Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హత్య - 69

ఆగస్టు 18 రాత్రి కర్ణాటక పోలీసు కమిషనర్‌ ఎన్‌ఎస్‌జి దళాధిపతికి బెంగుళూరులో కోనన కుంటె శిబిరం గురించి చెప్పగానే సిట్‌లో సంచలనం రేగింది. సిట్‌లో అంతర్భాగంగా పనిచేస్తున్న 'శివరాజన్‌ వేట దళం', ఎన్‌ఎస్‌జి కలిసే పని చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌జి నుంచి కబురు రాగానే వేట దళం కోననకుంటెకు పరుగు పెట్టింది. మృదులను పట్టుకుని విడిగా మళ్లీ ప్రశ్నించారు. శిబిరంలో వున్న వాళ్లను వర్ణించమన్నారు. ఆమె చెప్పిన వర్ణనల బట్టి లోపల వున్నవాళ్లెవరో నిర్ధారించుకున్నారు. ఇక దాడి చేయాలి? ఎలాటి దాడి చేయాలి అన్న తర్జనభర్జన ప్రారంభమైంది. 

శివరాజన్‌ శిబిరం సంగతి తెలిస్తే ఎలా వ్యవహరించాలో చాలా రోజులుగా వారు చర్చలు జరుపుతున్నారు. ఇందిరా నగర్‌ దాడిలో అరసన్‌, కుంతలన్‌ చిక్కినట్లే చిక్కి సైనైడ్‌ మింగి ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్లు దడిసిపోయారు. వాళ్ల కంటె ఆరితేరిన వీళ్లను సజీవంగా పట్టుకోవడం ఎలా? సజీవంగా పట్టుకోలేకపోతే ఏం చేయాలి? చెన్నయ్‌లోని సిట్‌ కార్యాలయంలో కొన్ని రోజుల క్రితం జరిగిన సమావేశంలో వేటదళం సారథి - సిబిఐ డైరక్టరు విజయ కరణ్‌ను  - 'శివరాజన్‌ ముఠా ఎక్కడున్నారో తెలియగానే మేం వాళ్ల శిబిరంపై వెంటనే దాడి చేయవచ్చా? గత్యంతరం లేని పరిస్థితుల్లో, అంటే సజీవంగా దొరకరు అనుకుంటే, వారిని చంపివేయవచ్చా?' అని అడిగాడు. మామూలు పరిస్థితుల్లో అలా అడగవలసిన అవసరం లేదు. పరిస్థితుల తీవ్రత బట్టి అతనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ యీ కేసులో షణ్ముగం ఆత్మహత్య (?) తర్వాత చెలరేగిన గొడవ కారణంగా అతనికి బెదురు పుట్టి అడిగాడు. దానికి విజయ్‌ కరణ్‌ - ''శివరాజన్‌, శుభ చావడం ఖాయమని తెలిసిన పక్షంలో వాళ్లని చావనివ్వకుండా, పారిపోనివ్వడమే మంచిది. ఎందుకంటే మరోసారైనా వాళ్లని సజీవంగా పట్టుకునే అవకాశం వుంటుంది.'' అని జవాబిచ్చాడు. సిబిఐ చీఫ్‌ దృక్పథం అలా వుంది. 

