Advertisement

Advertisement


Home > Articles - MBS

సర్దార్‌ సరోవర్‌ డామ్‌ ఎత్తు పెంచేది ఎవరికోసం?

మోదీ ప్రధాని అవుతూనే చేసిన పని - సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ ఎత్తు పెంచడానికి అనుమతి యివ్వడం. ఆ డామ్‌ ఎత్తును 121.92 మీటర్ల నుండి 138.68 మీటర్లకు పెంచాలని గుజరాత్‌ ప్రభుత్వం కోరిన కోరికను నర్మదా కంట్రోల్‌ అథారిటీ జూన్‌ 12 న యిచ్చింది. గుజరాత్‌లోని కరువు ప్రాంతాలకు నీళ్లు అందించే యీ పథకం వలన గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అనేకమంది నిర్వాసితులు అవుతారని మేధా పాట్కర్‌ వంటి కార్యకర్తలు 'నర్మదా బచావ్‌ ఆందోళన్‌' అనే సంస్థ ద్వారా అడ్డుకోవడానికి శతథా ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. నిర్వాసితులందరు మొత్తం 32,615 మంది వున్నారని వారందరి కష్టమూ తీర్చామని నర్మదా కంట్రోల్‌ అథారిటీ అంటుంది. కాదని నిర్వాసితులు, వారి తరఫున పని చేస్తున్న సంస్థలు రుజువులు చూపిస్తున్నారు. పునరావాసానికి చూపిన స్థలాలలో విద్యుత్‌, నీరు లేదని, నేల ఎగుడుదిగుడుగా వుందని చాలామంది వెళ్లటం లేదు. అనేకచోట్ల ఓవర్‌హెడ్‌ ట్యాంకులు కట్టినా 12 ఏళ్లగా అవి ఖాళీగానే వున్నాయి. పునరావాసానికి ప్రభుత్వం సేకరించిన భూమి వ్యవహారాల్లో కూడా అనేక వివాదాలు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన బోగస్‌ లాండ్‌ రిజిస్ట్రేషన్‌ స్కాములో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్న అభియోగంపై జస్టిస్‌ శ్రావణ్‌ శంకర్‌ ఝా కమిషన్‌ వేశారు. మహారాష్ట్రలోని 4277 మంది నిర్వాసితుల్లో వెయ్యి మందికి యింకా భూమి చూపించలేకపోయారు. పరిస్థితులు యిలా వుండగా యిప్పుడు మళ్లీ ఎత్తు పెంచితే నిర్వాసితులు కాబోతున్న 2.50 లక్షల మంది గతి ఏమిటని మేధా అడుగుతున్నారు. అబ్బే అంతమంది వుండరు అంటోంది నర్మదా అథారిటీ, ఎంతమంది వుంటారో చెప్పడం లేదు.

అసలు యిప్పుడు అర్జంటుగా ఎత్తు ఎందుకు పెంచుతున్నారో చెప్పండి అని గుజరాత్‌ రైతులే అడుగుతున్నారు. ఎందుకంటే ప్లాను ప్రకారం యిప్పటి ఎత్తులోనే 18 లక్షల హెక్టేర్లకు నీరు అందించాల్సి వుంది. కానీ 9.76 లక్షల హెక్టేర్లకు మాత్రమే అందింది. 9,633 గ్రామాలకు తాగునీరు యివ్వాల్సి వుంది, 7873 గ్రామాలకు మాత్రమే యిచ్చారు. దీనికి కారణం ఏమిటంటే కావలసినన్ని కాలువలు తవ్వలేదు. మన దగ్గర పోలవరం ప్రాజెక్టు కడతారో లేదో తెలియదు కానీ కాలువలు మాత్రం తవ్వుకుని కూర్చున్నారు. అక్కడ రివర్సులో వుంది వ్యవహారం. 2585 కి.మీ. బ్రాంచ్‌ కెనాల్స్‌ కట్టాలని ప్లాను వేస్తే - 2322 కి.మీ.లు పని చేస్తున్నాయి. 5112 కి.మీ.ల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ ప్లాన్‌ చేస్తే పూర్తయినవి 3103 కి.మీ., 18413 కిమీల మైనర్‌ కెనాల్స్‌ కడతామని చెప్పి కట్టినది 8779 కిమీ.లు. సబ్‌ మైనర్‌ కెనాల్స్‌ అయితే మరీ అన్యాయం 48,058 కిమీలు అని చెప్పి 10,217 కిమీలు కట్టారు. ఇప్పటిదాకా గుజరాత్‌ ఏలిన మోదీ హయాంలో జరిగినది యిది. ఎందుకిలా అంటే సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌ లి.కి చైర్మన్‌గా గతంలో పనిచేసిన సనత్‌ మెహతా ''కాలువల నిర్మాణానికి కావలసిన బజెట్‌ను ప్రతీ ఏడాది తగ్గిస్తూ పోయారు. చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం.'' అన్నారు. 

మరి కాలువల నిర్మాణం పూర్తి చేయకుండా యిప్పుడీ ఎత్తు పెంచడం దేనికి? అంటే 'ఇది రైతులకు మేలు చేయడానికి కాదు, వాళ్ల పేరు మీద పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి' అంటున్నారు. డ్యామ్‌ కట్టినపుడు 2 లక్షల ఎకరపుటడుగు నీటిని పరిశ్రమలకు యిస్తామని చెప్పారు. ఇప్పటికే 2.5 లక్షల ఎకరపుటడుగుల నీటిని అందిస్తున్నారు. ''ఇప్పుడిలా పెంచి, 'కాలువలు పూర్తి కాలేదు కాబట్టి యీ నీటిని పరిశ్రమలకు మళ్లిస్తాం' అంటారు.'' అని స్వచ్ఛంద సంస్థలు చెపుతున్నాయి. వారి వాదనను ఖండించాలంటే గుజరాత్‌ ప్రభుత్వం ముందుగా కాలువల నిర్మాణం పూర్తి చేసి అప్పుడు ఎత్తు పెంచమని అడగాలి. దానితో బాటు నిర్వాసితుల కష్టాలు పూర్తిగా తీర్చాలి. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?