Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: డిక్సీ మిషన్‌ వీరులు హీరోలా? విలన్లా?

ఎమ్బీయస్‌: డిక్సీ మిషన్‌ వీరులు హీరోలా? విలన్లా?

ఏ దేశానికైనా సరే, విదేశాంగ విధానం చాలా సంక్లిష్టంగా వుంటుంది. కొన్ని కారణాల చేత కొంతకాలం కొన్ని దేశాలు దగ్గరవుతాయి, కొంతకాలం దూరమౌతాయి. ఉమ్మడి శత్రువుని ఓడించడానికి చేతులు కలుపుతాయి, ఒకరి రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాలను మరొకరు దెబ్బ తీస్తున్నారనుకుంటే కత్తులు దూస్తాయి. అమెరికా-చైనా సంబంధాల మధ్య అలాటి పిల్లిమొగ్గలు చాలానే వున్నాయి. ఇప్పుడు ట్రంప్‌ వచ్చాక సౌత్‌ చైనా సముద్రం గురించి, ఏక-చైనా గురించి గొడవలు వస్తే వారిద్దరి స్నేహం వికటించిందనుకోండి, ఒబామా హయాంలో చైనాతో స్నేహానికై ప్రయత్నించిన అధికారులపై ట్రంప్‌ ప్రభుత్వం శీతకన్ను వేయడం సహజం కదా! 1944లో 'డిక్సీ మిషన్‌' పేర జరిగిన దౌత్యప్రయత్నాన్ని అమెరికా, చైనా దేశాలు పరస్పర విరుద్ధమైన కోణాలలో చూడడం జరిగింది. వివరాలలోకి వెళ్లేముందు ఆనాటి చైనా రాజకీయ పరిస్థితిపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరం. 

1927లో హ్యునాన్‌ ప్రాంతంలో తిరుగుబాటు లేవదీసి కొమింటాంగ్‌ జాతీయ ప్రభుత్వాన్ని పాలిస్తున్న చాంగ్‌ కై షేక్‌ సైన్యం చేతిలో ఓడిపోయిన మావో జెడాంగ్‌ జియాంగ్సీ పర్వతాలకు వెళ్లి అక్కడ రాజ్యం ఏర్పరచుకుని 1931 నుండి 1934 వరకు పాలించాడు. తాననుకున్న సంస్కరణలు అమలు చేయసాగాడు. కమ్యూనిస్టు పార్టీ పాలనలో వున్న పది రాష్ట్రాలూ బాగా అభివృద్ధి చెందడం చాంగ్‌కై షేక్‌కు అలజడి పుట్టించింది. పదిలక్షల మంది సైన్యంతో వీరిపై దండెత్తాడు. మావో నాయకత్వంలో రెడ్‌ ఆర్మీ ఐదు యుద్ధాలు చేసింది. వాటిలో నాలుగింటిలో విజయం సాధించింది. అయినా మావోకు తన పార్టీలో చుక్కెదురైంది. కొమింటాంగ్‌ జాతీయనాయకత్వంతో ఈ దశలో కమ్యూనిస్టులు పోరాడటం తప్పని రష్యా భావించడంతో వారి విధేయులైన బోల్షివిక్‌లు మావోను ప్రధాన పదవుల నుండి తప్పించారు. అయినా చాంగ్‌ కై షేక్‌ తృప్తి పడలేదు. కమ్యూనిస్టులను మట్టుపెట్టేద్దామని ఉబలాట పడ్డాడు. మావో పరిపాలిస్తున్న జియాంగ్సీ రాష్ట్రాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు మావో ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని 'ఫీట్‌' చేశాడు. దేశం ఆగ్నేయచైనానుండి వాయువ్యచైనాకు అంటే దేశానికి ఐమూలగా 6 వేల మైళ్ల దూరం తన అనుచరులు లక్షమందితో అక్టోబరు 1934 నుండి అక్టోబరు 1935 వరకు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాడు. అన్ని ప్రాంతాలనుండి రైతులు మావో పక్షాన చేరారు. పాదయాత్ర పూర్తయేసరికి మావో టాప్‌ కమ్యూనిస్టు లీడర్‌గా ఉదయించాడు.

