Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 1

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 1

నాకు చాలా నచ్చిన పత్రికా సంపాదకుడు వినోద్‌ మెహతా చనిపోయారు. అతని జీవితచరిత్రలో పత్రికాధిపతులు రాజకీయనాయకులకు ఎలా లొంగుతారో చెప్పిన విశేషాలు చాలా వున్నాయి కాబట్టి వాటితో కలిపి విపులంగా రాద్దామనుకుంటున్నాను. వినోద్‌లో నాకు నచ్చిన విషయమేమిటంటే - అతను అన్ని రకాల అభిప్రాయాలకూ తన పత్రికలో చోటిచ్చేవాడు. నిర్భయంగా వ్యవహరించడంతో బాటు నిష్పక్షపాతంగా వుండేవాడు. ఖుశ్వంత్‌ సింగ్‌ గొప్ప ఎడిటరే కానీ నెహ్రూ పట్ల, ఇందిర పట్ల, సంజయ్‌ పట్ల పక్షపాతి. వాళ్లని గుడ్డిగా సమర్థించడంలో తన పదవిని దుర్వినియోగం చేశాడు. ఎంజె అక్బర్‌  కూ రాజకీయ పక్షపాతాలున్నాయి. ఒకప్పుడు బిజెపి ఏం చేసినా తప్పనేవాడు, యిప్పుడు ఏం చేసినా రైటంటున్నాడు. వినోద్‌ వారూ వీరని లేకుండా ఎవరి గురించైనా సరే పాఠకుడికి నచ్చే వార్త అయి వుంటే వేసేసేవాడు. అనేకసార్లు చిక్కుల్లో పడ్డా పద్ధతి మార్చుకోలేదు. ఇంతా చేసి వినోద్‌కి పాత్రికేయ నేపథ్యం లేదు. గొప్ప కుటుంబ నేపథ్యమూ లేదు. 34 ఏళ్ల వయసులో యీ రంగానికి వచ్చాడు. అతని కెరియర్‌ మొదటి నుంచి నేను ఫాలో అవుతూనే వున్నాను. అతనంటే యిష్టం పెంచుకున్నాను.

1970లలో ఇంగ్లీషు మ్యాగజైన్లలో రూపాయిన్నరకు అమ్మే ఇలస్ట్రేటెడ్‌ వీక్లీదే రాజ్యం. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూపుది కాబట్టి పెద్ద సైజులో ప్రఖ్యాతుల వ్యాసాలు, ఫోటోలతో.. జబర్దస్త్‌గా వుండేది. హైదరాబాదులో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వచ్చేది కాదు కాబట్టి దాని కాలమిస్టులందరూ దీనిలో కనబడేవారు. చిన్నా, పెద్దా అందరూ చదివేవారు. ఖుశ్వంత్‌ సింగ్‌ సంపాదకుడిగా వచ్చిన దగ్గర్నుంచి నాబోటివాళ్లం కూడా ఎగబడి చదివేవాళ్లం. ఆ గ్రూపు నుంచే ఎంజె అక్బర్‌ సంపాదకుడుగా మన తెలుగు వీక్లీల సైజులో ''యూత్‌ టైమ్స్‌'' పత్రిక మంచి పేపరుతో, అందమైన డిజైన్‌తో, స్టయిలిష్‌గా వచ్చింది. ఖరీదు రూపాయే. బాగుందే అనుకుంటూండగానే మూతపడింది. అక్బర్‌ కలకత్తాలోని ఆనంద్‌ బజార్‌ గ్రూపుకి వెళ్లి ''సండే''కి ఎడిటర్‌ అయ్యాడు. అది కూడా రూపాయే. మన తెలుగు వీక్లీల సైజే. జర్నలిస్టులందరూ కొత్తవాళ్లు, యువతీయువకులు. రిపోర్టింగ్‌ చాలా వుండేది. వీక్లీలో సమీక్షా వ్యాసాలు వుంటే, దీనిలో న్యూస్‌ బోల్డంత వుండేది. వీక్లీకి గట్టి పోటీ యిచ్చింది. నేనైతే రెండూ చదివేవాణ్ని. వీటితో బాటు ''ఆన్‌లుకర్‌'', ''శంకర్స్‌ వీక్లీ'' అనే వారపత్రికలు, ''కారవాన్‌'' అనే పక్షపత్రిక, ''ఇమ్‌ప్రింట్‌'' అనే మాసపత్రిక రెగ్యులర్‌గా చదివేవాణ్ని. ''లింక్‌'', ''కరంట్‌'' వంటి బోరు పత్రికలు కూడా వుండేవి. ''బ్లిట్జ్‌'' చేసే హంగామా నాకు నచ్చేది కాదు. రూసీ కరంజియా తనను విప్లవవీరుడిగా, హీరోగా చూపుకుంటూ తన యిష్టాయిష్టాల బట్టి ఎవర్నయినా - షా ఆఫ్‌ ఇరాన్‌తో సహా- ఎత్తేసేవాడు, కుదేసేవాడు. మహేశ్‌ యోగి బహిరంగంగా నీళ్లపై నడిచి చూపిస్తాడని పెద్ద ప్రచారం చేసి పబ్లిసిటీ యిచ్చాడు. చివరకు ప్రదర్శన రోజున అందరి ఎదుట మహేశ్‌ యోగి నీళ్లల్లో జారిపడ్డాడు. 'అహంకారం ఎక్కువ కావడం వలన అవేళ అలా జరిగింది' అని సంజాయిషీ చెప్పుకున్నా, అవేళ కాదు కదా, ఇంకెప్పుడూ నీటి మీద నడిచి చూపించలేదు ఆ యోగి! అలా అతనికీి, కరంజియాకూ శృంగభంగం జరిగింది. 