ఇప్పుడు బెంగుళూరు పోలీసులు శిబిరం చుట్టూ మోహరించక పోయి వుంటే ముఠా వారూహించలేని విధంగా మెరుపుదాడి చేసేవారు. కానీ యీ మోహరింపు వలన శివరాజన్‌ ముఠా ఎలర్ట్‌ అయిపోయి వుంటుంది. కాల్పులు, ఎదురు కాల్పులు తప్పవు. ఏం చేయాలి? వేటదళం వారు పని మీద హైదరాబాదు వెళ్లిన కార్తికేయన్‌ను ఫోన్‌పై సంప్రదించారు. ''ఈ మోహరింపు గురించి శివరాజన్‌ ముఠా ఎలర్ట్‌ కావడానికి ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్సెస్‌ వున్నాయి. మనం ఛాన్స్‌ తీసుకుందాం. తెల్లవారే లోపున మెరుపు దాడి చేసేయండి.'' అన్నారు కార్తికేయన్‌. వాళ్లు సరే అన్నాక మొత్తం ఎంతమంది బ్లాక్‌ క్యాట్‌ కమెండోలున్నారు? అని అడిగి, వాళ్లు సరిపోరు, బెంగుళూరు నుంచి మొత్తం బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను రప్పించండి అన్నారు. రెండు గంటల్లో వాళ్లంతా వచ్చేశారు. 

xxxxxxxxxxxxxxxx

ఆగస్టు 18 పొద్దున్న తన భార్యను బావమరిది దగ్గరకు పంపించి దారిలో టెంపో దిగేసిన రంగనాథ్‌ అక్కణ్నుంచి తన స్నేహితుడు ఎల్‌టిటిఇ టైగర్‌ అయిన ప్రేమ్‌ కుమార్‌ను కలిశాడు. అతను గాయపడిన ఎల్‌టిటిఇ తీవ్రవాదులకు చికిత్స చేస్తూంటాడు. ఇద్దరూ కలిసి సాయంత్రానికి బావమరిది యింటికి వెళ్లారు. కానీ అక్కడ యిల్లు తాళం వేసి వుంది. ఇరుగుపొరుగుని అడిగితే పోలీసులు వచ్చి వాళ్లని తీసుకెళ్లారని చెప్పారు. రంగనాథ్‌కు భయం వేసింది. స్నేహితుడితో కలిసి ఒక లాడ్జికి వెళ్లి రాత్రంతా అక్కడే పడుక్కున్నాడు.

ఆగస్టు 18 అర్ధరాత్రి. 19 వ తారీకు ప్రవేశించింది. అందరూ వచ్చేశారని కార్తికేయన్‌కు ఫోన్లో చెప్పారు. ''ఇక జాప్యం చేయకండి. వెంటనే రంగంలోకి దిగండి.'' అని ఆదేశం యిచ్చారాయన. అయితే వేటదళానికి సందేహం వచ్చింది - 'కార్తికేయన్‌ ఛాన్సు తీసుకోమంటున్నారు, కానీ విజయ్‌ కరణ్‌ ఏమంటారో? ఆయన సజీవంగా పట్టుకోలేకపోతే పారిపోనివ్వండి అంటారేమో, కనుక్కుంటే మంచిది కదా' అనుకుని ఢిల్లీలో వున్న ఆయనకు ఫోన్‌ చేశారు. అంతా విన్నాక విజయ్‌ ''వాళ్లు సైనైడ్‌ మింగడం ఖాయం. మీ దగ్గర విరుగుడు మందులు రెడీగా వున్నాయా?'' అని అడిగాడు. 

''ఉన్నాయి.'' 

''అవి ఎక్స్‌పైర్‌ అయిపోలేదని, తప్పకుండా పని చేస్తాయనీ నమ్మకం వుందా?'' 

''అది మేమెలా చెప్పగలం? అవి యిచ్చినా కులతన్‌ రెండు రోజులు ఎక్కువ బతికాడు తప్ప చావు తప్పించుకోలేకపోయాడు''

''ఇలాటి పరిస్థితుల్లో తొందర పడకండి, నేను తక్షణం వచ్చేస్తా, పరిస్థితులు గమనించి, నేను గ్రీన్‌ సిగ్నల్‌ యిచ్చేదాకా కాస్త ఆగండి'' అన్నారు. 

''అప్పటిదాకా ఆగితే అనర్థమేమో, మీరు అనుమతి యిచ్చేయండి, ఛాన్సు తీసుకుందాం'' అంటూ వేటదళం సారథి, పోలీసు కమీషనరు ఆయన్ని బతిమాలారు. అయినా ఆయన వినలేదు. 