రెండవ ప్రపంచయుద్ధకాలంలో 1937లో జపాన్‌ చైనా ప్రాంతాలమీదకు దండెత్తింది. తీరప్రాంతాలు జపాన్‌ వశమయ్యాయి. చాంగ్‌ కై షేక్‌ రాజధాని మార్చవలసి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో చాంగ్‌ కమ్యూనిస్టుల సహకారం అర్థించాడు. జపాన్‌ ఆక్రమించిన ప్రాంతాల్లో మావో కమ్యూనిస్టు రెసిస్టెన్స్‌ ఉద్యమం నిర్వహించాడు. ప్రభుత్వం చేయలేని పని మావో చేసినందుకు ప్రజలకు అతనిపై అభిమానం పెరిగింది. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్‌ పెరల్‌ హార్బర్‌పై బాంబులు వేసి అమెరికాను యుద్ధంలోకి లాగింది. జపాన్‌ను యిటునుండి ఎదుర్కోవాలంటే చైనాయే తగినదని  అనుకున్న అమెరికా కొమింటాంగ్‌కు, మావో నేతృత్వంలోని కమ్యూనిస్టులకు ఆయుధాలు అందించింది. తను యుద్ధంలో దిగేటంత వరకూ రష్యా కూడా కమ్యూనిస్టులకు బోల్డు ఆయుధాలు యిచ్చింది. 

1944 వచ్చేసరికి అమెరికన్‌ ప్రభుత్వానికి సందేహం వచ్చింది. కొమింటాంగ్‌, కమ్యూనిస్టుల్లో ఎవరు ఎక్కువగా జపాన్‌ను ఎదిరిస్తున్నారు? ఎవరికి సాయం చేస్తే మంచిది అని. తేల్చుకోవడానికి వేసిన దౌత్యబృందమే 'డిక్సీ మిషన్‌'. వాళ్ల స్టేట్‌ డిపార్టుమెంటులో చైనా విభాగంలో ఉన్నతోద్యోగంలో పనిచేస్తున్న జాన్‌ స్టీవార్ట్‌ సర్వీస్‌ను, జాన్‌ కార్టర్‌ విన్సెంట్‌ను, జాన్‌ పాటన్‌ డేవిస్‌ను, మిలటరీ వ్యవహారాల్లో దిట్ట ఐన కల్నల్‌ డేవిడ్‌ బారెట్‌ను, యింకా మరి కొందర్ని కలిపి చైనాకు పంపి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయిద్దామనుకుంది. వీళ్లు వచ్చి కమ్యూనిస్టులను కలవడం చాంగ్‌కి సుతరామూ యిష్టం లేదు. ఏవేవో సాకులు చెప్పి ఆలస్యం చేశాడు. చివరకు అనుమతించాడు. వారు 1944 జులైలో చైనా వచ్చి మావోను, అతని ఆర్మీకి చీఫ్‌గా వున్న ఝూ డేను యానాన్‌ పట్టణంలో కలిశారు. కొమింటాంగ్‌ సైన్యం కంటె కమ్యూనిస్టులు చిత్తశుద్ధితో పోరాడుతున్నారని గమనించి, వాళ్లకు ఎక్కువ ఆయుధాలు యిస్తే మంచిదన్నారు. స్థానిక పరిస్థితులు అంచనా వేసి మావోకే ప్రజాబలం ఎక్కువగా వున్నందున, కమ్యూనిస్టు పాలిత ప్రాంతాల్లో పాలన మెరుగ్గా వుండడం చేత, అతన్నే సమర్థించాలని సిఫార్సు చేశారు. లేకపోతే అతను రష్యావైపు మళ్లిపోవచ్చని హెచ్చరించారు. 

