Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ప్రచార ఆర్భాట ఫలం- పుష్కర విషాదం- 4

అన్నిటికన్నా ట్రాజెడీ ఏమిటంటే చుట్టూ టీవీ ఛానెళ్ల ఓబి వాన్లు తప్ప 108 వ్యానులు లేవు. కింద పడినవాళ్లకు వెంటనే మంచినీళ్లు యిచ్చి వుంటే కొంతమందైనా బతికేవారట. అవి కూడా అందుబాటులో లేవు. మరణాల తర్వాత 108 కోసం ఎనౌన్సు చేసినా ఎక్కడా స్పందన లేదు. 10.20కు వచ్చినా ఎక్కడో ఆగాయి. అదృష్టవశాత్తూ సిఎంకు ఏ ప్రమాదమూ జరగలేదు కానీ ఏదైనా జరిగి వుంటే పరిస్థితి ఎలా వుండేదో వూహించండి. ఇంకో రెండు రోజులు పోయాక ఒక రేవులో రివాల్వర్‌ కనబడింది. ఎవరి నుండి ముప్పు వచ్చినా పెను అనర్థమే జరిగేది. గాయపడినవారిని 12.30 వరకు ఆసుపత్రికి తరలిస్తూనే వున్నారు. అక్కడ సౌకర్యాలు లేవట. వారికి పుష్కర సందర్భంగా యిచ్చిన అదనపు నిధులు లేవుట. 

1650 కోట్లు యిచ్చామన్నారు ఏమయ్యాయి అని అందరూ అడుగుతున్నారు. దానిలో ప్రచారానికి ఎంత పోయిందో తెలియదు. ఎన్టీయార్‌ విగ్రహానికి ఎంత కేటాయించారో ఏమో! జరిగినదేమిటంటే అనేక చిన్న రేవుల్లో ఘాట్‌లు కట్టేశారు, అక్కడ తాగునీటి సౌకర్యం అవీ కల్పించారు. కానీ జనం లేరు. డిమాండ్‌ లేని రూట్లో ఆర్టీసీ బస్సే వేయరు కదా, అన్ని ఘాట్లు కట్టడం దేనికి? ఆంధ్ర మొత్తానికి 30 ఘాట్లు కట్టి వాటికే అన్ని సౌకర్యాలు కల్పిస్తే సరిపోయేది. కానీ తక్కిన వూళ్లలో ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లూ వూరుకుంటారా? వాళ్ల కోసం కట్టారన్నమాట. అది కూడా టెండర్లు పిలవకుండా నామినేషన్‌ పద్ధతిన అస్మదీయులకు యిచ్చేశారు. తెలంగాణలో అయితే మరీ ఘోరం. నీళ్లు లేని చోట, జనం రాని చోట కూడా ఘాట్లు కట్టేశారు. జనాలంతా భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంకే వెళ్లారు. దాంతో ట్రాఫిక్‌ జామ్‌లు. ఆ మూడిటికి విశాలమైన రోడ్లు వేయడమో, బైపాస్‌ రోడ్లు వేయడమో చేసి వుంటే యీ అవస్థ తప్పేది.

ఆంధ్రలో ఫోకసంతా రాజమండ్రి మీద పెట్టారు కానీ ఊళ్లో పనులు సరిగ్గా జరగటం లేదని రాజమండ్రి మిత్రుల ద్వారా నా బోటివాడికే తెలుసు. పనులు మొదలుపెట్టి రెండు నెలలే అయిందని, ఏదీ సవ్యంగా సాగటం లేదని, మెయిన్‌ డ్రైనేజీ కాలువకు సిమెంటు కవర్లు రెండు రోజుల ముందే వేశారనీ చెప్తూనే వున్నారు. టీవీలు కూడా చూపించాయి. రోడ్లన్నీ తవ్వేయడం జరిగింది కానీ వేయలేదన్నారు. ఇవన్నీ ప్రభుత్వాన్ని నడిపేవాళ్లకు తెలియకుండా వుంటుందా? ఆర్గనైజ్‌ చేయడానికి కమిటీ వేసి దాన్ని జపాన్‌ తీసుకెళ్లారు! బాబు వెళ్లి పోయిన తర్వాత జరిగిన ఘటనకు ఆయన్ని బాధ్యుణ్ని చేస్తే ఎలా, అయినా పాపం అన్నీ ఆయన  ఒక్కరే చూసుకుంటున్నారు అని కొందరు జాలిపడుతున్నారు.

