Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : మంత్రుల ప్రోగ్రెస్‌ రిపోర్టు

మంత్రులు పాఠశాలలను సందర్శించడానికి వచ్చినపుడు పరీక్షల్లో పిల్లలకు వస్తున్న మార్కులు తెలుసుకుని, పాఠాలు సరిగ్గా చెప్పటం లేదని ఉపాధ్యాయులను నిలదీయడం కద్దు. మరి మంత్రులే ప్రోగ్రెస్‌ రిపోర్టులు సబ్మిట్‌ చేయవలసి వస్తే...? అదీ మీడియా ముందు!? బిజెపి పార్టీ ఉపాధ్యకక్షుడు, మధ్యౖప్రదేశ్‌ వ్యవహారాల యిన్‌చార్జ్‌ అయిన వినయ్‌ సహస్రబుద్ధేకు పుట్టిన బుద్ధి యిది. 'మంత్రులు సాధారణంగా ప్రెస్‌తో సమావేశాలు పెట్టటం లేదు. తాము అనుకున్నది చెప్పడానికి నలుగురైదుగురు టీవీ కెమెరామన్లను పిలిచి ఏదో చెప్పేసి వెళ్లిపోతున్నారు. ప్రెస్‌ వాళ్లు ప్రశ్నలడిగితే జవాబులు దాటవేస్తున్నారు. అందుకని ప్రతీ మంత్రి మీడియాను పిలిచి, గత ఏడాదిలో తమ శాఖ ద్వారా ఏయే పనులు జరిగాయో వివరించి, విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానాలు యివ్వాలని మీరు చెప్పండి.' అని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ చౌహాన్‌కు చెప్పాడు. ఆయన మంత్రులను పిలిచి చెప్పాడు. ఇక డిసెంబరు 13 నుండి ఒకరి తర్వాత ఒకరు చొప్పున మంత్రులకు మూడింది. నరోత్తమ్‌ మిశ్రా అనే ఆరోగ్యమంత్రి గత పదేళ్లగా మంత్రిగా వున్నా యిలా న్యూస్‌ కాన్ఫరెన్సు పెట్టడం యిదే మొదటిసారి. ఇక చూసుకోండి, డెంగ్యూ జ్వరాలపై, మందుల సరఫరాపై, ఆరోగ్యశాఖ అధికారులపై వున్న అవినీతి ఆరోపణలపై, స్టెరిలైజేషన్‌ క్యాంప్‌ల్లో అవకతవకలపై, ప్రభుత్వాఫీసుల్లో సౌకర్యాల లేమిపై.. యిలా ప్రశ్నలు వర్షించాయి. ఇక తట్టుకోలేక మిశ్రా ''మీరు పేపర్లో చదువుతున్నవన్నీ శుద్ధ అబద్ధాలు'' అనేసి లేచ్చక్కాపోయాడు. అటవీశాఖా మంత్రి గౌరీశంకర్‌ షెజ్వార్‌ను 'మన రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గిపోతోంది. 'టైగర్‌ స్టేట్‌'గా మనకున్న గుర్తింపు పోయేట్టుంది. మీరేం చేయబోతున్నారు?' అని అడిగితే అతనికి ఒళ్లు మండి ''మా గుర్తింపు పోకుండా వుండాలంటే మీరెంతమంది వున్నారో మేం లెక్కపెట్టాలి, మీరంతా క్యూ కట్టి వరసలో నిలబడండి - అని పులులకు చెప్పలేం కదా' అన్నాడు.