ఆ రోజుల్లోనే ''డెబెనేర్‌'' మాసపత్రిక వచ్చింది. పేపరు దళసరిగా తెల్లగా వుండేది, పెద్ద ఫాంట్‌, లే ఔట్‌, డ్రాయింగ్స్‌ చూస్తే ఏదో ఫారిన్‌ మ్యాగజైన్‌లా వుండేది. (1975లోనే ''ఇండియా టుడే'' పక్షపత్రికగా వచ్చి మన మ్యాగజైన్లకు క్లాస్‌ నేర్పింది) మధ్యలో సెంటర్‌స్ప్రెడ్‌గా ముప్పావు నగ్నచిత్రాలు. కవర్‌పై అర్ధనగ్నచిత్రం, అప్పుడప్పుడు ఫోటో ఫీచర్‌ అని మూడు, నాలుగు పేజీలు అదే మోడల్‌తో బొమ్మలు. ఇవన్నీ యిండియన్‌ మోడల్స్‌తో వుంటే ఫారిన్‌ మోడల్‌తో దాదాపు నగ్నచిత్రం ఒకటి వుండేది. ధర రూ.3.50 వుండేదనుకుంటా. ఆదివారం సుల్తాన్‌బజార్‌, ఆబిడ్స్‌ పేవ్‌మెంట్ల మీద సెకండ్‌ హ్యాండ్‌ బుక్‌స్టాళ్లలో రూపాయికి పాత సంచికలు దొరికేవి. అలాటి బొమ్మలు తక్కిన పత్రికలు ఆ రోజుల్లో వేసే సమస్యే లేదు. వీక్లీ కానీ, సండే కానీ రెండు, మూడు నెలలకు వార్తా కథనంగా (అశ్లీల చలనచిత్రాలు, సమాజంలో దిగజారుతున్న విలువలు, సడలుతున్న సంసారబంధాలు... లాటి కవర్‌ స్టోరీ) అడ్డం పెట్టుకుని కవరు మీద వేస్తూండేవి. వెయ్యగానే రీడర్స్‌ మెయిల్‌లో ఎడిటర్లను శాపనార్థాలు పెడుతూ లేఖలు వచ్చేవి. డెబొనేర్‌ పాఠకులు మాత్రం యింకా.. యింకా అంటూ వుండేవారు. ఏ మాట కా మాట చెప్పాలంటే - ఖుశ్వత్‌ సింగ్‌ రాతల్లో చపలత్వం, అశ్లీలత కనబడుతుంది. చదువుతూంటే కొన్ని చోట్ల వెగటుగా వుంటుంది. వినోద్‌ ఎప్పుడూ అసభ్యంగా రాసేవాడు కాదు.