కానీ యీ సిఫార్సును అమెరికా ప్రభుత్వ నేతలు పట్టించుకోలేదు. కొమింటాంగ్‌ను, కమ్యూనిస్టులను కలుపుదామని, ఆ కూటమిని జపాన్‌కు, రష్యాకు వ్యతిరేకంగా నిలుపుదామని విశ్వప్రయత్నం చేశారు. కానీ చాంగ్‌, మావోలకు ఒకరంటే మరొకరికి పడదు. అందువలన రాజీ కుదరలేదు. ఇంకో ఏడాది తిరిగేసరికి 1945 ఏప్రిల్‌, మేలలో ఇటలీ, జర్మనీ ఓడిపోయి యూరోప్‌లో  యుద్ధం ముగిసింది. ఆగస్టులో జపాన్‌లో అణుబాంబు వేయడంతో ఆసియాలోనూ యుద్ధం ముగిసింది. ఓడిపోయిన జపాన్‌ ఉత్తర కొరియానుండి, మంచూరియా నుండి తన సైన్యాన్ని వెనక్కి రప్పించింది. అప్పుడు రష్యా వాటిని ఆక్రమించి ఉత్తరచైనాను కమ్యూనిస్టు పార్టీ పరం చేసింది. ఇటు అమెరికా సహాయంతో కొమింటాంగ్‌ ప్రభుత్వం మధ్యచైనా, దక్షిణచైనా ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. 

ఇప్పుడు అమెరికా ప్రాధాన్యత మారిపోయింది. జపాన్‌ ఓడిపోయింది కాబట్టి యిక చైనాలో ఎవరికీ ఆయుధాలు యివ్వనక్కరలేదు. రష్యాకూడా గెలుపొందింది కాబట్టి చైనాలో కూడా కమ్యూనిస్టులు బలపడవచ్చు. దాన్ని నివారించాలంటే చాంగ్‌్‌ను దువ్వాలి. అతన్ని అడ్డుపెట్టుకుని అమెరికా చైనాను తన గుప్పిట్లోకి తెచ్చుకుందామనుకుంది. పనిలో పనిగా కమ్యూనిస్టులను కూడా దార్లో పెట్టుకోవాలి. నిన్నటిదాకా ఆయుధాలు యిచ్చి సహాయం చేసింది కాబట్టి చైనా కమ్యూనిస్టులు కూడా అమెరికా మాటకు విలువిచ్చారు. కమ్యూనిస్టులను, కొమింటాంగ్‌ను కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచాలని అమెరికా ప్రభుత్వం చాలా శ్రమించింది. కానీ చాంగ్‌ పడనివ్వలేదు. ఇటు మావో అమెరికా అడిగిన ప్రత్యేక వ్యాపార సదుపాయాలకు అంగీకరించలేదు. ఇక దానితో 1946 జులై నుండి కొమింటాంగ్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు స్థావరాలపై దాడి ప్రారంభించింది. అమెరికా దానికి వత్తాసు పలికింది. సోవియట్‌ రష్యా కమ్యూనిస్టులకు కొండంత అండగా నిలిచింది. డిక్సీ మిషన్‌ను 1947 మార్చిలో కట్టిపెట్టేశారు. 

