మాథురుడు లేచే లోపున ఎక్కడో అక్కడ దాక్కోవాలని చూస్తున్న సంవాహకుడికి ఒక యింటి గుమ్మం తెరిచి కనబడింది. తొంగి చూస్తే వసంతసేన కనబడింది. 'ఆర్యురాలా, శరణు, శరణు' అని వేడుకున్నాడు. 'అభయం యిస్తున్నాను, లోపలకి రా' అని అతనితో చెప్పి దాసి మదనికకు చెప్పి తలుపు మూయించింది. సంగతేమిటి అనగానే 'తన శక్తిసామర్థ్యాలను గుర్తించి ఎత్తగలిగిన బరువు మాత్రమే ఎత్తుకుంటే జారిపడము. లేకపోతే నాలా జరుగుతుంది. అప్పులవారికి భయపడి మీ శరణు కోరుతున్నాను.' అన్నాడు.
ఈ లోగా మాథురుడు కళ్లు నులుముకుంటూ లేచి తన అనుచరుడితో సహా సంవాహకుడి కోసం వెతుకులాట ప్రారంభించాడు. అతని ముక్కు చితక్కొట్టాం కాబట్టి ఆ రక్తపు మరకలను అనుసరించి వెళదాం' అనుకుని వసంతసేన యింటి దాకా వచ్చి ఆమె గుమ్మం దగ్గర కాపుకాశారు.
ఇక్కడ వసంతసేన తన దాసి చేత సంవాహకుడి వివరాలు రాబడుతోంది. 'మాది పాటలీపుత్రం. నేను సంవాహక వృత్తి (ఒళ్లుపట్టడం)తో జీవించేవాణ్ని. కొత్త ప్రదేశాలు చూడాలని ఉబలాటంతో ఉజ్జయినికి వచ్చి ఒక ఉత్తముడి వద్ద పనిలోకి చేరాను. అతను రూపమే కాదు, స్వభావం కూడా సుందరమైనదే. తన శరీరం, తన ఆస్తిపాస్తులు పరులకోసమే అని భావిస్తాడు. ఏ ప్రచారమూ కోరకుండా దానధర్మాలు చేస్తాడు. శరణాగతవత్సలుడు.' అని చెప్పాడు.
ఇది వినగానే 'ఎవరబ్బా అతను? మా వసంతసేనను మెప్పించిన చారుదత్తుడితో పోటీపడగల యింకొకడు యీ నగరంలో వున్నాడా?' అని మదనిక ఆశ్చర్యపడితే వసంతసేన కూడా 'నేనూ అదే అనుకుంటున్నాను' అంది. సంవాహకుడు తన మాటలు కొనసాగిస్తూ 'ఆ మహానుభావుడు యిప్పుడు..' అని ఆగగానే 'ఐశ్వర్యం పోయి నిర్ధనుడైనాడా?' అని అడిగింది మదనిక. 'నేను చెప్పనిదే నీకెలా తెలిసింది?' అని సంవాహకుడు ఆశ్చర్యపడ్డాడు.
''తాగడానికి పనికిరాని నీళ్లున్న చెఱువులో నీళ్లు పెరుగుతాయి తప్ప తరగవు. ఇలాటి సందర్భాల్లో తరగడమే తప్ప పెరగవు. ఇంతకీ అతని పేరేమిటి?'' అంది మదనిక.
''చారుదత్తుడు''
ఆ పేరు వినగానే వసంతసేన దిగ్గున లేచి ''ఇది మీ యిల్లే అనుకో. మదనికా, ఆయనకు విసినికర్ర విసురు'' అంది. సంవాహకుడు ఆశ్చర్యపడి 'ఆహా చారుదత్తా బతుకంటే నీదే కానీ మాబోటి గాళ్లది కాదు. నీ పేరు వినగానే ఎన్ని ఉపచారాలు జరుగుతున్నాయ్!' అనుకుని వసంతసేనకు సాష్టాంగపడి 'దయచేసి యీ మర్యాదలు చాలు, మీరు మీ ఆసనంలో కూర్చోండి' అన్నాడు. 'కూర్చుంటానులే, నీ కథ కొనసాగించు' అంది వసంతసేన.