బొమ్మల కోసమే ఆ పత్రికను రుచి చూసినా, దానిలో కథనాలు నన్ను ఆకట్టుకున్నాయి. అదేమీ శృంగార పత్రిక కాదు. ఈ బొమ్మలు, జోక్స్‌కి ఒక పేజీ, లేడీ చాటర్లీస్‌ లవర్‌ లాటి నవల గురించి వ్యాసాలు వున్నా తక్కినదంతా రాజకీయ నాయకుల గురించిన వ్యాసాలు, యింటర్వ్యూలు అవీ వుండేవి. ఇదేదో మేధావుల పత్రికరా బాబూ, డిక్షనరీ పక్కన పెట్టుకుని మరీ చదవాలి అనుకునేవాణ్ని. కాలమిస్టులు కూడా అందరూ ప్రముఖులే. ఇలాటి తరహా మ్యాగజైన్లను 'మెన్స్‌' మ్యాగజైన్‌ అంటారని తర్వాత తెలిసింది. ఆ ప్యాకేజీ మాత్రం నాకు భలే నచ్చింది. ఎడిటర్‌ పేరు చూస్తే వినోద్‌ మెహతా అని వుంది.  కొన్నాళ్లకి ఆయన ఆ పత్రిక విడిచి వెళ్లిపోయాడు. నేను చదవడం మానేశాను. ఆ తర్వాత కొద్ది రోజులకే వినోద్‌ సంపాదకత్వంలో ''సండే అబ్జర్వర్‌'' రావడం మొదలుపెట్టింది. ''డెబెనేర్‌'' మీద ఎంత యిష్టం వున్నా కొత్త సంచిక ఎప్పుడూ కొనలేదు. సెకండ్‌ హ్యాండ్‌ బుక్‌స్టాల్లోనే కొన్నాను. ఎందుకంటే ''రీడర్స్‌ డైజస్ట్‌''లా ఆ వ్యాసాలు ఎన్ని నెలల తర్వాతైనా చదవవచ్చు. కానీ ''సండే అబ్జర్వర్‌'' అలా కాదు, ఏ వారానికి ఆ వారం ఫ్రెష్‌గా కొనాల్సిందే. దినపత్రికలా వార్తలు, ఫీచర్లు అన్నీ వుండేవి. అప్పటికది కొత్త ప్రయోగం. అది విపరీతంగా నచ్చేసింది. కొన్ని రోజులకు వినోద్‌ వెళ్లిపోయాడు. అతని తర్వాత ఖుశ్వంత్‌ కొడుకు రాహుల్‌ సింగ్‌ ఎడిటరుగా వచ్చాడు కానీ ఫ్లేవర్‌ పోయింది. క్రమంగా చదవడం మానేశాను. 1990లో అంబానీలు తీసుకుని, పదేళ్లు నడిపి మూసేశారట. నాకు ట్రాక్‌ పోయింది. ''సండే..'' తర్వాత వినోద్‌ ఎడిట్‌ చేసిన దినపత్రికలు ''ఇండియన్‌ పోస్ట్‌''  ''ఇండిపెండెంట్‌'' ''పయొనీర్‌'' మద్రాసులో దొరక్కపోవడం చేత వినోద్‌ ట్రాక్‌ కూడా పోయింది. 1995లో ఇండియా టుడే క్లాస్‌తో ''ఔట్‌లుక్‌'' అనే వారపత్రిక వినోద్‌ మెహతా సంపాదకత్వంలో వస్తోందని తెలియగానే ఎగిరి గంతేసి చందా కట్టేశాను. 