యూరప్‌దేశాల తొత్తుగా మారడమే కాక, జపాన్‌ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన చాంగ్‌ను చైనా ప్రజలు అసహ్యించుకున్నారు. కమ్యూనిస్టులకు వత్తాసు పలికారు. అందువల్ల చాంగ్‌కు, మావోకు మధ్య మూడేళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో మావో గెలుపొందారు. 1949 అక్టోబరు 1 న 'పీపుల్స్‌ చైనా రిపబ్లిక్‌' ఏర్పరచారు మావో. చాంగ్‌ కై షేక్‌ ఫార్మోజా ద్వీపానికి పారిపోయి అక్కణ్నుంచి 'తనదే అసలైన చైనా ప్రభుత్వమ'ని చెప్పుకుంటూ బతికాడు. అమెరికా దాన్నే చైనాగా గుర్తించినంత కాలం గుర్తించి, చివరికి నిక్సన్‌ కాలంలో 1972 లో దాన్ని పక్కకు నెట్టేసి, మావో చైనానే అసలైన చైనాగా గుర్తించింది. ఇదీ మావో ప్రస్థానంలో అమెరికా ఆడిన దోబూచులాట. ఈ ఆటలో దెబ్బ తిన్నవారెవరంటే డిక్సీ మిషన్‌లో పనిచేసిన ప్రముఖులు. 

1944లో మావోతో చేతులు కలపమని సిఫార్సు చేసినందుకు గాను అమెరికాలో 1950ల నుంచి 1960ల వరకు నడిచిన మెక్‌కార్థీ శకంలో వాళ్లు చాలా బాధలు పడవలసి వచ్చింది. ఆ కాలంలో అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకత రాజ్యమేలింది. వామపక్షవాదులను, ఉదారవాదులను, స్వేచ్ఛకై పోరాడేవారిని, వేయేల ఆలోచనాపరులందరినీ కమ్యూనిస్టు సానుభూతి పరులని ముద్ర కొట్టి వారిని వేటాడింది. వారు అన్‌-అమెరికన్‌ (అమెరికా వ్యతిరేక) కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపించి శిక్షలు వేసింది. చాంగ్‌ కై షేక్‌ కన్నా మావో బలంగా వున్నాడని, అతను రష్యావైపు మళ్లకుండా మనమే ఆకట్టుకుంటే మంచిదని చెప్పినందుకు డిక్సీ మిషన్‌ అధికారుల మీద కమ్యూనిస్టు ముద్ర కొట్టి కాంగ్రెసు కమిటీల చేత విచారణకు గురి చేసింది. విచారణలో వారు కమ్యూనిస్టులు కాదని తేలినా, జాన్‌ సర్వీస్‌ను స్టేట్‌ డిపార్టుమెంటు నుంచి తొలగించింది. అతను కోర్టుకి వెళితే తీర్పు అతని పక్షంగా వచ్చింది. జాన్‌ డేవిస్‌ను చైనా వ్యవహారాల నుంచి తప్పించారు. ఆ తర్వాత రష్యాలో వేస్తే అక్కణ్నుంచి తీసేసి దక్షిణ అమెరికాలో వేశారు. అతనికి ఒళ్లు మండి ఉద్యోగానికి రాజీనామా చేసి, ఫర్నిచర్‌ వ్యాపారంలోకి దిగాడు. ఇక మిలటరీ పరంగా సలహా యిచ్చిన డేవిడ్‌ బారెట్‌ను బ్రిగేడియర్‌ జనరల్‌గా చేయకుండా అడ్డుపడ్డారు. తక్కువ స్థాయి ఉద్యోగంలో నియమించారు. 

స్వదేశం చేతిలో వీరి అవస్థ యిలా జరిగినా చైనాలో కమ్యూనిస్టులు మాత్రం వీరిని హీరోలుగా చూస్తారు. యానాన్‌లో కట్టిన విప్లవస్మృతుల మ్యూజియంలో వీరి ఫోటోలను ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. అదీ తమాషా! నిజానికి డిక్సీ మిషన్‌ వారి మాట అమెరికా అప్పుడు వినలేదు. మావోను శత్రువుగా చూసింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత దగ్గరైంది. నిక్సన్‌ హయాంలో స్నేహబంధం పునరుద్ధరింపబడ్డాక చైనా డేవిడ్‌ బారెట్‌కు ఘనస్వాగతం పలికి సత్కరించింది. దేశాల మధ్య సంబంధాలు కూడా గాలికోడి వాటంగానే వుంటాయని యిది నిరూపిస్తుంది.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2017)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?