ఆయన లాజిక్‌ వేరు. ఇప్పటికే ఆలస్యమైంది. శివరాజన్‌ ముఠా సైనైడ్‌ గొట్టాలు మింగేయడం ఖాయం. అలా మింగేసిన కొన్ని నిమిషాల్లోనే వాళ్ల చేత విరుగుడు మందులు నిపుణుడి పర్యవేక్షణలో మింగిస్తే, వాళ్లను చావకుండా చూడనివ్వచ్చు. ఆ మందులు, నిపుణుడు సిద్ధంగా లేకుండా దాడి చేయడం పొరబాటు. అందువలన ఆయన ఢిల్లీలో పనిచేసే సైనైడ్‌ విషప్రయోగాల నిరోధకాలలో నిష్ణాతుడైన డా|| రామాచారిని వెంటపెట్టుకుని బెంగుళూరుకు విమానంలో బయలుదేరాడు. అంతేకాదు, అందుబాటులో వున్న ఎన్‌ఎస్‌జి దళాలు సరిపోవనీ, అదనపు దళాలు కావాలనీ ఆయన అంచనా. విజయ్‌ ఆ నిర్ణయం తీసుకున్నాక కార్తికేయన్‌ ఏమీ చేయలేక తక్షణం దాడి చేయాలన్న తన ఆదేశాన్ని తనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఎన్‌ఎస్‌జి దళాలు వచ్చే లోపుగా ఎవరినైనా అడ్డు పెట్టుకుని బంగళాలోకి ప్రవేశించడం ఎలా అని కర్ణాటక పోలీసులు, సిట్‌ దళాలు ఆలోచించసాగారు. లోపలకి వెళ్లే అవకాశం వున్నది పాలమనిషికి కదా. మునియమ్మ అనే ఆమె పాలు పోస్తూ వుంటుంది. ఆమె ద్వారా మత్తుమందు కానీ, విషం కానీ కలిపిన పాలను లోపలకి పంపిస్తే ఎలా వుంటుంది అని ఆలోచించారు. కానీ ఆ పాలను అందరూ ఒకేసారి తాగుతారన్న నమ్మకం ఏముంది? ఒకళ్లిద్దరు తాగి వాంతులు చేసుకుంటే మిగతావాళ్లు జాగ్రత్త పడిపోతారు. పోనీ మత్తు బిస్కట్ల లాటివి ఇళ్ల బ్రోకరు మునియప్ప ద్వారా పంపితే..? అతనితో వాళ్లకు స్నేహమేమీ లేదు. అతనిచ్చిన బిస్కట్లు తింటారన్న గ్యారంటీ లేదు. వాళ్లకు ఆత్మీయురాలు మృదుల. ఆమెను పంపి, ఏవో కబుర్లు చెప్పి బయటకు రప్పిస్తే, వెంటనే మీదపడి స్వాధీనంలోకి తీసుకుంటే..? 

ఐడియా చెప్పినపుడు మృదుల సరేనని సిద్ధపడింది. 'రంగనాథ్‌, మృదుల తిరిగి వెళ్లకపోవడంతో యిప్పటికే వాళ్లకు అనుమానం వచ్చేసి వుంటుంది. మృదుల లోపలకి రాగానే ఆమెను చంపేసి, తర్వాత తమ ప్రాణాలు తీసుకోవచ్చు. లేదా ఆమెను అడ్డుపెట్టుకుని, చంపేస్తామని బెదిరిస్తూ తప్పించుకుందామని చూడవచ్చు' అనుకున్నారు. సిబిఐ చీఫ్‌, సిట్‌ చీఫ్‌ వచ్చి ఏం చేయాలో చెప్పేదాకా ఏమీ చేయకుండా వుండడమే మేలు అనుకున్నారు.  (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?