వ్యవసాయశాఖ మంత్రి గౌరీశంకర్‌ బిసేన్‌ను 'రాష్ట్రంలో యూరియా దొరకక అవస్థ పడుతున్నారు. మీరేం చేయబోతున్నారు?' అని అడిగితే అతను కాస్సేపు ఆలోచించి 'మార్చి నాటికల్లా అందరికీ యూరియా అందేట్లు చేస్తాం' అన్నాడు. మార్చి నాటికి పంట ఎదిగి కోతల సీజను వస్తుందని, అప్పుడు యూరియాతో పని వుండదని తెలియని మంత్రి తన కోతలతో బయటపడిపోయాడు. అవినీతి ఆరోపణలున్న 120 మంది అధికారులపై కేసులు పెట్టలేదేం? అని సాధారణ పరిపాలనా మంత్రి లాల్‌ సింగ్‌ ఆర్యాను అడిగితే న్యాయశాఖ నుండి అనుమతి రాలేదన్నాడు. న్యాయశాఖ మంత్రిణి కుసుమ్‌ మెహ్‌ాడలే సమావేశం పెట్టినపుడు మీడియా నిలదీసింది. 'అలాటి కేసు మా దగ్గర ఒక్కటి కూడా పెండింగులో లేదు' అందామె. మరి ఎవరు అబద్ధం చెప్తున్నట్లు? అని సందేహం వస్తుంది కదా. ప్రెస్‌ను ఎదుర్కోవడానికి 20 మంది అధికారుల సైన్యంతో వచ్చింది కాబట్టి కుసుమ్‌ మాటే కరక్టయి వుండాలి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చెల్లెలు, మధ్యప్రదేశ్‌కు పరిశ్రమల మంత్రిణి అయిన యశోధరా రాజే ప్రెస్‌తో అక్షరాలా తలపడింది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా వాళ్లకు ఎదురుప్రశ్నలు వేయసాగింది. దాంతో విలేకరులు ఆమె సమావేశాన్ని బహిష్కరించారు. చివరకు పబ్లిక్‌ రిలేషన్స్‌ కమిషనర్‌ ఎస్‌.కె.మిశ్రా పూనుకుని, సర్దిచెప్పి సమావేశాన్ని పునరుద్ధరించాడు. ఈ సమావేశాల కసరత్తు పూర్తయేసరికి మంత్రులందరూ సామూహికంగా నిట్టూర్చారు. 'మా పరువు తీయడానికే యిదంతా. ఇన్నేళ్లగా ప్రజాజీవితంలో వున్నాం, ఎప్పుడూ యిలాటి అనుభవాలు ఎదురు కాలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేద్దామని అనుకుంటున్నారు. మాలో కొందర్ని పీకేయడానికి ముందు యీ నాటకం నడిపించారు. ఇప్పుడు మమ్మల్ని తీసేసినా ప్రజలు సరైన శిక్షే పడింది అనుకుంటారు తప్ప అయ్యో పాపం అనుకోరు.' అని వాపోయారు. 

మంత్రివర్గంలో మార్పుల మాట ఎలా వున్నా ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసుకు యిదంతా కనులవిందుగా, వీనులవిందుగా వుంది. 'వాళ్లేమీ సాధించలేదని వాళ్లే చెప్పుకున్నారు. మేము చెప్తూ వుంటే యిప్పటిదాకా కొట్టిపారేశారు. ఇప్పుడేమైంది?' అని ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి ప్రజల ప్రశ్నలను ఎదుర్కోవడం నాయకులకు చాలా కష్టమైన పని. రాజీవ్‌ హయాంలో దూర్‌దర్శన్‌లో వారానికి ఒక మంత్రి వచ్చి ప్రజా దర్బార్‌లో సమాధానాలు చెప్పవలసి వచ్చేది. చివరిలో ప్రధాని వస్తారన్నారు. కొన్ని వారాలు గడిచేసరికి మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి. ఆ షోకు హాజరు కామని మొండికేశారు. వరస చూసేసరికి రాజీవ్‌కూ భయం వేసినట్లుంది. అర్ధాంతరంగా ఆ కార్యక్రమం ఆగిపోయింది. మామూలు ప్రజలతోనే అంత తంటా వుంటే యిక కాకలు తీరిన మీడియాతో వేగడం మాటలా? అందుకే యీ మధ్యప్రదేశ్‌ ప్రయోగం తక్కిన బిజెపి పాలిత రాష్ట్రాలలో రిపీట్‌ అవుతుందో లేదో సందేహమే. బిజెపి మంత్రులిలా ప్రోగ్రెస్‌ రిపోర్టంటే భయపడుతున్నారు కానీ బిజెపి గవర్నరు రామ్‌ నాయక్‌ మాత్రం ఎవరు అడక్కపోయినా ప్రోగ్రెస్‌ రిపోర్టు వేయించి పంచిపెడుతున్నాడు. 