'సంపదలు పోవడంతో చారుదత్తుడు నన్ను పనిలోంచి తొలగించాడు. నేను బయటకు వచ్చి జూదగాడిగా మారాను. ప్రస్తుతం జూదంలో పది బంగారునాణాలు పోగొట్టుకున్నాను…''
ఇంతలోనే బయట నుండి మాథురుడి కేకలు వినబడ్డాయి – 'ఎక్కడికి పోతావురా?' అంటూ.
వసంతసేన మదనిక కేసి తిరిగి ''చెట్టు పడిపోతే కొమ్మల నాశ్రయించి వున్న పక్షులు చెల్లాచెదురు కావడం సహజం. ఇదిగో యీ బంగారు కంకణాన్ని బయటనున్న అప్పులవాళ్లకు యిచ్చి యితని యివ్వవలసినదానికి చెల్లు వేసుకోమని చెప్పు.'' ఆమె వెళ్లి బాకీ చెల్లు చేసి వచ్చిన తర్వాత సంవాహకుడు ''కృతజ్ఞుణ్ని. మీ ఋణం తీర్చుకోవాడనికి నన్ను మీ పనివాడిగా చేర్చుకోండి. అలా కాకపోతే నాకు వచ్చిన యీ కళను మీ పనివాళ్లకు నేర్పమంటే నేర్పుతాను.'' అన్నాడు.
''అదేమీ అక్కరలేదు.'' అని వసంతసేన ఔదార్యం చూపించింది.
సంవాహకుడు పశ్చాత్తాపం కలిగింది. ''జూదరిగా అందరి చేత అవమానాలు పొందాను, దెబ్బలు తిన్నాను. ఇకపై పదిమంది గౌరవాన్ని పొందదలచుకున్నాను. అందువలన బౌద్ధసన్యాసిగా మారుదామనుకుంటున్నాను.'' అన్నాడు.
''అంత సాహసమా?'' అని వసంతసేన వారించబోతే ''లేదు, యికపై రాజవీధిలో తలెత్తుకుని బతుకుతాను, దొంగలా నక్కినక్కి తిరగను. మీలాటి సజ్జనులకు యిబ్బంది కలిగించను'' అని దృఢంగా పలికి బయటకు వెళ్లిపోయాడు.
వసంతసేనకు ఖుంటమోదకం అనే ఏనుగు వుంది. అది కట్లు తెంచుకుని వీధిలో పడింది. జనాలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూన్నారు. అప్పుడే బయటకు వెళుతున్న సంవాహకుణ్ని తొండంతో ఎత్తి నేలకేసి కొట్టబోయింది. అది చూసి వసంతసేన వద్ద గతంలో పనిచేసిన కర్ణపూరకుడు అనేవాడు ఏనుగును అదలించి, అతన్ని రక్షించాడు. చుట్టూ మూగిన ప్రజలు మెచ్చుకున్నారు. అటుగా వస్తున్న చారుదత్తుడు వట్టి మాటలతో సరిపెట్టకుండా తనకు బహుమతిగా వచ్చిన జాజిపూల అత్తరు పూసిన ఉత్తరీయాన్ని కానుకగా యిచ్చాడు.
అది తీసుకుని అతను లోపలికి వచ్చి వసంతసేనకు జరిగినదంతా చెప్పి ఆ ఉత్తరీయాన్ని చూపించాడు. అది చూడగానే వసంతసేన మురిసిపోయి, అతనికి ఒక నగ కానుకగా యిచ్చి ఆ ఉత్తరీయాన్ని తీసుకుంది. 'చారుదత్తుడు యింటికి వెళుతూంటాడు, మేడెక్కి చూద్దాం పద' అని మదనికను తీసుకుని మేడెక్కింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)