్యారు ... అంటే అప్పటికింకా టేప్‌ నాగేశ్వరరావుగారికి పంపించే అవకాశం రాలేదు... షెడ్యూల్‌ మార్చుకోవడానికి వీలులేదు. నాగేశ్వరరావుగారి డేట్స్‌తో  పని... మిగతా ఆర్టిస్టులందరూ కలిసి దాదాపు 30, 35 రోజుల్లో  సినిమా షూటింగ్‌ ఫినిష్‌ చెయ్యాలి. 

అలా నాకు ఆ అవకాశం చెయ్యి జారిపోయింది.  కాకపోతే తమ్ముడు రామకృష్ణకు మంచి అవకాశం వచ్చిందనుకోండి. అలా మొట్టమొదట ఆ ఇద్దరు దేవుళ్లూ వరాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చి... ఆ వరాలను నేను అందిపుచ్చుకోకుండా శాపగ్రస్తుణ్ణి అయిన సందర్భం అలా అయిపోయిందే అని బాధపడ్డాను. (సశేషం) 

- ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం 

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?