ఒక్కరే చూసుకోవడానికి యిదేమైనా ఆయన యింటి వ్యవహారమా? ప్రభుత్వం వుంది, జీతాలు యిటీవలే భారీగా పెరిగిన ఉద్యోగులున్నారు, వారు సరిగ్గా చేస్తున్నారో లేదో గమనించడానికి ప్రజాప్రతినిథులున్నారు. ఈయన ఎండోమెంట్స్‌ మినిస్టర్‌తో సహా ఎవరికీ బాధ్యత అప్పగించలేదు. ఘటనకు బాబు బాధ్యత గురించి జగన్‌ విమర్శిస్తే 'పుష్కరాలకు ముందు జగన్‌ సలహాలెందుకు యివ్వలేదు?' అని టిడిపి నాయకులు అడగసాగారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు వదిలేయండి. మిత్రపక్షానికి చెందిన ఎండోమెంట్స్‌ మినిస్టర్‌, స్థానిక ఎమ్మెల్యేను కూడా సంప్రదించలేదు. అఖిలపక్షసమావేశం అనేది డిక్షనరీలోనే లేదు. కేదార్‌నాథ్‌లో విపత్తు జరగలేదా అని కొందరి వాదన. ఆనాడు అక్కడ బీభత్సం సృష్టించినది ప్రకృతి. కొన్నేళ్లగా జరిగిన మానవ తప్పిదాల వలన అది భీకరస్థాయికి చేరింది. ఇక్కడ పూర్తిగా మానవకృతం. పబ్లిసిటీ యావ!

నా దృష్టికి వచ్చిన కొన్ని లోపాలు - రాజమండ్రిలో ఎక్కడ ఏ రేవు వుందో ఎక్కడా డిస్‌ప్లే లేదు. ఫలానా రేవు 300 మీటర్ల దూరంలో వుంది, అక్కడ రద్దీ తక్కువ వుంది లాటి విషయాలతో ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే వుంటే జనాలు డిస్ట్రిబ్యూట్‌ అయ్యేవారు. అలాటిది లేదు. రాజమండ్రి మ్యాప్‌ డిస్‌ప్లే ఎక్కడా లేదు. వచ్చిన యాత్రికులకే కాదు, అక్కడ టెంపరరీగా పోస్టింగు యిచ్చిన పోలీసులకూ ఊరు తెలియదు. ప్రమాద స్థలం వద్ద వున్న వాళ్లు తమిళ పోలీసులట. బాధితుల ఘోష వాళ్లకు అర్థం కాలేదు. ఏ రేవుకైనా సరే కనీసం 2,3 కి.మీ. దూరం నడవాల్సిందే. బస్సులు అవసరానికి మించి వేయడంతో వాటి వలన ట్రాఫిక్‌ ఆగిపోతోంది.  వన్‌ వే ట్రాఫిక్‌ అంటూ అప్పటికప్పుడు పెట్టి తప్పు చేసిన ఆటోలను రోడ్ల మీద నుంచి రోజుల తరబడి విత్‌డ్రా చేశారట. దానితో ఆటోల కొరత. అసలు వూరు చేరే మార్గాలే బాగా లేవు. స్కూలు పిల్లలను తీసుకెళ్లే ఔటాఫ్‌ ఆర్డర్‌ బస్సులను పుష్కరాలకు కేటాయించారట. అవి దారి మధ్యలో ఆగిపోయి, తక్కిన వాహనాలు ఎటూ కదలకుండా అయిపోయిందట. ట్రాఫిక్‌ ఆర్గనైజేషన్‌ ఏమీ బాగా లేదట.