80 ఏళ్ల యీ మహారాష్ట్ర రాజకీయవేత్త వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర పెట్రోలియం మంత్రిగా పనిచేశాడు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జులై 2014లో అతన్ని యుపి గవర్నరుగా వేశారు. వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్ర పరిపాలనలో, రాజకీయాల్లో తల దూరుస్తున్నాడు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రికి లేఖలు రాశాడు. విద్యుత్‌ కొరత వుందని రాశాడు. లోకాయుక్త యిచ్చిన నివేదికలపై చర్యలు తీసుకోలేదేం అని రాశాడు. ఇలా రాసి రంపాన పెడుతూనే ఉత్తర ప్రదేశ్‌ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌కు రాష్ట్ర కాబినెట్‌ ర్యాంకు కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేస్తే దానిపై సంతకం పెట్టలేదు. ''కేంద్రప్రభుత్వం కేంద్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌కు కేంద్ర కాబినెట్‌ పదవి యివ్వనపుడు మీరెందుకు యిస్తున్నారు?'' అని ప్రశ్నలు గుప్పించాడు. 

అంతటితో ఆగలేదు. ఫైజాబాద్‌లో అవధ్‌ యూనివర్శిటీలో మాట్లాడుతూ ''రామమందిరం సాధ్యమైన త్వరలో కట్టాలి.'' అని ఉపన్యసించాడు. పైగా ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను రాజ్‌భవన్‌కు డిన్నర్‌కు పిలిచాడు. గవర్నరు తన హోదాకు తగినట్టుగా ప్రవర్తించటం లేదని, కాషాయీకరణ చేస్తున్నాడని, రామమందిరం వంటి అంశాలను లేవనెత్తి మతకలహాలను ఎగదోస్తున్నాడని సమాజ్‌వాదీ పార్టీ ఆందోళన చేస్తోంది. ''రాజకీయ నాయకులను పిలిచినట్లుగానే మోహన్‌ భగవత్‌నూ పిలిచాను. పైగా అతను నా స్నేహితుడు.'' అన్నాడు గవర్నరు గారు. కాంగ్రెసుకు కూడా యితని వరస నచ్చటం లేదు. గవర్నరుగా తొలగించమని దేశాధ్యకక్షుడిని కోరింది. ఈ గొడవలు యిలా నడుస్తూండగానే తను గవర్నరుగా వచ్చి 90 రోజులు పూర్తయిన సందర్భం పురస్కరించుకుని ''రాజ్‌భవన్‌ మేఁ రామ్‌ నాయక్‌'' అనే 45 పేజీల పుస్తకం వెలువరించాడు. అతని సభలు, సమావేశాల గురించి పత్రికల్లో వచ్చిన వార్తలతో, సెమినార్లలో, ఫంక్షన్‌లలో అతనిచ్చిన ఉపన్యాసాలతో అతని కూతురు విశాఖా కులకర్ణి దాన్ని సంకలీకరించింది. ఇది ఎబ్బెట్టుగా లేదా? అంటే 'ఇది నాకు అలవాటే. నేను ప్రజాజీవతంలో వచ్చిన దగ్గర్నుంచి యిలాటి ప్రోగ్రెస్‌ రిపోర్టులు ప్రచురిస్తున్నాను. ''లోకసభలో రామ్‌ నాయక్‌'', ''లోక్‌ సేవక్‌ రామ్‌ నాయక్‌'' లాటి పేర్లు పెట్టి పుస్తకాలు వేస్తూ వచ్చాను. ఇదీ ఆ కోవకు చెందినదే'' అని జవాబిచ్చాడు రామ్‌ నాయక్‌. ఎంతైనా బొత్తిగా 90 రోజులకే రిపోర్టా!? 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?