అప్పణ్నుంచి ''ఔట్‌లుక్‌'' ప్రతీ సంచికా చదువుతూనే వున్నాను. వాళ్లు 15 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా హైదరాబాదులో ఓ స్టార్‌ హోటర్లో ఫంక్షన్‌ పెట్టి పరిమిత ఆహూతుల ముందు ''హైదరాబాదు-దాని భవిష్యత్తు'' అని అంశంపై చర్చ నిర్వహించారు. వినోద్‌ మెహతాకు నన్ను పరిచయం చేయమని మిత్రులు మేల్కొటే గారిని కోరాను. శంకర్‌ మేల్కొటే సినిమాల్లో హాస్యపాత్రల్లో కనబడతారు కానీ పండితులు, బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన నిర్వహించిన మార్గదర్శి మార్కెటింగ్‌ ద్వారానే ''హాసం'' పంపిణీ అయింది. ''ఔట్‌లుక్‌'' పంపిణీ కూడా వారిదే. మేల్కొటేగారు నా గురించి పరిచయం చేశాక వినోద్‌ మెహతాతో 'డెబెనేర్‌ రోజుల్నించి నేను మీ అభిమానినే' అని చెప్పి సంతోషపడ్డాను. ఆయన చిరునవ్వు నవ్వి, మర్యాదకు రెండు మూడు మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన మీటింగులో రహేజా గ్రూపులో ఆడిటరుగా చేరి మేనేజ్‌మెంట్‌ తరఫునుండి పబ్లిషరు పోస్టులో వున్న పేరి మహేశ్వర్‌ అని తెలుగాయన మాట్లాడాడు. ''ఔట్‌లుక్‌'' ప్రారంభించినపుడు ఆయన భార్య అందిట - ''వినోద్‌ మెహతాను ఎడిటర్‌గా తీసుకుంటున్నారు. ఏం ముప్పు తెచ్చిపెడతాడో ఏమో, నువ్వు జైలుకి వెళితే ఎలా?'' అని. 'నువ్వేం భయపడకు. వినోద్‌ను జైల్లో పెట్టాకే నన్ను పెడతారు. జైల్లో నాకు కంపెనీ వుంటుంది' అన్నాట్ట యీయన. ఇదీ వినోద్‌ రెప్యుటేషన్‌. ఎప్పుడు ఓనరు కొంప ముంచుతాడో తెలియదు. అవన్నీ తన ఆత్మకథ ''లక్‌నవ్‌ బాయ్‌''లో రాశాడు. వాటిల్లోంచి కొన్ని ఘట్టాలు చెపుతాను. 

వినోద్‌కి అంత అవసరమా అని కొందరు ఫీలవ్వచ్చు. చాలామంది (ముఖ్యంగా ఎన్నారైలు- మరీ ముఖ్యంగా ఎన్నికలు రాబోతూండగా) నాకు రాస్తూ వుంటారు. 'ప్రస్తుత పత్రికలు ఏమీ బాగా లేవు. నేను తెలుగును/తెలుగువారిని/రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి ఒక వెబ్‌సైట్‌ పెట్టదలచుకున్నాను. మీరు దానికి తప్పకుండా రాయాలి. మీ పారితోషికమెంతో తిరుగుటపాలో తెలియపరచ వలసినది' అని. ఇలాటి ఉత్సాహం కలవారికి ఒక పత్రిక పెట్టడం ఎంత కష్టమో, టీమును ఎలా ఏర్పరచుకోవాలో, నడిపేటప్పుడు వచ్చే కష్టాలేమిటో వినోద్‌ కథలో తెలుస్తాయి. ఖుశ్వంత్‌ సింగ్‌ కథలో కూడా కొంత తెలియవచ్చు కానీ వినోద్‌ మనలో చాలామందిలా అసలుసిసలు మధ్యతరగతివాడు. వాళ్ల కుటుంబానికి పత్రికలతో, సాహిత్యంతో ఏ మాత్రం సంబంధం లేదు. జర్నలిస్టుల్లో చాలామంది జర్నలిజమో, కనీసం ఎమ్మే ఇంగ్లీషో చదివి వుంటారు. ఇతను అదీ చదవలేదు. బియ్యే థర్డ్‌ క్లాస్‌. వేరే వేరే పనులు చేసి, సిఫార్సులు ఏమీ లేకుండా అనుకోకుండా దీనిలోకి దూరాడు. ట్రిక్స్‌ ఆఫ్‌ ద ట్రేడ్‌ నేర్చుకున్నాడు. ఇప్పుడు వెబ్‌సైట్‌లు పెట్టి సంపాదకులు అవుదామనుకుంటున్నవారు చేతిలో ఎంతో కొంత వున్నవారు. పైగా ప్రింటులో వున్నంత రిస్కు వెబ్‌లో లేదు. వారికి వినోద్‌ జీవితం ఒక పాఠంగా వుంటుంది. వెబ్‌ పత్రికలు పెడదామన్న వుద్దేశం ఏ కోశానా లేనివారికి కూడా అతని జీవితంలోని ఎత్తుపల్లాలు ఆసక్తికరంగా వుంటాయి. చదివి చూడండి, మరీ బోరు కొడితే మానేద్దురు గాని... (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?