దారి మధ్యలో మంచినీళ్లు అందించే కేంద్రాలు, టాయిలెట్లు కూడా లేవు.  గంటకు 10 కి.మీ.ల చొప్పున వాహనాలు నడుస్తూ వుంటే ప్రయాణీకులకు అనేక అవసరాలు పడతాయి. అనేక వాహనాలను వూరికి దూరంగా ఆపేశారు. అన్నదానం చేయడానికి తెచ్చిన పాకెట్లున్న వాహనాలను కూడా విడిగా పంపే ఏర్పాటు లేదు. 108 వాహనాలు వెళ్లడానికీ విడిమార్గం లేదు. పేదలు వుండడానికి షెడ్డులు అవీ కట్టలేదు. కట్టిన వాటి గురించి ప్రచారం లేదు. దాంతో అవి ఖాళీగా వున్నాయి. ఇక్కడ పేదలు పడుక్కోవడం కాదు, కూర్చోడానికి కూడా చోటు లేక అవస్థ పడుతున్నారు. హోటళ్లు రోజు అద్దె తీసుకుని 12 గంటల్లోనే ఖాళీ చేయాలంటున్నారు. ప్రభుత్వం తరఫున క్యాంపులు లేవు.. యిలా చాలా విన్నాను. ఏర్పాట్లు సరిగ్గా చూసుకోకుండా రాజమండ్రిపైన యింత భారం వేయడం చాలా తప్పు. అసలు కుంభమేళా టైపులో రాజమండ్రిలో పుష్కరాలు పెట్టకుండా రాజమండ్రి, ధవళేశ్వరం మధ్యలో ఖాళీ స్థలం ఏదైనా చూసి ఓ టౌన్‌షిప్‌ నిర్మించి అక్కడ ఆర్గనైజ్‌ చేసి వుంటే బాగుండేది. రాజమండ్రిలో యిరుకిరుకు సందుల్లో వాహనాలు ఎలా తిరుగుతాయి?

ఇప్పుడు యాత్రికులు చచ్చిపోయారు కాబట్టి చంద్రబాబు కన్నీళ్లతో 'నా తప్పు వుంటే క్షమించండి' అంటున్నారు. ఉంటే అని క్వాలిఫై చేయడం దేనికి? తప్పు తనది కాదు, అధికారులదే అంటే హుదూద్‌ రిలీఫ్‌ కార్యక్రమాల ఘనత కూడా వారికే కట్టబెట్టాలి. కలక్టరుగారి నివేదిక ఏదో వుందంటున్నారు. ఆయనేం చెప్తారో చూదాం. ఇప్పుడీ దుర్ఘటన తర్వాత జనం రారేమోనన్న భయం బాబుగారికి పట్టుకుంది. తక్కిన 11 రోజులూ అక్కడే వుంటానంటున్నారు. అదే పొరపాటు. సిఎం అక్కడ వుంటే  నాయకులు, అధికారులందరూ ఆయన కళ్లల్లో పడాలన్న యావతో జనాలను మానేసి ఆయన్ను సేవిస్తూ కూర్చుంటారు. ఆయన హైదరాబాదులోనే కూర్చుని రిపోర్టులు తెప్పించుకుంటే చాలు.

అన్నీ దగ్గరుండి చూసుకోవడం, డెలిగేట్‌ చేయకపోవడం మంచి మేనేజ్‌మెంట్‌ కాదు. ఆయనకు వచ్చినది మీడియా మేనేజ్‌మెంట్‌. ఆసుపత్రిలో పడిన యాత్రికుల కథనాలు టీవీ ఛానెల్స్‌లో రావటం లేదు. 27 మంది పోయారని, ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని మొదటి రోజు వచ్చింది. ఆ తర్వాత 27 దగ్గర ఆగిపోయింది. సాక్షి మాత్రం యివాళ 29 అంది. తక్కిన వారి పరిస్థితి ఏమిటో ఒక్క పేపరుగాని, టీవీ గాని చెప్పటం లేదు. మామూలుగా అయితే వాళ్లు ఫిర్యాదులు చేస్తున్న టెలికాస్టులు వచ్చేవి. వాటిని ఆపేసి వుంటారు. బాబు ఎడ్మినిస్ట్రేషన్‌ అద్భుతంగా వుంది, ఆయన పదికాలాల పాటు వర్ధిల్లాలి అని జనాల చేత చెప్పించి, రిపోర్టర్ల చేత కథనాలు ప్రసారాలు చేస్తున్నారు. పుష్కరాలకు ఎంతమంది జనం వచ్చారన్న సంఖ్య కూడా గందరగోళంగా వుంది. తొలి 6 రోజుల్లో ఆంధ్రలో 2 కోట్లు, తెలంగాణలో 1 కోటి గోదావరి స్నానాలు చేశారని ఒక పేపరు రాస్తే, అబ్బే ఆంధ్రలో 3, తెలంగాణలో 2 అంటున్నారు. ఇలాటి అతిశయోక్తుల ప్రచారమే యిక్కడిదాకా తీసుకువచ్చింది. ఇప్పటికైనా దానికి కళ్లాలు వేస్తే మేలు. - (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?